హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అంకుర సంస్థలను ప్రోత్సహించడమే ధ్యేయంగా ఏర్పాటైన టీ-హబ్ లక్ష్యం కాంగ్రెస్ పాలనలో నీరుగారుతున్నది. ప్రభుత్వ పర్యవేక్షణ లోపించడంతో ఓ కీలకాధికారి టీ-హబ్‌పై పెత్తనం చెలాయిస్తూ నిబంధనలను అడ్డగోలుగా మార్చేసినట్టు తెలుస్తున్నది. టీ-హబ్ ప్రధాన లక్ష్యమైన ఇంక్యుబేషన్, మెంటరింగ్, స్టార్టప్‌ల అభివృద్ధిని గాలికొదిలేసి కేవలం ఆదాయ సమీకరణకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు విమర్శలున్నాయి. వేతన రూపంలో ఏటా రూ.కోటి వరకు అందుకుంటున్న ఆ అధికారి 140 పనిదినాల్లో కేవలం 53 రోజులే విధులకు హాజరయ్యారని, బెంగళూరులోనే ఉంటూ హైదరాబాద్‌లోని టీ-హబ్ కార్యకలాపాలకు అందుబాటులో ఉండటం లేదని, దీంతో స్టార్టప్‌లకు ఎలాంటి మద్దతు లభించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.
టీ-హబ్‌లో ఆ కీలకాధికారి సిబ్బంది నియామకాల్లో పారదర్శక విధానాలను పాటించడం లేదని, నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తున్నది. ఉద్యోగోన్నతుల్లో సైతం ప్రతిభ, సీనియార్టీని పక్కనబెట్టి తన బంధువులకు, తనతో సన్నిహితంగా మెలిగేవారికి పెద్దపీట వేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఆ అధికారి తీరును ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, దీంతో ఉద్యోగులు, స్టార్టప్ ప్రతినిధులు హడలెత్తిపోతున్నారని సమాచారం. టీ-హబ్‌లో కొనసాగాల్సిన కొన్ని ఇంక్యుబేషన్ కార్యక్రమాలను ఆ అధికారి అకారణంగా నిలిపివేసినట్టు తెలిసింది.
ప్రస్తుతం టీ-హబ్‌లో నెలకొన్న పరిస్థితులపై పలువురు ఉద్యోగులు, అంకుర సంస్థల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబుకు, ఐటీ శాఖ స్పెషల్ సీఎస్ సంజయ్‌కుమార్‌కు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదులు చేసినట్టు సమాచారం. ఒంటెద్దు పోకడలతో టీ-హబ్ ప్రతిష్టను దిగజార్చుతున్న ఆ అధికారిపై వెంటనే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే స్టార్టప్ ఎకోసిస్టమ్ దెబ్బతింటుందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిసింది. ఇప్పటికైనా టీ-హబ్ పాలనా వ్యవహారాల్లో పారదర్శకతను పెంపొందించాలని, సిబ్బంది నియామకాల్లో స్పష్టమైన విధానం అమలయ్యేలా చూడాలని, ఇంక్యుబేషన్ ప్రొగ్రామ్‌ల పునరుద్ధరణ, స్టార్టప్‌లకు మెరుగైన మెంటరింగ్ లాంటి అంశాలపై సర్కార్ ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఉద్యోగులు, స్టార్టప్‌ల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.