vastu shastra | ఆగ్నేయంలో కానీ, ఇంటిముందు వరండాకు కానీ గుండ్రటి పిల్లర్లు వేయవచ్చా? దీనివల్ల ఏమైనా దోషం ఉంటుందా?
-బి. ఆనంద్, సీతాఫల్మండి
గుండ్రటి పిల్లర్లను సాధారణంగా ఎలివేషన్ కోసం వాడుతుంటారు. అయితే ఇంటి నిర్మాణంలో, ముఖ్యంగా ఇంటిమూలలకు ‘నాలుగు పలకల’ పిల్లర్లనే వాడాలి. గుండ్రటి పిల్లర్ వాడకూడదు. దీనివల్ల ఇంటి పటిష్ఠత లోపిస్తుంది. ఈశాన్యంలో గుండ్రటి పిల్లర్ వాడటం వల్ల ఇంటి మూల కొలతల్లో ఆయం మారిపోతుంది. దానివల్ల నైరుతి ఈశాన్యాలు సరిగ్గా నిలబడవు, పెరుగుతాయి. ఆగ్నేయంలో కూడా గుండ్రటి పిల్లర్నే వేయాలనే నియమం లేదు. అవసరాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇక వరండా ప్రధాన గృహం నిర్మాణంలో భాగం కాదు కాబట్టి, దానికి పిల్లర్లను గుండ్రంగా వేయవచ్చు. దోషం కాదు.
తూర్పు దిశను ఇంట్లో ఎంతవరకు లెక్కించాలి? ఆ దిశ బరువు ఉండొచ్చా?
-డి. సునీత, మోత్కూరు
ఇంటి ఉత్తరం నుంచి దక్షిణం వరకు గల స్థలాన్ని ముందు లెక్కించాలి. ఆ భాగాన్ని తొమ్మిది విభాగాలు చేయాలి. అప్పుడు మధ్యలోని ఐదు భాగాలు ‘తూర్పు భుజం’గా గుర్తించాలి. అంటే 3వ భాగం నుంచి 7వ భాగం వరకు తూర్పు. మిగిలిన నాలుగు భాగాల్లో రెండు భాగాలు తూర్పు ఆగ్నేయం, రెండు భాగాలు తూర్పు ఈశాన్యం అవుతాయి. తూర్పు భాగం ఇంట్లో ద్వారాలకు, కిటికీలకు వాడకం ఉండాలి. కారణం ఆ దిశ గాలి, వెలుతురుకు అవకాశం ఉంటుంది. తూర్పు దిశలో బరువులు పెట్టకూడదు. ఒకవేళ పెడితే తూర్పు మూతపడుతుంది. ఆ దోషంతో అనారోగ్య సమస్యలు వస్తాయి.
దక్షిణం ఇల్లు కడుతున్నాం. మాకు అరుగులు కావాలి. కాంపౌండు లేకుండా కట్టొచ్చా? ఇది వాస్తుకు విరుద్ధమైన నిర్ణయమా?
-ఎ.సురేశ్, ఆలేరు
దక్షిణ దిశలోనే కాదు ఏ సింహద్వారపు ఇంటికైనా… అరుగులు వేసుకుంటే ఇంటిని అంటుకొని వేయవచ్చు. కానీ, మీ ప్లానులో దక్షిణం స్థలం తక్కువగా ఉంది. రోడ్డుకు, ఇంటికి మధ్య స్థలం ఉన్నప్పుడు కాంపౌండు బయట కూడా అరుగులు వేసుకోవచ్చును. అయితే, ఇంటి చుట్టూ ప్రదక్షిణం ఉండాల్సిందే. అంతేకాదు మీది దక్షిణం ఇల్లు. దక్షిణం రోడ్డు. పైగా ఇంటి చుట్టు ప్రహరీ కడుతున్నారు. అలాంటప్పుడు దక్షిణం ప్రహరీ వదిలి అరుగులు కట్టటం వల్ల దక్షిణం తేలిపోతుంది. ఇంటికి ప్రదక్షిణం రాదు. అరుగుల కన్నా ప్రహరీ చాలా అవసరం. కాబట్టి, అరుగులు మానుకోండి.
రోడ్డును బట్టి ఇల్లు కట్టాలా? లేదంటే, దిక్సూచికి కట్టాలా? ఈశాన్యం పెంచాలా?
-కె. వీరేశం, గద్వాల
ఎక్కడైనా వీధులను బట్టి గృహాలు నిర్మాణం కావాలి. అప్పుడే ఆ గృహాలు గాలీ వెలుతురుతో ఆరోగ్య ధామాలుగా వర్ధిల్లుతాయి. గృహం తిప్పి కట్టడం, ఈశాన్యం వైపు పెంచి కట్టడం సరైన పద్ధతులు కావు. దిక్సూచికి కట్టాలా? అన్నది ఇంటి నిర్మాణం విషయంలో కాదు. రోడ్లు వేసేటప్పుడే ఆ వీధులు దిశలకు అంటే ‘దిక్సూచి’కి ఉండాలి. దిక్కులకు లేని స్థలాల్లో ఇండ్లు కట్టడం మంచిది కాదు. వీధులు ఎలా పడితే అలా వేయడం వల్ల ఈ ప్రశ్న వస్తుంది. కానీ వీధులు, దిశలకు కుదిరినప్పుడు గృహాలన్నీ దిక్సూచికే ఉంటాయి కదా!
మాస్టర్ బెడ్రూం నుంచి బయటి దక్షిణం మెట్ల కిందికి టాయిలెట్ కట్టుకోవచ్చా?
-వి. రాజేశ్వర్, గొల్లపల్లి
ఇంట్లో ప్రధాన పడకగదిని చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి. అవకాశం ఉందని ఎటువైపు ఖాళీ ఉంటే అటు కలుపుకోవడం మంచిది కాదు. మీ ఇంటికి దక్షిణం నైరుతిలో మెట్లు వేశారు. ఆ మెట్ల ల్యాండింగ్ భాగాన్ని ఇంట్లో కలుపుకోవడం వల్ల ఇంటి పరిధి దాటి వాడే స్థలం పెరుగుతుంది. దక్షిణ నైరుతి పెంచడం స్త్రీల జీవితాలను తుంచడం అవుతుంది. అంతేకాదు, నైరుతి భాగంలో బాత్రూం పెట్టడం వల్ల పల్లం కూడా అవుతుంది. తద్వారా ఇంటి యజమానులకు విషమ పరిస్థితులు ఎదురవుతాయి. ఏమాత్రం మంచిది కాదు. మాస్టర్ బెడ్రూంలోని టాయిలెట్‌ను ఇంటి పరిధి దాటి రాకుండా ఆ గదిలోనే తూర్పు ఆగ్నేయంలో కానీ, పడమర వాయవ్యంలో కానీ కట్టుకోండి.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com, Cell: 7993467678
పశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక, ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం. రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
వాస్తు : ఒక ఇంటికి వాయవ్యాలు రెండు ఉంటాయా? అప్పుడు టాయిలెట్లు ఎటు కట్టాలి?
వాస్తు:వాయవ్యం మెట్ల మీద నీళ్ల ట్యాంకు పెట్టొచ్చా? నైరుతిలోనే పెట్టాలా?
దక్షిణం రోడ్డు ఉన్న ఇంటికి మధ్యలో బుల్లెట్ రోడ్డు పెట్టుకోవచ్చా?
ఆగమ శాస్త్రం ప్రకారం శివుడు, గణపతి, విష్ణువు, అమ్మవారి ఆలయాలను ఒకేచోట కట్టుకోవచ్చా?
వాస్తు, పశ్చిమ ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక్క వంటగది మాత్రమే ఉంచి, మిగతా ఓపెన్‌గా ఉంచవచ్చా?