భారతదేశ స్వాతంత్య్రానికి 80 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఎర్రకోటపై నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రసంగంలో ఉపయోగించిన ‘దిమాగీ నక్సల్” అనే పదం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం సాధారణ రాజకీయ సభ కాదు, అది దేశ ప్రజలు మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలు గమనించే అత్యున్నత సందర్భం. అలాంటి వేదికపై ప్రధానమంత్రి ఉపయోగించే ప్రతీ పదానికి రాజకీయ, రాజ్యాంగ, చారిత్రక ప్రాధాన్యత ఉంటుంది. అందువల్ల ఈ వ్యాఖ్యను కేవలం రాజకీయ విమర్శగా కాకుండా, భారత ప్రజాస్వామ్యంలో విభేదాలను ఎలా నిర్వచిస్తున్నారు? అనే ప్రశ్న దృక్పథంలో పరిశీలించాల్సిన అవసరం ఉన్నది.
ముందుగా నక్సలిజం, ‘దిమాగీ నక్సల్’ అనే పదాల మధ్య తేడాను గుర్తించాలి. 1967లో బెంగాల్లోని నక్సల్బరీలో ప్రారంభమైన నక్సలైట్ ఉద్యమం భూమి పంపిణీ, సామాజిక అసమానతలు, ఆదివాసీ హక్కులు, ఆర్థిక దోపిడీ వంటి చారిత్రక, సామాజిక సమస్యల నేపథ్యంలో పుట్టుకొచ్చింది. అనంతరం అది మార్క్స్, లెనిన్, మావో భావజాలాల ప్రభావంతో సాయుధ పోరాటాన్ని ఎంచుకున్నది. సీపీఐ (మావోయిస్టు) వంటి సంస్థలను భారత ప్రభుత్వం చట్టవిరుద్ధ సంస్థలుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో నక్సలిజాన్ని కేవలం శాంతిభద్రతల సమస్యగా మాత్రమే చూడడం సరైంది కాదు, దాని సామాజిక-ఆర్థిక మూలాలను అర్థం చేసుకోవాలి.
అయితే ‘అర్బన్ నక్సల్’, ‘దిమాగీ నక్సల్’ వంటి పదాలకు భారత చట్టాల్లో ఎలాంటి నిర్వచనమూ లేదు. ఇవి చట్టపరమైన పదాలు కాదు. రాజకీయ సంభాషణలో రూపుదిద్దుకున్న పదాలు. ఇటీవలి కాలంలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితర బీజేపీ నేతలు ఈ పదజాలాన్ని తరచుగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇలాంటి పదాలకు స్పష్టమైన నిర్వచనం లేదు కానీ, ఆ పదాలను ఉపయోగించే వారి ఉద్దేశంలో ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే మేధావులు, రచయితలే అర్బన్ నక్సల్స్, దిమాగీ నక్సల్స్ అనేది స్పష్టమవుతున్నది. ప్రభుత్వ పెద్దలు, పాలకపక్షం నేతలు వాడే పదజాలంతో జర్నలిస్టులు, అధ్యాపకులు, విద్యార్థులు, పౌర సమాజ ప్రతినిధులపై కూడా అనుమానాల నీడ పడే పరిస్థితిని సృష్టించే ప్రమాదం ఉన్నది.
‘దిమాగీ నక్సల్స్ను గుర్తించి, ఐసోలేట్ చేయాల్సిన అవసరమున్నది’ అని ప్రధాని తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇక్కడ ఒక మౌలిక ప్రశ్న తలెత్తుతుది. దేశంలో నిజంగా ‘దిమాగీ నక్సల్స్’ ఎంతమంది ఉన్నారు? వారిని గుర్తించే చట్టపరమైన ప్రమాణాలు ఏమిటి? ఈ ప్రశ్నలకు ఇప్పటివరకు అధికారిక సమాధానం లేదు. ‘దిమాగీ నక్సల్’ అనే పదానికి చట్టబద్ధ నిర్వచనం లేకపోవడంతో అది న్యాయపరమైన వర్గీకరణ కంటే రాజకీయ రూపకంగానే కనిపిస్తున్నది. అలాంటి అస్పష్టమైన పదజాలం విస్తృతంగా వినియోగిస్తే, హింసాత్మకవాదులను గుర్తించడం కంటే ప్రభుత్వాలను చట్టపరిధిలో ప్రశ్నిస్తున్న, విమర్శిస్తున్న వారినే లక్ష్యంగా చేసుకున్నట్టు అవుతుంది.
హింసను ప్రోత్సహించే వ్యక్తులను, రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాన్ని విమర్శించే పౌరులను ఒకే కోవలో చూడడం ప్రజాస్వామ్యానికి మేలు చేయదు. ఇటీవల ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వ్యక్తులు, ముఖ్యంగా విద్యార్థి ఉద్యమాల పట్ల అధికార వర్గాల స్పందన కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం దేశాన్ని ప్రశ్నించడం కాదు, ప్రభుత్వంపై అసమ్మతి తెలుపడం దేశద్రోహం కాదు. ప్రజాస్వామ్యంలో అధికారాన్ని ప్రశ్నించడం పౌరుల రాజ్యాంగబద్ధమైన హక్కు. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పడం ప్రభుత్వాల బాధ్యత. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) పౌరులందరికీ భావ ప్రకటనా స్వేచ్ఛను ఇచ్చింది. ‘ప్రజాస్వామ్యంలో విమర్శలు, విభేదాలు ప్రెషర్ కుక్కర్లోని సేఫ్టీ వాల్వ్ లాంటివి’ అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఓ సందర్భంలో అన్నారు. ఆ వాల్వ్ మూసివేస్తే ఒత్తిడి పెరిగి, చివరికి వ్యవస్థకే ప్రమాదం ఏర్పడుతుంది. విభేదాలను అణచివేస్తే సమస్యలు పరిష్కారం కావు, తీవ్రమయ్యేలా చేస్తుంది.
‘దిమాగీ నక్సల్’ అనే పదం కేవలం ఒక రాజకీయ వ్యాఖ్య కాదు. ఆ మాట భారత ప్రజాస్వామ్యంలో భావ ప్రకటనా స్వేచ్ఛ, విభేదాల స్థానం, జాతీయత నిర్వచనం, ప్రభుత్వంపౌర సంబంధాలపై ఒక ముఖ్యమైన చర్చకు నాంది పలుకుతున్నది. భద్రతను కాపాడటం ఎంత ముఖ్యమో, రాజ్యాంగబద్ధమైన విమర్శను రక్షించడం కూడా అంతే ముఖ్యం. ప్రజాస్వామ్యం బలపడేది ఏకరూపతతో కాదు, భిన్నాభిప్రాయాలను గౌరవించే సంస్కృతితో. ప్రభుత్వం అంటే దేశం కాదు, ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న తాత్కాలిక రాజకీయ వ్యవస్థ మాత్రమే. దేశం, రాజ్యాంగం ప్రజలందరివి. విమర్శ ప్రజాస్వామ్యానికి శత్రువు కాదు, ప్రజాస్వామ్యాన్ని సజీవంగా ఉంచే ప్రాణవాయువు.
(వ్యాసకర్త: అధ్యాపకుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయం)
ప్రొఫెసర్ కొండా నాగేశ్వర్
9705347798