తిరువనంతపురం: కేరళలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ కూటమి గెలిచినప్పటికీ సీఎం కుర్చీ కోసం కాంగ్రెస్‌లో పంచాయితీ తెగడం లేదు. ముఖ్యమంత్రి రేసులో వీడీ సతీశన్, కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల ప్రధానంగా పోటీ పడుతున్నారు. వీరి అనుచరులు ఎవరికి వారుగా వీధుల్లోకి వచ్చి, ఆందోళనలు చేస్తుండటంతో నేతలంతా ఢిల్లీకి క్యూ కడుతున్నారు.
ఈ అంతర్గత పోరుకు తక్షణమే ముగింపు పలుకాలని రాహుల్ గాంధీ సదరు ముగ్గురు నేతలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. కేరళ ముఖ్యమంత్రి ఎవరనే దానిపై అతి త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తామని ఏఐసీసీ ఇన్చార్జ్ దీనా దాస్‌మున్షీ స్పష్టం చేశారు. ఈ సీఎం రేసులో అత్యంత కీలక మలుపు వేణుగోపాల్ ఎంట్రీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయకపోయినా, జాతీయ స్థాయిలో బలమైన నేతగా పేరొందిన ఆయనకు 43 మంది కాంగ్రెస్ నూతన ఎమ్మెల్యేల మద్దతు ఉందని కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గేకు పార్టీ పరిశీలకులు నివేదించారు. రాహుల్ గాంధీకి ఆప్తునిగా పేరొందిన వేణుగోపాల్‌ను కేరళ రాజకీయాలకు పంపుతారా? లేదా జాతీయ స్థాయిలోనే పార్టీ వ్యూహకర్తగా కొనసాగిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.
మరోవైపు కాంగ్రెస్ మిత్రపక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ సతీశన్‌కు బహిరంగంగానే మద్దతు పలికింది. ప్రతిపక్ష నేతగా ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని దీటుగా ఎదుర్కొని పార్టీ విజయానికి బాటలు వేసిన సతీశన్‌కే ఆ పదవి దక్కాలని ఆయన వర్గీయులు వాదిస్తున్నట్లు సమాచారం. మరో అగ్రనేత సోనియాగాంధీకి సన్నిహితుడైన రమేష్ చెన్నితల మద్దతుదారులు తమ నేత గతంలో సీనియారిటీని పక్కనపెట్టి, సీఎం పదవి త్యాగం చేశారని, అందుకే ఈసారి కచ్చితంగా ఆయనకే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.