సోమవారం 01 మార్చి 2021
Warangal-city - Jan 30, 2021 , 00:25:37

6 నుంచి తెలంగాణ రాష్ట్ర అర్చక రథయాత్ర

6 నుంచి తెలంగాణ రాష్ట్ర అర్చక రథయాత్ర

  • యాదాద్రి దేవాలయం నుంచి ప్రారంభం : గంగు ఉపేంద్ర శర్మ

హన్మకొండ చౌరస్తా, జనవరి 29 : తెలంగాణ రాష్ట్ర అర్చక రథయాత్ర  ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు అర్చక, ఉద్యోగ కార్యాచరణ సమితి రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. శుక్రవారం హన్మకొండలోని వేయిస్తంభాల దేవాలయం కుడా గార్డెన్‌లో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపేంద్రశర్మ మాట్లాడుతూ ఫిబ్రవరి 6 నుంచి 17 వరకు జరిగే అర్చక రథయాత్రను యాదాద్రి లక్ష్మీనర్సింహస్వా మి దేవస్థానం నుంచి ప్రారంభించి 17న హైదరాబాద్‌ కర్మాన్‌ ఘాట్‌ ఆంజనేయ స్వామి దేవాలయంలో ముగించనున్నట్లు తెలిపారు. ఈ యాత్ర లో భాగంగా 2,544 దేవాలయాల్లో 11 రోజుల పాటు పూజలు నిర్వహించనున్నట్లు చెప్పారు. 8వ తేదీన వరంగల్‌ జిల్లాలో ప్రవేశించి భద్రకాళి దేవస్థానం, వేయిస్తంభాల దేవాలయంలో దేవతామూర్తులకు సప్తజలాలతో అభిషేకాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రభుత్వం, పాలకులు, కర్షకులు, శ్రామికులు, బడుగు, బలహీన వర్గాల ప్రజ లు అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ రథయాత్ర చేపడుతున్నట్లు చెప్పారు. ధూప, దీప, నైవేద్య పథకంలో 3,640 దేవాలయ అర్చకులకు వేతనాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని తెలిపారు.  ఈ కార్యక్రమంలో ధూప, దీప, నైవేద్య జిల్లా అధ్యక్షుడు పారుపల్లి ఉపేందర్‌శాస్త్రి, ప్రధాన కార్యదర్శి వచ్చునూరి దేవేందర్‌శర్మ, గౌరవ సలహాదారు రామగిరి నరేంద్రచార్యులు పాల్గొన్నారు.

VIDEOS

logo