టెహ్రాన్: అమెరికా, ఇజ్రాయెల్‌తో ఇరాన్ యుద్ధం ప్రపంచానికి పెద్ద తలనొప్పిగా మారింది. హొర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తే, దీనికి ప్రతిగా అమెరికా కూడా హొర్ముజ్ ప్రాంతాన్ని పూర్తిగా దిగ్బంధం చేసింది. హొర్ముజ్ నుంచి ఇరాన్ చమురు నౌకల్ని బయటకు రానివ్వటం లేదు. దీంతో ఇరాన్‌కు కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఇరాన్ చమురు బావుల్లో రోజూ ఉత్పత్తి అవుతున్న చమురును నిల్వ చేసేందుకు స్థలం లేకుండా పోయింది. మరోవైపు చమురు బావుల నుంచి ఉత్పత్తి ఆపే పరిస్థితి లేదు. దీంతో వెలికి తీసిన ముడి చమురును ఇరాన్ సముద్రంలో పారబోస్తున్నట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి వెలువడిన శాటిలైట్ చిత్రాలు అనుమానాల్ని బలపరుస్తున్నాయి.
సముద్రంపై చమురు తెట్టలుగా పేరుకుపోవటం చిత్రాల్లో కనిపించింది. ఇరాన్ రోజుకు 30 లక్షల బ్యారెళ్లకుపైగా ముడి చమురు ఉత్పత్తి చేస్తున్నది. ఇందులో అధిక భాగం ఖర్గ్ ద్వీపంలోని ప్రధాన ఎగుమతి టెర్మినల్ ద్వారా వెళ్తుంది. అమెరికా దిగ్బంధంతో ఇరాన్ నౌకలు హొర్ముజ్‌ను దాటి వెళ్లలేకపోతున్నాయి. దీంతో చమురు నిల్వ చేయడానికి స్థలం లేకుండా పోయింది. తేలియాడే ఆఫ్‌షోర్ ట్యాంకులను తీసుకొస్తే, అవి కూడా వేగంగా నిండిపోయినట్టు సమాచారం. ఒకవేళ చమురు వెలికితీత ఆపితే.. నీరు, ఇతర వాయువులు రాతి నిర్మాణాల్లోకి చొచ్చుకుపోయి చమురు బావులు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదముంది. మళ్లీ ఎంత ఖర్చుపెట్టినా.. చమురు ఉత్పత్తి చేయగలమా? అన్నది చెప్పలేం.
హొర్ముజ్లోని సముద్రగర్భ కేబుళ్లపైనా నియంత్రణ సాధించాలని భావిస్తున్నది. హొర్ముజ్ నుంచి వెళ్తున్న మొత్తం 7 సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుళ్లపై పూర్తి నియంత్రణ సాధించాలని ఆలోచిస్తున్నది. ఇంటర్నెట్ కమ్యూనికేషన్లను అందించే కేబుళ్లపై సుంకం విధించాలని టెహ్రాన్ ప్రతిపాదిస్తున్నది. అంతేగాక వీటి నిర్వహణ, మరమ్మతులన్నీ కేవలం దేశీయ కంపెనీల ద్వారానే జరుగాలని ఇరాన్ కోరుకుంటున్నది.