e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home Top Slides ఊపు తగ్గినా.. ఉత్కంఠే

ఊపు తగ్గినా.. ఉత్కంఠే

ఊపు తగ్గినా.. ఉత్కంఠే

తమిళనాడు,కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు నేడే
మునుపటి జోష్‌ లేకున్నా ఆసక్తి రేపుతున్న తమిళ రాజకీయ పోరు
దూకుడు మీదున్న స్టాలిన్‌ డీఎంకే
అంతర్గతపోరుతో అన్నాడీఎంకే సతమతం

చెన్నై, ఏప్రిల్‌ 5: సాధారణంగా తమిళనాడు ఎన్నికలంటే.. సినీతారల కోలాహలం, ఉచిత హామీలు, పోటా పోటీ సవాళ్లు, ప్రతిసవాళ్లు ఉంటాయి. ద్రవిడ దిగ్గజం, డీఎంకే అధిపతి కరుణానిధి ఓవైపు, కరుణలాంటి కొండను ఢీకొని తనదైన వ్యూహాలతో దూసుకుపోయే అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరోవైపు మోహరించి ఉన్నప్పుడు ఈ ‘కలర్‌ఫుల్‌ రాజకీయ సినిమా’ తమిళనాట కనిపించేది. ఇప్పుడు ఈ రాజకీయ దిగ్గజాలు ఇద్దరూ లేరు. వారు లేకుండా జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలివి. అందుకనే.. సాధారణంగా తమిళనాట ఎన్నికల్లో కనిపించే జోష్‌ ఈసారి అంతగా కనిపించటం లేదు. అయితే, తండ్రి వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ.. ఈసారి ఎలాగైనా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కరుణ కుమారుడు స్టాలిన్‌ శతవిధాలా ప్రయత్నించారు. పటిష్ట నాయకత్వం లేని అన్నాడీఎంకే ఓ రకంగా స్టాలిన్‌కు వరంగా నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి.

విమర్శలే అస్ర్తాలు
జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే సరైన దిశానిర్దేశం లేకుండా సాగుతున్నది. పార్టీలోని ద్వితీయ శ్రేణి క్యాడర్‌లో అభిప్రాయ భేదాలు బయటపడుతూనే ఉన్నాయి. ఆ పార్టీ మిత్రపక్షం బీజేపీ వ్యూహాలు ద్రవిడ ఉద్యమానికి పుట్టినిల్లయిన తమిళనాట అంతగా ప్రభావాన్ని చూపడంలేదు. దశాబ్దకాలంగా గెలుపునకు దూరమైన ప్రధాన ప్రతిపక్షం డీఎంకే ఈసారి ఎలాగైన అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తున్నది. కరుణానిధి మరణంతో పార్టీ మొత్తం బాధ్యతలను భుజానవేసుకున్న ఆయన కుమారుడు ఎంకే స్టాలిన్‌ పార్టీని కిందిస్థాయి నుంచి బలోపేతం చేస్తూ పార్టీని ఎన్నికలకు సిద్ధం చేయడంలో సఫలమయ్యారు. కాంగ్రెస్‌తో కలిసి ఈ ఎన్నికల బరిలోకి దిగుతున్న డీఎంకే.. అన్నాడీఎంకే లో అంతర్గత పోరును ఓట్లుగా మలుచుకోవాలని భావిస్తున్నది. స్టాలిన్‌ అల్లుడు శబరీశన్‌ నివాసంలో ఐటీ అధికారులు ఇటీవల సోదాలు చేపట్టడం ఆ పార్టీకి ఒక విధంగా కలిసొచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. స్థానిక పార్టీలకు మనుగడలేకుండా చేయడానికే బీజేపీ ఈ చర్యలకు పాల్పడుతున్నదన్న విషయం ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో పాటు.. డీఎంకే పార్టీపై సానుభూతి మరింత పెరిగిందంటున్నారు. అలాగే, ఇటీవలే జైలు నుంచి విడుదలైన అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ రాజకీయాలకు గుడ్‌బై చెప్పడం తలపండిన రాజకీయ విశ్లేషకులను సైతం షాక్‌కు గురిచేసింది. శశికళ రూపంలో పార్టీకి కొత్త చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందనే ఉద్దేశంతో బీజేపీ సహకారంతో అన్నాడీఎంకే ఆమెను పక్కకు పెట్టినట్టు సమాచారం. అయితే, శశికళ రాజకీయ సన్యాసం వల్ల అన్నాడీఎంకే కంటే డీఎంకేకు ఎక్కువ మేలు చేకూరిందని, అమె రూపంలో రాష్ట్రంలో థర్డ్‌ ఫ్రంట్‌ ఊసే లేకుండా పోయిందని.. ఇది ఓట్ల రూపంలో డీఎంకేకు కలిసొచ్చే అంశమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా అన్నాడీఎంకే-బీజేపీ వేస్తున్న వ్యూహాలు బెడిసికొడుతున్నాయని అంటున్నారు. ఈ పరిస్థితి ఎక్కడి వరకు వెళ్లిందంటే.. తమ నియోజకవర్గాల్లో బీజేపీ తరఫున ప్రచారం నిర్వహించాలని డీఎంకే అభ్యర్థులు ప్రధాని మోదీని ‘ఆహ్వానిస్తున్నారు’. అంటే, ఆయన ప్రచారం చేస్తే.. అన్నాడీఎంకే-బీజేపీ కూటమి పట్ల ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరిగి తమకు అనుకూలంగా ఓట్లు పడతాయని వారు అంచనాల్లో ఉన్నారు. తమిళ ప్రజలకు బీజేపీ ఎత్తులు, కుట్రలు అర్థం అయ్యాయని, మోదీ అబద్దపు ప్రసంగాలు తమకు మేలు చేస్తాయని సోషల్‌ మీడియా వేదికగా స్టాలిన్‌ వర్గం చేస్తున్న ప్రచారం ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నది. రాజకీయాల్లోకి వస్తానని గత నాలుగేండ్లుగా ఊరించిన ప్రముఖ నటుడు రజినీకాంత్‌ చివర్లో యూటర్న్‌ తీసుకోవడం, మరో నటుడు కమల్‌హాసన్‌ నేతృత్వంలోని మక్కల్‌ నీది మయ్యం పార్టీ, శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌ ఏఎంఎంకే ప్రభావం అంతంతమాత్రమేనని విశ్లేషకులు చెబుతున్నారు.

కీలక నియోజకవర్గాల్లో మహిళలే నిర్ణేతలు
234 స్థానాలకు మంగళవారం జరిగే పోలింగ్‌లో 3,998 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరి భవితవ్యాన్ని 6.28 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. దాదాపు 40 శాతం స్థానాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండటంతో వారిని ఆకర్షించేందుకు అన్నిపార్టీలు వరాలు కురిపించాయి. ఎడప్పాడి నుంచి సీఎం పళనిస్వామి, బోడినాయక్కనూర్‌ నుంచి పన్నీర్‌సెల్వం, కొళత్తూర్‌ నుంచి స్టాలిన్‌, కోయంబత్తూర్‌ (సౌత్‌) నుంచి కమల్‌హాసన్‌ బరిలో నిలిచారు.

పుదుచ్చేరి ప్రతిష్ఠాత్మకం!
పుదుచ్చేరిలోని 30 స్థానాలకు మంగళవారం జరిగే పోలింగ్‌లో 324 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరి భవితవ్యాన్ని 10.04 లక్షల మంది ఓటర్లు తేల్చనున్నారు. అసెంబ్లీలో బలపరీక్షలో విఫలమైన నారాయణస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్‌ సర్కారు కుప్పకూలడంతో పుదుచ్చేరిలో రాష్ట్రపతిపాలన విధించారు. డీఎంకేతో కలిసి మళ్లీ అధికారంలోకి రావాలని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహించింది. తమను గద్దెదించిన బీజేపీపై పగ తీర్చుకోవాలని భావిస్తున్నది. దీంతో చిన్నదైనప్పటికీ పుదుచ్చేరి ఎన్నికలు కాంగ్రెస్‌, బీజేపీకి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. మరోవైపు, బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రధాని మోదీ వంటి దిగ్గజ నేతలు ముమ్మర ప్రచారం నిర్వహించారు.

మ‌‌రిన్ని వార్త‌లు చదవండి..

ఒక్కరోజే లక్షకు పైనే..

దేవభూమిలో హోరాహోరీ

ఒంటికాలితో బెంగాల్‌ను.. రెండుకాళ్లతో ఢిల్లీని గెలుస్తా

బెంగాలీలను భయపెట్టలేరు

మహారాష్ట్ర హోంమంత్రి రాజీనామా

మధ్యవర్తికి రూ.10 కోట్ల కమిషన్‌

శత్రు క్షిపణులను దారి మళ్లించే చాఫ్‌

7న మోదీతో ‘పరీక్షా పే చర్చా’

సిక్కింలో భూకంపం

గీతా ప్రెస్‌ అధ్యక్షుడు రాధేశ్యామ్‌ ఖేమ్కా కన్నుమూత

భూ కుంభకోణంలో యెడియూరప్పకు ఊరట

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఊపు తగ్గినా.. ఉత్కంఠే

ట్రెండింగ్‌

Advertisement