గ్రంథాలయ నిర్మాణానికి వాస్తు అవసరమా?
సంధ్యారాణి, కొండగడప
దేవాలయాన్ని ఎంత శ్రద్ధగా, శాస్త్రబద్ధంగా కడతామో గ్రంథాలయాన్ని కూడా అంతే నియమబద్ధంగా కట్టాలి. ఆడిటోరియం, అడ్మిన్ బిల్డింగ్, టాయిలెట్స్.. వేరువేరుగా దూరందూరంగా ఉండాలి. విశాలమైన నాలుగు రోడ్ల కూడలిలా గ్రంథాలయాన్ని ఏర్పాటుచేయాలి. ప్రాంగణంలో చెట్లు, లాన్లతో ఆహ్లాదం ఉట్టిపడే నిర్మాణం ఉండాలి. భవనంలోకి పగటి వెలుతురు ధారాళంగా వచ్చేలా గదులను కట్టుకోవాలి. మొత్తంగా భవనాన్ని ఒక చతుశ్శాలలా రూపొందించుకోవాలి. పుస్తక నిలయాన్ని భవనం మధ్య భాగంలో సూచికలతో నిర్మించాలి. గ్రంథాలయ అధికారుల కార్యాలయాన్ని పైభాగంలో అదనపు అంతస్తులో ఏర్పాటుచేయాలి. శబ్ద కాలుష్యం లేకుండా.. ఎత్తయిన ప్రహరీ లోపల కట్టినప్పుడే గ్రంథాలయం నిర్మాణం పుస్తక ప్రియులను ఆకట్టుకుంటుంది.
పురాతనమైన ఇల్లు మాది. ప్రాంగణంలోనే బావి ఉంది. ఆ ఇంటిని తొలగించి కొత్త నిర్మాణం చేపట్టవచ్చా? పాత ఇంటి చెక్క వాడవచ్చా?
-కోన శివానంద్, ధర్మపురి
పెద్దలు కట్టిన నివాస గృహాలు తీసేసి.. మళ్లీ అదే స్థలంలో ఇల్లు కట్టుకోవచ్చు. దోషం ఉండదు. కానీ, ముందు ఆ ఇంట్లో బావిని పూడ్చేయాలి. నిర్మాణ భాగంలోకి పాతబావి రాకుండా జాగ్రత్త పడాలి. ఇంటిని తొలగించినపుడు పునాదులతో సహా తీసేయండి. బాగుంటే, కొత్త నిర్మాణానికి పాత ఇంటి కలపను వాడుకోవచ్చు. పాత దూలాలు, చౌకట్లు చెడిపోకుండా ఉంటే.. వాటిని శుద్ధిచేసి, పాలిష్ వేసి వాడుకోవచ్చు. చెదలు తిన్నవాటిని, పగిలిన కర్రలు, దూలాలను వాడవద్దు.
వాయవ్యాలు రెండు ఉంటాయా? మరి టాయిలెట్లు ఎటు కట్టాలి?
-కె. సుమలత, తొర్రూరు
అవును. విదిక్కులు రెండుగా విభజితమై ఉంటాయి. చాలామంది వాటిని ఒకటిగా కలిపి, రెండింటికి ఏక స్వభావాన్ని అంటగడుతున్నారు. విదిశలు చాలా సూక్ష్మశక్తులను కలిగి ఉంటాయి. వాటి ఫలితాలు మనసుపై ప్రభావం చూపుతాయి. ఇంట్లోని వ్యక్తుల ప్రవర్తన దిగజారినా, అత్యున్నత స్థాయికి చేరినా.. అది విదిక్కుల ప్రభావమే. వాయవ్యం.. పశ్చిమ, ఉత్తర వాయవ్యం అని రెండు భాగాలు. ఈ రెండిటిలో ఉత్తర వాయవ్యం ఉపగది, టాయిలెట్లు వేయడానికి అనుకూలం. పశ్చిమ వాయవ్యం వ్యవహారత్వానికి, నిర్ణయశక్తికి, రాకపోకలకు బలాన్ని ఇస్తుంది. కాబట్టి టాయిలెట్లను ఉత్తర వాయవ్యంలో ప్లాను చేయాలి. స్థల గణన సరిగ్గా చేసి ఉత్తర పశ్చిమ వాయవ్యాలను ముందుగానే నిర్ధారించుకోవాలి.
నైరుతి మూల ఖాళీ స్థలం ఉంది. దానిలో గది ఎలా కట్టాలి?
-వి. నరేందర్, ఉప్పల్
ఇంటికి నైరుతిలో ఖాళీ స్థలం ఉందని అంటున్నారు. అది వదిలివేసిందా, లేదంటే కొన్నదా? కొన్నదైతే వెంటనే అమ్మేయండి. వదిలిన స్థలమైతే అందులో తిరిగి కట్టాల్సిన అవసరం లేదు. నైరుతిలో ఖాళీ ఉంది కదా అని, అది మన గృహం లెక్కలోకి రాకపోయినా అందులో ఏదో ఒక గది నిర్మించ తలపెట్టడం మంచిది కాదు. ఆ స్థలంలో నిర్మాణం జరిపితే అది ఉచ్ఛమైన గృహం అవుతుంది. అలాంటప్పుడు ఆ గదిలోనే నివాసం ఉండాల్సి ఉంటుంది. మన గృహం ఆవరణలోకి రాని స్థలాన్ని చేర్చుకోవడం మంచిది కాదు. ఒకవేళ ఇంటి ప్రాంగణంలో నైరుతి భాగంలో గది కడితే, దాన్ని ఇంటి యజమాని ప్రధానంగా వాడాల్సి ఉంటుంది.
గోడౌనుకు లోడింగ్ అరుగు ఉత్తరంలో వేయవచ్చా? -బి. ఉత్తమ్‌కుమార్, శంషాబాద్
తూర్పు దిశకు, ఉత్తరం దిశకు ముఖం చేసి నిర్మించిన గోడౌన్లకు తప్పనిసరిగా అరుగులు వస్తాయి. గోదాము అంటేనే సరుకు పంపడానికి, దింపుకోవడానికి అవసరమైంది. కాబట్టి లారీ బాడీ ఎత్తుకు ఖాళీ అరుగులు ఉండటం అత్యవసరం. అయితే గోదాముకు ప్రత్యేకంగా అరుగు అంటూ ఏమీ ఉండదు. గోడౌను ఫ్లోరింగ్ ఎత్తే సాధారణ గృహాల ఫ్లోరింగ్ కంటే ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వాహనాలకు సరిపడే ఫ్లోరింగ్ ఎత్తునే బయటివరకు లాగి గోదాము నిర్మించుకోవాలి. అప్పుడు అది అరుగులా ఉంటుంది. అది ఏదిశకు వచ్చినా దోషం కాదు. అయితే దానిమీద కూడా షెడ్డు కప్పు వచ్చేలా చూసుకోవాలి. అప్పుడే రక్షణ ఉంటుంది.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక, ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం. రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
వాస్తు, పశ్చిమ ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక్క వంటగది మాత్రమే ఉంచి, మిగతా ఓపెన్‌గా ఉంచవచ్చా?
వాస్తు:వాయవ్యం మెట్ల మీద నీళ్ల ట్యాంకు పెట్టొచ్చా? నైరుతిలోనే పెట్టాలా?
ఆగమ శాస్త్రం ప్రకారం శివుడు, గణపతి, విష్ణువు, అమ్మవారి ఆలయాలను ఒకేచోట కట్టుకోవచ్చా?
దక్షిణం రోడ్డు ఉన్న ఇంటికి మధ్యలో బుల్లెట్ రోడ్డు పెట్టుకోవచ్చా?