Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు 10లో అగ్నిపరీక్ష బ్యాచ్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. వేర్వేరు టీమ్స్‌లో ఉన్నప్పటికీ తమ బ్యాచ్ సభ్యుల కోసమే కలిసి ఆడుతున్నారనే విషయం మరోసారి స్పష్టమైంది. ముఖ్యంగా రోహిత్, షాలిని వ్యవహారం హౌస్‌లో చర్చకు దారితీసింది. ముందు ఎపిసోడ్లో వీరిద్దరూ తమ టీమ్ కంటే అగ్నిపరీక్ష బ్యాచ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారని షాలిని, రోహిత్‌పై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజా ఎపిసోడ్లో అగ్నిపరీక్ష బ్యాచ్ సభ్యులంతా కలిసి కూర్చొని మాట్లాడుకున్నారు. మరోవైపు సుధీర్‌తో పాటు సెలబ్రిటీ బ్యాచ్‌కు చెందిన కొందరు సభ్యులు రోహిత్, షాలిని కలిసి గ్రూపిజం చేస్తున్నారని చర్చించుకున్నారు.
ఈ సందర్భంగా సుధీర్ ఆసక్తికరమైన కామెంట్ చేశాడు. మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్టే రోహిత్ ప్రాణం షాలినిలో ఉందంటూ వ్యాఖ్యానించాడు. ఇక రాత్రి సమయంలో అందరూ నిద్రపోయిన తర్వాత రోహిత్.. అపూర్వతో ప్రత్యేకంగా మాట్లాడాడు. ఆమెను కూడా అగ్నిపరీక్ష బ్యాచ్‌కు దగ్గర చేయడానికి ప్రయత్నించినట్టుగా ఎపిసోడ్లో కనిపించింది. ఇదిలా ఉంటే.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో రోహిత్, షాలిని ఒకరినొకరు హగ్ చేసుకుని మాట్లాడుకున్నారు. తమ మధ్య ఉన్న అనుబంధం, భావోద్వేగాల గురించి చర్చించుకున్నారు. గత ఎపిసోడ్లో జరిగిన గొడవ గురించి కూడా ఇద్దరూ మాట్లాడుకున్నారు.
ముఖ్యంగా షాలిని మళ్లీ గొడవల్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని రోహిత్ సూచించాడు. గతంలో జరిగిన ఘటనలను గుర్తుచేస్తూ ఆమెకు కొన్ని జాగ్రత్తలు చెప్పాడు. ఆ తర్వాత బిగ్ బాస్ కెప్టెన్సీ కోసం మరో టాస్క్‌ను ప్రకటించారు. ఒక్కో టీమ్ నుంచి ఇద్దరు చొప్పున పాల్గొనే ఈ గేమ్‌లో లెక్కలకు సమాధానాలు చెప్పి, టైల్స్‌ను సరిగ్గా అమర్చి బిగ్ బాస్ లోగో వచ్చేలా చేయాలి. ఈ టాస్క్‌లో భైరవ రెడ్ టీమ్ తరఫున ఝాన్సీ, అపూర్వ, రోహిత్, వర్షిణి పాల్గొన్నారు. ప్రత్యర్థి టీమ్ నుంచి షాలిని, ముకేశ్, నరేష్, దేబ్జానీలను ఎంపిక చేసుకున్నారు. త్రిగున్ ఈ టాస్క్‌కు సంచాలకుడిగా వ్యవహరించాడు.
ఈ రౌండ్లో భైరవ రెడ్ టీమ్ విజయం సాధించింది. దీంతో బ్లూ టీమ్‌లోని ఒక కత్తిని తీసుకునే అవకాశం రెడ్ టీమ్‌కు లభించింది. ఝాన్సీ.. షాలిని కత్తిని తీసుకుంది. టాస్క్‌లో విజయం సాధించిన రెడ్ టీమ్‌కు మరో కీలక అవకాశం లభించింది. బ్లూ టీమ్ నుంచి ఒకరిని కెప్టెన్సీ కంటెండర్ రేసు నుంచి తప్పించాలని బిగ్ బాస్ ఆదేశించాడు. దీంతో సభ్యుల చర్చ అనంతరం త్రిగున్‌ను టార్గెట్ చేశారు. ముఖ్యంగా అపూర్వ, రోహిత్ త్రిగున్‌ను తొలగించాలనే అభిప్రాయాన్ని బలంగా వ్యక్తం చేశారు. అయితే వర్షిణి మాత్రం త్రిగున్ పేరును చెప్పలేదు. అనంతరం ఆమె త్రిగున్తో మాట్లాడుతూ.. అందరూ నీ పేరే చెప్పారని, నిన్నే టార్గెట్ చేశారని వెల్లడించింది. దీంతో త్రిగున్ హౌస్‌లో కొనసాగుతున్న వివిధ గ్రూపుల గురించి వర్షిణితో చర్చించాడు.
మరో టాస్క్‌లో ఒక్కో టీమ్ నుంచి ఇద్దరు మహిళలు మాత్రమే పాల్గొనాలని బిగ్ బాస్ సూచించాడు. ట్రాలీలో కూర్చొని తాడును ఎదురుగా ఉన్న పోల్‌కు వేసి.. దాని సహాయంతో ట్రాలీని ముందుకు తీసుకెళ్లి తమ టీమ్ జెండాను పోల్‌కు అమర్చాలి. ఎక్కువ జెండాలు అమర్చిన టీమ్ విజేతగా నిలవాలి.ఈ సమయంలో బ్లూ టీమ్‌కు చెందిన షాలిని తాను ఆడతానంటూ పట్టుబట్టింది. అయితే కొంతసేపటి తర్వాత రోహిత్ ఆమెతో మాట్లాడి పరిస్థితిని మార్చే ప్రయత్నం చేశాడు. చివరకు షాలిని తాను ఆడనని, తనకు మరో అవకాశం వస్తుందని చెప్పి వెనక్కి తగ్గింది.
మరోవైపు రెడ్ టీమ్‌లో వర్షిణిని ఆడించాలనే నిర్ణయంపై రోహిత్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. వర్షిణి మాత్రం తన సొంత టీమ్ సభ్యులే తనకు మద్దతు ఇవ్వకపోతే ఎలా అంటూ ప్రశ్నించింది. చివరకు బ్లూ టీమ్ నుంచి సృష్టి, దేబ్జానీ, రెడ్ టీమ్ నుంచి వర్షిణి, అపూర్వ పోటీకి దిగారు. త్రిగున్ సంచాలకుడిగా వ్యవహరించాడు. టాస్క్ ప్రారంభమైన వెంటనే అపూర్వ కింద పడిపోవడంతో ఆమె ఆట కొనసాగించాలా లేదా అనే నిర్ణయాన్ని త్రిగున్‌కు అప్పగించారు. ఆమెకు ఆడే అర్హత లేదని త్రిగున్ చెప్పడంతో అపూర్వ తీవ్రంగా స్పందించింది. త్రిగున్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
అయితే ఇతర సభ్యుల అభ్యర్థనతో టాస్క్‌ను మరోసారి మొదటి నుంచి నిర్వహించారు. ఈసారి బ్లూ టీమ్ అద్భుతంగా ఆడి 12 జెండాలు సాధించగా.. రెడ్ టీమ్ 8 జెండాలతో సరిపెట్టుకుంది. దీంతో సప్త శక్తి బ్లూ టీమ్ విజయం సాధించింది. బ్లూ టీమ్ విజయం సాధించడంతో రెడ్ టీమ్‌లోని ఇద్దరి కత్తులను తీసుకునే అవకాశం వారికి లభించింది. దేబ్జానీ–రోహిత్ కత్తిని, సృష్టి–వర్షిణి కత్తిని తీసుకున్నారు. అయితే మూడు టాస్కుల్లో రెండు టాస్కులు భైరవ రెడ్ టీమ్ గెలవడంతో.. తదుపరి కెప్టెన్సీ కంటెండర్లను ఆ టీమ్ నుంచే ఎంపిక చేయనున్నట్లు బిగ్ బాస్ ప్రకటించాడు. దీంతో తదుపరి కెప్టెన్సీ టాస్క్ రెడ్ టీమ్ సభ్యుల మధ్యే జరగనున్నట్లు తెలుస్తోంది.