సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - Jul 26, 2020 , 01:08:34

ప‌థ‌కం ప‌న్నారు... హ‌త్య చేశారు

ప‌థ‌కం ప‌న్నారు... హ‌త్య చేశారు

  • డబ్బులు, వెండి వస్తువుల కోసం వృద్ధుడి హత్య
  • ముగ్గురు మహిళలను అరెస్టు చేసిన పోలీసులు 
  • వివరాల వెల్లడించిన సీఐ లక్ష్మీరెడ్డి 

పరిగి : డబ్బులు, వెండి వస్తువుల కోసం వృద్ధుడిని పథ కం ప్రకారం హత్య చేసిన ముగ్గురు మహిళలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరిగిలోని పోలీసు సర్కిల్‌ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ లక్ష్మీరెడ్డి తెలిపిన వివరాల ప్రకా రం... కులకచర్ల మండల కేంద్రానికి చెందిన వడ్డె రాములు (65), 2020 ఫిబ్రవరి 12న హత్యకు గురయ్యారు. మృతుడి మూడో బిడ్డ వడ్డె సంతోష ఫిర్యాదు మేరకు కులకచర్ల ఎస్‌ఐ వెంకటేశ్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. తమ ఇంటి సమీపంలో ఉండే దేవమ్మ, ఆమె కూతుళ్లపై అనుమానం ఉందని తెలియజేయడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. కులకచర్లలోని కిందికేరిలో వడ్డె రాములు కూతురు తిమ్మమ్మకు ఇల్లు కట్టించేందుకు గతంలో బేస్‌మెంట్‌ వరకు నిర్మాణం జరుగగా మిగతా పనులు చేయిద్దామని రాములు నిర్ణయించాడు. వడ్డె రాములు ఇంటి సమీపంలో ఉండే దేవమ్మకు ఈ విషయం తెలియడంతో ఎలాగైనా వృద్ధుడిని హత్య చేయాలని, తద్వారా డబ్బులు, అతడి ఒంటిపై గల వెండి వస్తువులు లభిస్తాయని పక్కా పథకం పన్నింది. ఫిబ్రవరి 11న వడ్డె రాములు మొయినాబాద్‌లోని మరో కూతురు దగ్గర నుంచి కులకచర్లకు రాగా హత్యకు వారు కుట్ర పన్నగా వీలుపడలేదు. 12న అతడి దగ్గర తమ అవసరాల కోసం డబ్బులు తీసుకువెళ్లడానికి వచ్చిన రాములు మేనకోడలు మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలం చిన్నదర్పల్లికి చెందిన రాములమ్మ కులకచర్లకు వచ్చింది. 

ఆమెతో దేవమ్మ, ఆమె బిడ్డలు మంగమ్మ, సంతోష గొడవపడి తిట్టడంతో రాములమ్మ వెళ్లిపోయింది. ఆ తర్వాత ముగ్గురు కలిసి రాములును కొట్టి చంపి వెండి కడియాలను, డబ్బులు తీసుకోవాలని నిర్ణయించుకొని పథకం పన్నారు. 12న రాత్రి వారు ముగ్గురు రాములు ఇంటికి వెళ్లగా రాములును దేవమ్మ ముందు నుంచి చేతులతో గట్టిగా పట్టుకోగా వెనుకాల నుంచి మంగమ్మ రోకలి కట్టెతో బలంగా కొట్టడంతో రాములు కింద పడిపోయాడు. ఆ వెంటనే సంతోష రోకలి కట్టెతో ముఖం మీద, నుదుటి మీద కొట్టగా దేవమ్మ కాళ్లతో ఇష్టం వచ్చినట్లు తన్నింది. దీంతో రాములు చనిపోగా అతడి ఒంటిపై ఉన్న రెండు వెండి కడియాలు, ఒక దండె వెండి కడియం, రూ.11,000 నగదు, అతడి ఫోన్‌ను తీసుకువెళ్లారు. రాములు దగ్గర నుంచి తీసుకువెళ్లిన డబ్బులను వారు ఖర్చు పెట్టారు. మిగతా వెండి కడియాలు, ఫోన్‌ స్వాధీనం చేసుకొని విస్లావత్‌ దేవమ్మ, విస్లావత్‌ మంగమ్మ, విస్లావత్‌ సంతోషలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. 


logo