బుధవారం 02 డిసెంబర్ 2020
Wanaparthy - Aug 19, 2020 , 03:30:44

ఎడ్మది గొప్ప వ్యక్తిత్వం

ఎడ్మది గొప్ప వ్యక్తిత్వం

కల్వకుర్తి రూరల్‌ : ప్రజా సమస్యలపై అహర్నిషలు అలుపెరగని పోరాటం చేసిన గొప్ప వ్యక్తిత్వం, విలువలు కలిగిన మహోన్నతుడు మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి అని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఒమెగా దవాఖానలో అనారోగ్యంతో బాధపడుతూ ఎడ్మ కిష్టారెడ్డి మృతి చెందగా.. కల్వకుర్తి పట్టణంలోని ఆయన స్వగృహానికి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, నాగర్‌కర్నూల్‌ ఎంపీ రాములు, ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు, ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్‌, మర్రి జనార్దన్‌రెడ్డి, అంజయ్య, లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్‌కర్నూల్‌ జెడ్పీ చైర్‌ పర్సన్‌ పద్మావతి, వైస్‌ చైర్మన్‌ బాలాజీ సింగ్‌తోపాటు మాజీ మంత్రులు జూపల్లి కృష్ణారావు, చిత్తరంజన్‌దాస్‌ ఆయన పార్థివ దేహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కిష్టారెడ్డి వార్డు సభ్యుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారని గుర్తు చేశారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా కల్వకుర్తి ప్రజలకు సేవలందించారని తెలిపారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజా నాయకుడిగా ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారని పేర్కొన్నారు. నాడు రైతులకు ఉచితంగా విద్యుత్‌ అందించాలని కోరుతూ ఆమరణ నిరాహార దీక్ష చేసి కరెంట్‌ కిష్టన్నగా పేరుగాంచారని గుర్తు చేశారు. ఎంపీ రాములు మాట్లాడుతూ గత శాసనసభ, పార్లమెంట్‌ ఎన్నికలలో తమకు మద్దతుగా ప్రచారం చేశారన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎంజీకేఎల్‌ఐ పూర్తి చేసి నీరందించడంతో రైతుల కండ్లల్లో సంతోషాన్ని చూసి సంబురపడేవారన్నారు. ఆయన మృతి పార్టీకి, కల్వకుర్తి ప్రజలకు తీరని లోటని ఆయనన్నారు. అనంతరం ఎడ్మ కుటుంబ సభ్యులను మంత్రి, ఎంపీ తదితరులు పరామర్శించి ఓదార్చారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే ఏఎంసీ చైర్మన్‌ బాలయ్య, జెట్పీటీసీలు భరత్‌ప్రసాద్‌, విజితారెడ్డి, వెంకటేశ్‌, ఎంపీపీ సునీత, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు విజయ్‌గౌడ్‌, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఆయన పార్థివ దేహానికి పూల మాలలు వేశారు. 

అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు 

వెల్దండ : ఎడ్మ కిష్టారెడ్డి అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం అశ్రునయనాల మధ్య కొనసాగాయి. అంత్యక్రియలకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు ఎంపీ రాములు, విప్‌ గువ్వల బాలరాజు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మాజీ మంత్రులు, నాయకులు పాల్గొన్నారు. ఆత్మీయనేతకు అంతిమ వీడ్కోలు పలికారు. కిష్టారెడ్డి మృతితో ఆయన కుమారుడు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించడంతో అక్కడికి వచ్చిన వేలాదిమంది కంటతడి పెట్టారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు గోళి శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీటీసీలు విజితారెడ్డి, కేవీఎన్‌రెడ్డి, భరత్‌ప్రసాద్‌, ప్రముఖ కవి, గాయకుడు గోరటి వెంకన్న, సింగిల్‌విండో చైర్మన్‌ భాస్కర్‌రావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బాలయ్య, వైస్‌ చైర్మన్‌ విజయ్‌గౌడ్‌ తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.