e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home Top Slides జన సంద్రం

జన సంద్రం

జన సంద్రం
  • ‘లక్ష’ణంగా హాలియా సభ
  • వాతావరణం చల్లగా.. జనం తరలొచ్చె భారీగా
  • టీఆర్‌ఎస్‌ అభిమానులు, శ్రేణులతో కిక్కిరిసిన హాలియా

హాలియా, ఏప్రిల్‌ 14: టీఆర్‌ఎస్‌ బహిరంగసభతో హాలియా జనసంద్రమైంది. బుధవారం ఉదయం నుంచి మబ్బులు కమ్ముకుని వాతావరణమూ సభకు సహకరించింది. టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దసంఖ్యలో తరలిరావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. ఎటుచూసినా టీఆర్‌ఎస్‌ జెండాలు, భారీ ప్లెక్సీలు, హోర్డింగ్‌లు దర్శనమిచ్చాయి. ‘జై తెలంగాణ.. జై కేసీఆర్‌’ నినాదాలతో హాలియా, బహిరంగసభ ప్రాంగణం మార్మోగింది. నియోజకవర్గంలోని అనుముల, పెద్దవూర, నిడమనూరు, త్రిపురారం, గుర్రంపోడు, తిరుమలగిరి సాగర్‌, మాడ్గులపల్లి మండలాల నుంచి ట్రాక్టర్లు, డీసీఎంలు, బైక్‌లపై ప్రజలు తరలివచ్చారు. సభకు వచ్చినవారి కోసం టీఆర్‌ఎస్‌ నేతలు లక్ష మజ్జిగ ప్యాకెట్లు, లక్షన్నర మంచినీళ్ల ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. ఏ ఇబ్బంది తలెత్త కుండా అన్ని ఏర్పాట్లుచేశారు. రూట్లవారీగా పార్కింగ్‌ సౌకర్యం కల్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూసేందుకు ప్రజలు మధ్యాహ్నం రెండు గంటల నుంచే గ్రామాల నుంచి స్వచ్ఛందగా బయలుదేరారు. మూడు గంటలకు సభా ప్రాంగణానికి తండోపతండాలుగా తరలివచ్చారు. సభకు సుమారు లక్ష మంది వరకు వచ్చినట్టు అంచనా.

హోరెత్తిన హాలియా

26 నిమిషాలపాటు సీఎం కేసీఆర్‌ స్ఫూర్తిదాయక ప్రసంగం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాలియాలో బహిరంగ సభ ప్రాంగణానికి బుధవారం సాయంత్రం 6.10 గంటలకు వచ్చారు. వేదికపై చేరుకొని 6.22 నుంచి 6.48 నిమిషాల వరకు స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. కేసీఆర్‌ మాట్లాడినంత సేపు ప్రజలు నిశ్శబ్దంగా విన్నారు. అక్కడక్కడ సామెతలు చెప్పినప్పుడు జనం కేరింతలు కొట్టారు. ‘గాడిదకు గడ్డేసి ఆవుకు పాలు పిండితే రావు’, ‘ముళ్ల చెట్టుపెట్టి కాయలు కాయమంటే కాయవు’, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నాయకులు ‘పదవుల కోసం పెదవులు మూసుకుండ్రు’ అని మాట్లాడినప్పుడు సభకు హాజరైనవారు ఈలలు, చప్పట్లతో హోరెత్తించారు.

రోడ్డు మార్గంలోనే..

హాలియా టీఆర్‌ఎస్‌ బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రోడ్డుమార్గంలోనే వచ్చి వెళ్లారు. వాస్తవానికి సభకు హెలికాప్టర్‌లో వచ్చి.. వెళ్లేటప్పుడు రోడ్డు మార్గంలో వెళ్లాల్సి ఉన్నది. కానీ, ఉదయం వాతావరణం మేఘావృతం కావడంతో సీఎం కేసీఆర్‌ రోడ్డుమార్గంలో సభకు వచ్చారు. సభ త్వరగా పూర్తయితే హెలికాప్టర్‌లో తిరిగి హైదరాబాద్‌కు వెళ్లాలి అనుకున్నారు. సభ 6.50 గంటలకు పూర్తికావడంతో హెలికాప్టర్‌ ద్వారా కాకుండా రోడ్డుమార్గంలోనే తిరిగి వెళ్లారు.

సారుకు అన్నీ తెలుసు

సీఎం కేసీఆర్‌ నాయకుడు, ఉద్యోగస్తుడు, ఇంజినీరు, ప్రొఫెసరు అన్నితీర్ల ఆరేండ్లల్ల తెలంగాణ రాష్ర్టాన్ని ఏవిధంగా నడిపిస్తున్నడో మనందరికీ తెలుసు. మా ఊర్లో 350 నుంచి 400 మందికి వృద్ధాప్య పింఛన్లు, వికలాంగుల పింఛన్లు, విడో పింఛన్లు ఇస్తున్నరు. నలభై యాభై మంది దాంక కల్యాణలక్ష్మి కింద లక్ష నూటపదహార్లు వచ్చినయి. రైతుబంధు రానోళ్లే లేరు. నిన్న మొన్న నెల్లికల్లులో ఓపెన్‌ చేసిన లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాలతోని మా మండలంలో ఐదారు గ్రామాలకు నీళ్లు వస్తయి. కేసీఆర్‌ సార్‌ అంటే అభిమానంతోని సభకు పోతున్నా.
-బొజ్జయ్య, తేనెపల్లి, గుర్రంపోడు మండలం

కేసీఆర్‌ను చూసే ఓటేస్తాం..

కేసీఆర్‌ మీటింగ్‌కు కుటుంబంతో సహా వచ్చినం. కరోనా టైమ్‌లో కూడా సీఎం కేసీఆర్‌ సారు ఊర్లల్ల కల్లాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయించిండ్రు. అట్లాంటి వ్యక్తిని మేము మరిచిపోం. గతంలో కరెంట్‌ కోసం శానా ఇబ్బంది పడ్డాం. నైటనకుంట.. పగలనకుండ మూడు గంటల కోసం మోటర్ల కాడ పడుకొనేది. మా పిల్లలు కూడా అంటున్నరు డాడీ అప్పుడు రోజూ నైట్‌ పోయేది.. ఇప్పుడు పోతలేదని.. ఇప్పుడు 24 గంటల కరెంట్‌ వస్తున్నది. రైతుబంధుతోపాటు ఉచిత విద్యుత్తు ఇవ్వడం సంతోషంగా ఉన్నది. మాకు ఇది చాలు. రైతులమంతా ఒక పక్షాన ఉన్నాం.. ఎవరెన్ని చెప్పినా మేము కేసీఆర్‌ చూపించిన వ్యక్తికే ఓటేస్తాం.
-తిరుపతినాయుడు, హాలియా

అన్ని పథకాలు వచ్చినయి

సాగర్‌ను ఆనుకొని ఉన్న మా ప్రాంతానికి చుక్క నీరు లేకపాయే. కేసీఆర్‌ సీఎం అయినాక ఇక్కడ లిఫ్ట్‌ పనులు ప్రారంభించిండ్రు. మరో ఏడాదిలో పూర్తయితయి అంటున్నారు. ఇగ మా ప్రాంతం మంచిగా అభివృద్ధి చెందుతది. నాకు రెండెకరాల భూమి ఉన్నది. పెట్టుబడి సాయం కింద కారుకు పది వేలు ఇస్తుండు. కేసీఆర్‌ సార్‌ హాలియాలో సభ పెట్టిండు అని తెలిసి, నా భార్య పిల్లలతో నా బైక్‌పై సొంతంగా వచ్చిన. మా అమ్మకు పింఛన్‌ ఇవ్వబట్టె. ఇన్ని చేస్తున్న కేసీఆర్‌ సార్‌ను ఒక్కసారి చూసి పోదామని వచ్చిన. – నాగు, శేరుతండా, తిరుమలగిరి సాగర్‌ మండలం

ఆయన లెక్క ఎవ్వలూ పనులు చేయలే..

నాకు ఎకరం పది గుంటల భూమి ఉంది. దానికి కేసీఆర్‌ సారు పెట్టుబడి సాయం ఇస్తుండు. మా ముసలోళ్లకు నెలకు రెండు వేల రూపాయలిస్తుండు. గొల్లలకు గొర్రెలు ఇచ్చె. ఇంటి కొడుకు కూడా గిట్ల ఇన్ని రకాల సౌలత్‌లు ఇచ్చి చూసుకుంటోళ్లు కాదు. ఇప్పటిదాకా కేసీఆర్‌ లెక్క ఎవ్వలూ ఇన్ని పనులు చేయలే. గిన్ని చేసిన కేసీఆర్‌ సార్‌ హాలియా వస్తుండని తెలిసి ఊళ్ల నుంచి డొంక పొంటి పడి సభకు వచ్చిన. సార్‌ను ఆశీర్వదించే పోతా. -పిల్లి ఇద్దయ్య, చలకుర్తి, పెద్దవూర మండలం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జన సంద్రం

ట్రెండింగ్‌

Advertisement