కొత్తపల్లి, ఏప్రిల్ 21 : “కేంద్రంలో అధికారంలో ఉన్నా ఎంపీ బండి సంజయ్ ఐదేళ్లు ఐదు రూపాయల పని కూడా చేయలేదు. ఓ గుడి తెచ్చిండా.. ఓ బడి తెచ్చిండా?” అని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ ప్రశ్నించారు. ఎన్నికలు వస్తేనే ఆయనకు ప్రజలు గుర్తుకు వస్తారని మండిపడ్డారు. కొత్తపల్లి మున్సిపల్ పరిధిలో ఆదివారం ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి బీఆర్ఎస్ ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నది ఉన్నది ఊడగొట్టడానికి కాదని, కాంగ్రెస్ వస్తే ఇంకేదో మేలు చేస్తారని ఆశపడి ఓట్లు వేస్తే ప్రజల నడ్డి విరిచేలా సర్కారు వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.
ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయాల్సింది పోయి గతంలో ఉన్న పథకాలకు మంగళం పాడుతున్నదన్నారు. డిసెంబర్ 9వ తేదీనే రైతు రుణమాఫీ రూ.2 లక్షలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ నేటికీ నెరవేర్చలేకపోయిందన్నారు. యాసంగి పంటకు రూ.500 బోనస్, రైతుభరోసా, మహిళలకు రూ.2500 ఆరిథక సాయం, రూ.500కే గ్యాస్ సిలిండర్,
రైతు కూలీలకు రూ.12 వేల హామీలను అమలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలను నమ్మిన ప్రజలు నట్టేట మునిగారని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే ఈడీ, సీబీఐతో కేసులు పెడుతూ భయపెడుతున్నదన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు.
కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న వినోద్‌కుమార్ గెలిస్తేనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందని, ఈ విషయం గతంలోనే నిరూపితమైందన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉండదని, ఆపార్టీలోని నాయకులే సీఎం రేవంత్‌రెడ్డిని గద్దె దించుతారన్నారు. ఎంపీగా బండి సంజయ్ ఐదేళ్ల కాలంలో కేవలం పార్టీకోసమే పనిచేశాడే తప్ప ఏనాడూ ప్రజల బాగోగులు పట్టించుకోలేదన్నారు.
ప్రజల మనోభావాలతో బండి సంజయ్ రాజకీయం చేస్తున్నారని, ప్రస్తుతం జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన పప్పులు ఉడకవన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, మాజీ కో ఆప్షన్ సభ్యులు జమీలొద్దీన్, కౌన్సిలర్లు మొండయ్య, వేణుగోపాల్, రాంబాబు, సత్యనారాయణ రెడ్డి, విజయ రమేశ్, కో ఆప్షన్ సభ్యులు ఫక్రొద్దీన్, ప్రభాకర్, బీఆర్ఎస్ నాయకులు గోపాల్‌రెడ్డి, శ్రీకాంత్, ఎస్కే బాబా, సుధాకర్, వెంకట్‌రెడ్డి, కొమురయ్య, రుద్ర రాధ, మహేశ్వరి, కోటేశ్వర్ పాల్గొన్నారు.