Vasthu Shastra | మనిషి కర్మజీవి. ఇది కర్మభూమి. అలా అని ఇదేదో అర్థంకాని వేదాంతం అనుకోవద్దు. పనివల్ల పుట్టిన శరీరం, పని లేకుండా క్షణం కూడా ఉండదు. అలా చేసిన పనుల ఫలితంగా జన్మించిన మనం.. ఆయా పనులు ముగించుకొని వెళ్లడం అనివార్యం. ఇదే సృష్టి నియమం. ఇందుకే మన జీవితం. కానీ, మానవ జన్మ లక్ష్యం అది కానేకాదు. శాస్త్ర సౌజన్యమూ అది కాదు. మనిషికి మరణమే లేదు అని చెప్పే అద్భుత విజ్ఞాన వైభవం దాని లక్ష్యం. ఈ విషయం అంత తొందరగా అర్థం కాదు. జీవితం పండాలి. తల్లి కారం పెట్టినా, చేదు మందు పెట్టినా.. బుజ్జగించినా, చెంప పగలగొట్టినా.. అది బిడ్డ భద్రత కోసమే అన్నట్టు.. అందరినీ వారివారి గమ్యాలకు చేర్చేదే శాస్త్రం. మరణం జీవికి అంతం కాదు.. మరో ఆరంభం! అదొక తాత్కాలిక విరామమే! ఇవన్నీ వ్యక్తికి భౌతికంగా, అనుభవ పరంగా అందించడానికి ఎన్నో శాస్ర్తాలు వచ్చాయి. అందులోనూ వాస్తుశాస్త్రం ఉన్నది.. జీవికి గమ్యం తెలపడానికే! కొన్ని పాటిస్తూ పోతేనే అర్థం అవుతాయి. అంతే!
– డి. సుశీలా దేవి, మోత్కూర్
వాస్తులో అద్భుతమైన అంశాలెన్నో ఉంటాయి. ఒక్కో దిశ ఒక్కో వయసు వారి మీద ప్రభావం చూపుతుంది. ఈశాన్యం ప్రభావం పిల్లల మీద.. నైరుతి ప్రభావం పెద్దల మీద.. ఆగ్నేయం స్త్రీల మీద.. దక్షిణం ఇంటి యజమానురాలి మీద.. ఇలా ఆయా దిశలు, వాటి లోపాలు – మంచి గుణాలు.. తప్పకుండా ఆయా వయసు వారి మీద ఉంటాయి. అదే శాస్త్రం. కొందరికి వంకాయ కూర పడదు. కొందరికి శనగలు – శనగపిండి వంటలు పడవు. కొన్ని కొందరికి అలర్జీ కలిగిస్తాయి. అవే మరొకరికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. వాస్తు కూడా అంతే! దోషాలు-ఫలితాలు భిన్నంగా ఉంటాయి. ఒకేపాదులో మిరపచెట్టు, జామచెట్టు మొలుస్తుంది. వేప, మర్రి మొలుస్తాయి. దేని వైవిధ్యం దానిదే!
– డి. అర్జున్, వరంగల్
ఉత్తరం వీధిచూపు మంచిదే కానీ, అది ఉత్తరమే అనేది సరిగ్గా నిర్ధారించాలి. ఇంటికి రోడ్డు పడే వీధిని కొలిచి, ఇంటికి మధ్యలో సరిగ్గా ఉత్తర భాగంలో పడినప్పుడే.. అది ఉత్తరం వీధిచూపు అవుతుంది. వాయవ్యం భాగంలో పడకుండా సరిగ్గా గుర్తించాలి. అలాగే, దిశ సక్రమంగా ఉండాలి. ఈశాన్యం ఏకొంత తూర్పునకు వంగినా (తిరిగినా).. ఆ ఉత్తరం వీధి మంచిదికాదు. అలాగే, ఉత్తరం రోడ్డు ఎంత వెడల్పు ఉందో, ఇంటి ఉత్తరం వైపు అంతే వెడల్పు ఉన్నా.. తక్కువ ఉన్నా.. ఆ ఉత్తరం ఎదురు వీధి చాలా ఇబ్బందులు కలిగిస్తుంది. వీధిచూపులు మొత్తంగా మంచివి అని చెప్పడం వేరు. కొలతలతో నిర్ధారించడం వేరు. సరిగ్గా చూసుకొని ఆ ఇంట్లో ఉండండి.
– కె. లక్ష్మీనారాయణ, వరంగల్
పూజా స్థానంలో విగ్రహాల కింద సొరుగులో అగరొత్తులు, కర్పూరం, వత్తులు, పసుపు-కుంకుమ మొదలైన పూజా సామగ్రి పెట్టుకోవచ్చు. అది దోషం కాదు. గది పెద్దదిగా ఉంటే, గదిలోని దక్షిణం గోడకు షెల్ఫ్‌లు పెట్టుకొని, వస్తువులు అమర్చుకోవచ్చు. పూజగది అన్ని చోట్లా విశాలంగా ఉండదు. స్థలాన్ని బట్టి సర్దుబాటు చేసుకోవాలి. పూజగదిలో ఉండాల్సింది వస్తు ప్రాధాన్యం కాదు. ఏకాగ్రత! అంతరంగ సానుకూలత! అందుకు తగిన శుభ్రత పాటిస్తూ, పూజగదిని అమర్చుకోవాలి. మనోమాలిన్యం తొలగించుకోవడం ముఖ్యం. అందుకే, ప్రతి ఇంట్లో పూజగది అవసరం. అక్కడ భౌతికత కాదు.. అంతరంగంలోకి ప్రయాణం చేయాల్సిన అవసరం ఎక్కువ. వస్తువులు ఎక్కడ ఉన్నా ఇబ్బంది లేదు.
– కె. ఆనందరావు, మేడ్చల్
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Vaasthu Shastra | ఒక్క కొడుకు ఉంటే.. అతనికి తూర్పు రోడ్డు ఇల్లు మాత్రమే కట్టి ఇవ్వాలా?
Vasthu Shastra | ఆగ్నేయం ఇంటికి సెల్లార్ ఉండవచ్చా?
Vasthu Shastra | ఇంట్లో కుందేళ్లను పెంచుకోవచ్చా?
Vasthu Shastra | మా కాలేజీకి ఈశాన్యంలో సరస్వతి అమ్మవారి ఆలయం ఉంది.. దీనివల్ల ఏమైనా కీడు జరుగుతుందా?