Vaasthu Shastra | కొత్త ఇల్లు ఎప్పుడు కొనాలి? నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనొచ్చా? లేదంటే పూర్తిగా కట్టిన తర్వాతే చూసి కొనాలా?
– బి. అమల, నిర్మల్
ఇల్లు కొనడం అనేది మనిషి తీసుకునే అతి ముఖ్యమైన నిర్ణయం. కారణం.. జీవిత కార్యాలన్నీ అందులోనే కొనసాగుతాయి. దిశపరంగా, నిర్మాణపరంగా మంచిగా ఉన్న ఇంటిని కొనడం ఒక యోగం అనవచ్చు. వాస్తు చూడకుండా మిగతా ఆడంబరాలకు-నిర్మాణాల మాయకు లోబడిపోతారు చాలామంది. ఇల్లు పూర్తయ్యాక కానీ, పూర్తిగా కట్టక ముందు కానీ కొనుగోలు చేయవచ్చు. అయితే, మనం కొనే ఇంటిని చూసి కొనాలి. నమూనా చూసి, అసలు ఇంటిని కొనొద్దు. ఇంటికి-ఇంటికి చాలా వ్యత్యాసం ఉంటుంది.. స్థానపరంగా. పూర్తికాని ఇంటిని ఎలా పూర్తి చేయబోతున్నారో.. ప్లాను పరిశీలించి, ఆ వివరాలన్నీ తెలుసుకొని, ద్వారాలు-కిటికీలు, బాల్కనీలు అన్నీ పరిశీలించి కొనాలి. అవసరమైతే మార్పులు-చేర్పులు చేసుకోవచ్చు కూడా. ఎప్పుడు కొన్నా వాస్తును-న్యాయపరమైన అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి.
ఊళ్లో ని మా పాత ఇంటి మధ్యలో బావి ఉంది. అలా ఉండొచ్చా?
– ఎం. అమిత్, వైరా
ఇంటికి తూర్పు ప్రాంగణంలో లేదా ఉత్తర ప్రాంతంలో నీటి కూపం ఉండటం మంచిదే. బావి ఓపెన్‌గా ఉండటం వల్ల భూమిలోంచి అనేక వాయువులు బయటికి వస్తూ ఉంటాయి. అది ఏ దిశలో ఉన్నా సరే! బావిపైన కప్పు ఉండటం వల్ల.. సూర్యరశ్మి లోపలిదాకా చేరదు. దీనివల్ల నీరు ఎప్పటికప్పుడు శుభ్రం కాదు. ఆ నీరు శుద్ధంగా ఉండదు. కాబట్టి, చేదబావులను ఎండ-గాలి పడే ప్రదేశంలో తవ్వుకోవాలి. వాస్తుపరంగా తూర్పు-ఉత్తరం-ఈశాన్యం దిశలలో ఉదయపు ఎండ ఎక్కువగా పడుతుంది. అది ఎంతో శ్రేయస్కరం. మీ బావి వాస్తుపరంగా చూసినా.. దక్షిణంలో ఇంటి మధ్య ఉంది. అది ఇంట్లో స్త్రీల మీద చెడు ప్రభావాన్ని చూపుతుంది. వెంటనే తీసివేయండి. ప్రస్తుతం మన రాష్ట్రంలో నీటికి కొరతలేదు. భూగర్భజల మట్టం ఎంతో పెరిగింది. సరైన దిశలో కొత్త బావి లేదా నీటి సంపు వేసుకొని వాడుకోండి.
ప్రతి ఊరికి ముందు హనుమంతుడి ఆలయం కట్టాలంటారు. మేము ఒక వెంచర్ చేశాం. మేము కూడా గుడి కట్టాలా?
– దాస మోహన్, మేడ్చల్
శుభకరం.. హనుమంతుడి ఆలయ నిర్మాణం. తప్పకుండా కట్టండి. చిన్న గ్రామమైనా, నగరమైనా.. ఆ ఊరి ఆరంభంలో హనుమంతుడి విగ్రహ నిర్మాణం పురాతన సంప్రదాయం. అతడు క్షేత్ర పాలకుడై, ఊరిని సంరక్షిస్తూ ఉంటాడు. కరువు కాటకాల నుంచి, ప్రకృతి ఉత్పాతాల నుంచి కాపాడుతాడు. ఆయన నామం శక్తిమంతం. హనుమంతుడి రూపం విశ్వాసాన్ని, నిర్భయత్వాన్ని నింపుతుంది. తమ నివాసాలకు తోడుగా భగవంతుడు ఉన్నాడనే విశ్వాసం ఆ ప్రజలకు ఎనలేని భరోసా ఇస్తుంది. వారిలోని స్వశక్తిని మేలుకొలుపుతుంది. పాజిటివ్ దృక్పథంతో జీవితాన్ని గడుపుతారు. హనుమంతుడు ఊరికి ఒక రోల్ మాడల్‌గా నిలబడతాడు. పిల్లలు హనుమంతుణ్ని చాలా ఇష్టపడతారు. పెద్దవాళ్లు, యువకులు ఆయన వీరోచిత కార్యాలను స్మరించుకుంటారు. మహోన్నతమైన శక్తియుక్తులు ఉన్నా, సమయోచితంగా ప్రవర్తించిన జ్ఞానిగా-సేవకుడిగా-యోధుడిగా నిత్య స్మరణీయుడు అవుతాడు. అందుకే, పెద్దలు ఊరికో ఆంజనేయుడి గుడి కట్టమన్నారు.
ఈశాన్యం అన్ని ఇండ్లకూ పెంచాలా? దానివల్ల కలిగే లాభాలు ఏంటి?
– కిరణ్ కుమార్, రాయిగిరి
ఇంటికి ఈశాన్యం పెంచవద్దు. స్థలానికి ఈశాన్యం పెరిగి ఉంటే మంచిది. ఇదంతా సూర్యుని ఏటవాలు వెలుగులు ఇంట్లోకి రావడం కోసమే! తూర్పు – ఈశాన్య ద్వారానికి.. ఇంటికి దూరంగా ఈశాన్యం కాంపౌండు ఉన్నప్పుడు ఇంటి ప్రాంగణంలో ఈశాన్యం వైపు ఖాళీ పెరుగుతుంది. అప్పుడు ఉదయించే సూర్యుని లేత కిరణాలు నేరుగా ఇంటి ద్వారం గుండా ఏటవాలుగా ఇంట్లో నిండుతాయి. అది అత్యంత శుభకరం. ఆరోగ్య, ఐశ్వర్యదాయకం. ఇదంతా సూర్యుని గమనం కోసమే! సూర్యుడే సకల శుభప్రదాత. అయితే, ఈశాన్యపెంపు అనేది ఇంటి గోడలు పెంచినంత మాత్రాన మంచిదికాదు. పైగా ఇల్లు వక్రంగా నిర్మితమవుతుంది. నిర్మాణంలో ఈశాన్యం పెంపు మంచిదికాదు. వాతావరణ సమతుల్యత, ప్రకృతి ప్రసన్నతకు అనుకూలమైన విధానాలు ఉంటాయి శాస్త్రంలో. కాబట్టి గుడ్డిగా ఇంటిని పెంచవద్దు.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Vaasthu Shastra | ఒక్క కొడుకు ఉంటే.. అతనికి తూర్పు రోడ్డు ఇల్లు మాత్రమే కట్టి ఇవ్వాలా?
Vasthu Shastra | ఆగ్నేయం ఇంటికి సెల్లార్ ఉండవచ్చా?
Vasthu Shastra | ఇంట్లో కుందేళ్లను పెంచుకోవచ్చా?
Vasthu Shastra | మా కాలేజీకి ఈశాన్యంలో సరస్వతి అమ్మవారి ఆలయం ఉంది.. దీనివల్ల ఏమైనా కీడు జరుగుతుందా?