e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, May 12, 2021
Home Top Slides టీకా పాలిటిక్స్‌

టీకా పాలిటిక్స్‌

టీకా పాలిటిక్స్‌
  • టీకాల్లేవంటున్న కొన్ని రాష్ర్టాలు
  • అబద్ధమంటున్న కేంద్రప్రభుత్వం
  • అదుపులేకుండా విస్తరిస్తున్న కరోనా
  • కేంద్రం, రాష్ర్టాల మధ్య సమన్వయలేమి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 9: కరోనా దేశమంతా అడ్డూఅదుపూ లేకుండా విస్తరిస్తున్నది. వైరస్‌ను కట్టడి చేయడానికి సమన్వయంతో చర్యలు తీసుకోవాల్సిన కేంద్రం, పలు రాష్ర్టాల ప్రభుత్వాలు టీకాల విషయంపై వాదులాడుకొంటున్నాయి. వ్యాక్సిన్లకు కొరత ఉందని, వెంటనే పంపించాలని మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్‌ తదితర రాష్ర్టాల ప్రభుత్వాలు చెప్తుంటే.. టీకాలకు కొరత లేదని, మాపై కావాలనే బురద చల్లుతున్నారని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాదిస్తున్నది. వైరస్‌ను కట్టడి చేయలేక కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని ఎదురుదాడికి దిగుతున్నది. ఏదేమైనప్పటికీ కరోనా కట్టడికి తొలిదశలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కనిపించిన సమన్వయం సెకండ్‌ వేవ్‌ వచ్చేసరికి కొరవడింది. ఫలితంగా కరోనా కేసులు రోజురోజుకు కొత్త గరిష్ఠాలను చేరుతున్నాయి. దేశవ్యాప్తంగా గురువారం ఒక్కరోజే 1,31,968 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 780 మంది చనిపోయారు.

ఎగుమతులు ఆపేయండి

కరోనా టీకా ఎగుమతులను తక్షణమే నిలిపివేయాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ శుక్రవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. మొదట దేశ ప్రజలందరికీ టీకా వేయాలని కోరారు. వ్యాక్సిన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు తయారీదారులకు అన్ని వనరులను అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాలను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి విమర్శలకు లక్ష్యంగా చేసుకొంటున్నారని, సహకరించడం లేదని ఆరోపించారు.

భారతీయులు ముఖ్యమా? పాకిస్థానా?

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి భారతీయుల ప్రాణాలు ముఖ్యమా.. లేకపోతే పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌ దేశాలకు టీకాలు ఎగుమతి చేయడం ముఖ్యమా అని ఆప్‌ ప్రశ్నించింది. ‘ఇండియా ప్రతక్ష్యంగా, పరోక్షంగా పాకిస్థాన్‌కు 6 కోట్ల కరోనా టీకా డోసులను పంపిస్తున్నది. ఈ రోజు దేశంలో వ్యాక్సిన్లకు కొరత ఉన్నది. అయినప్పటికీ ఇంకా ఎగుమతులు కొనసాగుతున్నాయి’ అని ఆప్‌ నేత రాఘవ్‌ చద్దా విమర్శించారు.

వ్యాక్సిన్లను పక్కదారి పట్టిస్తున్నారు

కాంగ్రెస్‌ పాలిత రాష్ర్టాల్లో వ్యాక్సిన్‌ కొరత లేదని కేంద్రమంత్రి రవిశంకర్‌ అన్నారు. ప్రధానికి లేఖ రాసే బదులు టీకా డోసులను పక్కదారి పట్టిస్తున్న తమ పార్టీ నేతలకు రాహుల్‌ లేఖలను రాయాలని సూచించారు. దేశంలో భయాందోళన, అయోమయ వాతావరణాన్ని సృష్టించడానికి ఆప్‌ ప్రయత్నిస్తున్నదని బీజేపీ ఆరోపించింది.

18 ఏండ్లు పైబడిన అందరికీ టీకాలివ్వాలి: ఐఎంఏ

18 ఏండ్లు పైబడిన వారందరికీ టీకా ఇవ్వాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) మరోసారి డిమాండ్‌ చేసింది. రెండో దశలో ఎక్కువగా యువతకు కరోనా సోకుతున్నదని, మరణాలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయని ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్‌ జయలాల్‌ పేర్కొన్నారు. టీకా ‘అవసరం’ ఉన్నవారికే తమ ప్రాధాన్యమన్న కేంద్ర వైద్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ వ్యాఖ్యలపై జయలాల్‌ స్పందించారు. టీకా అవసరం ఉన్నవారు, కోరుకున్నవారికి మధ్య తేడా ఏంటో తనకు అర్థం కాలేదని, ఏ మందునూ ఎవరూ ఇష్టపడరని పేర్కొన్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్రం తన వ్యూహాన్ని మార్చుకోవాలని, మరింత మందికి టీకా అందించాలని సూచించారు. టీకాల కొరత నేపథ్యంలో ఇందుకు సమయం పట్టవచ్చని, అయితే వ్యాక్సినేషన్‌లో యువతకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు.

ముంబైలో టీకాల కొరత

ముంబై, ఏప్రిల్‌ 9: ముంబైలోని 100కు పైగా కేంద్రాల్లో టీకాల కార్యక్రమాన్ని శుక్రవారం నిలిపివేసినట్టు బృహన్ముంబై మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు. రాజస్థాన్‌లో రెండు రోజులో వ్యాక్సిన్‌ నిల్వలు అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాయని, కనీసం 30 లక్షల డోసులను వెంటనే పంపించాలని ప్రధాని మోదీకి ఆ రాష్ట్ర సీఎం అశోక్‌ గెహ్లాట్‌ లేఖను రాశారు. ఇదిలాఉండగా.. మహారాష్ట్రలో కొందరు రాజకీయ నాయకులు ఇంటి వద్దనే వ్యాక్సిన్‌ వేయించుకుంటున్నారన్న వార్తలపై బాంబే హైకోర్టు శుక్రవారం స్పందించింది. రాష్ట్రపతి, ప్రధానే దవాఖానలో టీకాలు వేసుకొంటుంటే కొందరు ఇలా చేయడమేంటని అసంతృప్తి వ్యక్తం చేసింది.

కరోనా అంతానికి ఉజ్జయినిలో యజ్ఞం

ఉజ్జయిని, ఏప్రిల్‌ 9: కరోనా మహమ్మారి అంతం, ఆరోగ్యకరమైన వాతావరణం, ప్రజాశ్రేయస్సు కోసం ఉజ్జయినిలోని ప్రఖ్యాత మహాకాళేశ్వర ఆలయంలో 11 రోజుల పాటు యజ్ఞం నిర్వహించనున్నారు. ఈ యజ్ఞం శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఆలయ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో 77 మంది పూజారులు ఈ యజ్ఞం నిర్వహిస్తున్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూనే పూజారులు యజ్ఞం చేస్తారని ఆలయ కమిటీ తెలిపింది.

Advertisement
టీకా పాలిటిక్స్‌
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement