వాయవ్యం మెట్ల మీద నీళ్ల ట్యాంకు పెట్టొచ్చా? నైరుతిలోనే పెట్టాలా?-కొండ సురేశ్, మేడ్చల్
ఇంటి మీద నీళ్ల ట్యాంకును నైరుతిలోనే పెట్టాలని అనేది, ఆ దిశలోనే నీళ్లు ఉండాలని కాదు. ఏ ఇంటికైనా నీళ్ల ట్యాంకు ఎత్తులో ఉండాలి. అందువల్ల ఎత్తు కోసం ట్యాంకును నైరుతిలో పెడతారు. మీరు పంపిన ప్లానులో మేడమీద నైరుతి భాగంలో రేకులతో ఒక గదిని కట్టుకున్నారు. ఇంటికి మెట్లు వాయవ్యంలో ఉన్నాయి. కాబట్టి, వాయవ్యం మీద కూడా ట్యాంకు పెట్టుకోవచ్చు. లేదంటే, ఆగ్నేయంలోనూ స్లాబ్ మీద పెట్టుకోవచ్చు. అయితే నీళ్ల ట్యాంకు ఎత్తుకన్నా, మెట్ల ఎత్తుకన్నా నైరుతి గది ఎత్తు ఉండేలా చూసుకోవాలి. నీళ్ల ట్యాంకు తూర్పు, ఈశాన్యం, ఉత్తర దిశల్లో రాకూడదు.
ఇంటికి వరుసగా మూడుగానీ, ఐదుగానీ ద్వారాలు ఉండొచ్చా?-కోట హనుమంతు, తొర్రూరు
ఇంట్లో నడకలు ఏ సింహద్వారానికైనా వక్రంగా ఉండకూడదు. నేరుగా ఉండాలి. తూర్పు ఈశాన్యంలో ప్రారంభమైన ద్వారం వరుస పశ్చిమంగా, లేదంటే ఉత్తరం నుంచి దక్షిణ దిశగా వరస ద్వారాలు వచ్చేలా నిర్మాణం చేయడం గొప్ప కౌశలం. అలాంటి ద్వారాలు కొన్ని ఇండ్లకు వరసలో మూడు రావచ్చు. ఐదు కూడా రావచ్చు. దోషం లేదు. అయితే, ఇంటి మొత్తానికి కలిపి ద్వారాలు సరిసంఖ్యలో ఉండాలి. అంతేకానీ వరస ద్వారాలలో సంఖ్య నియమం అవసరం లేదు.
ఉత్తరం దిశ ఇంటికి, దక్షిణంలో సిబ్బంది గదులు కడితే సెప్టిక్ ట్యాంకు ఎక్కడ పెట్టాలి?-చింతల సుధాకర్, ఎల్బీ నగర్
మీ ప్రధాన గృహానికి కాంపౌండు పెట్టి దానిలోపల దక్షిణం ఖాళీలో స్టాఫ్ కోసం గదులు కడుతున్నారు. కాబట్టి, మీ ఇంటి సెప్టిక్ ట్యాంకులోకే ఆ గదుల టాయిలెట్లను కలపండి. అలా కాకుండా మీ ఇంటి కాంపౌండు అవతల దక్షిణంలోని ఖాళీ భాగంలో ప్రత్యేకంగా గదులు వేస్తే, అవి ఇంటికి దూరంగా ఉంటే, వాటికి తూర్పు సెంటర్లో సెప్టిక్ ట్యాంకు కట్టుకొని టాయిలెట్ లైన్లు కలుపుకోండి. అయితే మీ ప్రధాన గృహానికి దక్షిణంలో, నైరుతిలో స్థలం లేదు అన్నారు కాబట్టి ఆ స్థలం వేరుగానే ఉంచండి. ప్రధాన గృహంలోకి కలపవద్దు. ఇంటి పొడవుతో సమానంగా లేని దక్షిణం, పశ్చిమం స్థలాలు వేరుగా ఉండాల్సిందే.
ఇంట్లో మెట్లకు ఎదురుగా పూజగది రావచ్చా?-సుంకు సంధ్య, పెద్దపల్లి
హాలు మధ్యలో, అంటే పశ్చిమంలో మీ ఇంటి డూప్లెక్స్ మెట్లు వచ్చాయి. డూప్లెక్స్ మెట్లకు ఎదురుగా పూజగది రాకుండా చూసుకోవాలి. బదులుగా నైరుతిలోని మాస్టర్ బెడ్రూం కొలతలోనే తూర్పులో ‘వంటగదికి ఉత్తరంలో’ పూజగది ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు, ఇంటి మెట్లు పూజగదికి ఎదురుపడకుండా ఉంటాయి. ఇలా వీలు కాకుంటే మరో మార్గమూ ఉంది. మెట్ల మధ్య ఉండే ఖాళీకి ఎదురుగా తూర్పు సెంటర్లో పూజగది కట్టుకోవచ్చు. అయితే ఎక్కే మెట్లవైపు గానీ, దిగే మెట్లవైపు గానీ పూజగది ఎదురుపడకుండా ఉండాలి. పూజగది ద్వారం పశ్చిమం వైపు ఉంటుంది కాబట్టి, ఆ ద్వారంలోకి మెట్ల రెయిలింగ్ రావద్దు. ఇలా అన్ని జాగ్రత్తలూ తీసుకొని పూజగది కట్టుకోవాలి.
ఊళ్లో ఇల్లు కడుతున్నాం. దక్షిణం రోడ్డు. ఇంటిని తూర్పు ఇల్లు పారుకా, పశ్చిమం ఇంటి పారుకా… ఏ లైనుకు కట్టాలి?- వి. శుభాకర్, పారుపల్లి
గ్రామాల్లో గృహాలు ప్రణాళిక ప్రకారం ఉండవు. ఒక గోడ ఒరిగి, ఒక మూల పెంచి, ఇంకో మూల తగ్గించి వాళ్లవాళ్ల అనుకూలత, ఆర్థిక పరిస్థితుల్ని బట్టి కట్టుకుంటారు. ఆ నిర్మాణ క్రమంలో మీరు తప్పకుండా పక్క ఇండ్లను అనుసరించే కట్టాలి. అయితే దక్షిణం రోడ్డు ఉంది కాబట్టి, రోడ్డులోకి ఇల్లు జరగకుండా కట్టుకోవాలి. మీకు తూర్పు ఇల్లు లోపలికి ఉందా, పశ్చిమం ఇల్లు లోపలికి ఉందా అన్నది చూసుకోవాలి. లోపలికి ఉన్నదాని పారుకు మీ ఇంటి కాంపౌండు గోడ రావాలి. ఆ కాంపౌండులో మీరు ఇంటిని చుట్టు ఖాళీ వదిలి కట్టాలి. దక్షిణ సింహద్వార గృహానికి ఇతరుల పారు పట్టించుకోకపోతే వీధిపోట్లను ఎదుర్కోవాల్సి వస్తుంది.
సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678