నమస్తే తెలంగాణ నెట్వర్క్: ఊరూవాడ ఏకమవుతున్నాయి. కనీవినీ ఎరుగనిరీతిలో ప్రగతి బాటలు వేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉంటామని ప్రతినబూనుతున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గంలో ‘మా ఓటు టీఆర్ఎస్కే’ అంటూ యాదవ, కురుమ, రజక, కుమ్మరి, మాల మహానాడు, కుల సంఘాలు, కార్మిక సంఘాలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నాయి. ఆదివారం ఒకేరోజు నియోజకవర్గంలోని ఏడు గ్రామాల్లోని వివిధ కుల సంఘాలతోపాటు ఓ కార్మిక సంఘం గులాబీ పార్టీకి మద్దతు ప్రకటించింది. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని దేశరాజ్‌పల్లి, అంబాల, కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని సీతంపేట, హుజూరాబాద్ మండలంలోని సిర్సనపల్లి, జమ్మికుంట మండలంలోని వావిలాల, జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి, రామన్నపల్లి గ్రామాల్లోని పలు కుల సంఘాలు టీఆర్ఎస్కే జై కొట్టాయి. అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి పెద్దసంఖ్యలో పలు రాజకీయపార్టీల నాయకులు, వివిధ సంఘాల నేతలు, సంస్థల ప్రతినిధులు టీఆర్ఎస్లో చేరారు.
హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి, రామన్నపల్లి విఘ్నేశ్వర రజక సహకార సంఘాల నాయకులు, సభ్యులు టీఆర్ఎస్ వెంటే ఉంటామని ఏకగ్రీవంగా తీర్మానించారు. కొత్తపల్లిలో రజక సంఘం సమావేశానికి హాజరైన మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు నరేందర్, కోరుకంటి చందర్‌కు తీర్మానప్రతి అందజేశారు. రజకులు ఆర్థికంగా ఎదిగేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు దోహదపడుతున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. టీఆర్ఎస్కు మద్దతుగా రజకుల ఏకగ్రీవ తీర్మానం అభినందనీయమని పేర్కొన్నారు.
టీఆర్ఎస్తోనే వావిలాల కుమ్మరి సంఘం
జమ్మికుంట మండలం వావిలాల గ్రామానికి చెందిన కుమ్మరి శాలివాహన సంఘంలోని 50 మంది పెద్దలు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ప్రతిని ఎమ్మెల్యేకు అందించారు.
విద్యుత్తు కార్మిక సంఘం మద్దతు
తెలంగాణ విద్యుత్తు కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేవీ జాన్సన్, ప్రధాన కార్యదర్శి కోడూరి ప్రకాశ్ సూచన మేరకు రాష్ట్ర విద్యుత్తు కార్మిక సంఘం టీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేసినట్టు డివిజన్ అధ్యక్షుడు తాటిపాముల తిరుపతయ్య తెలిపారు. ఆయన అధ్యక్షతన హుజూరాబాద్ మున్సిపల్ పారులో అత్యవసర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థికే మద్దతు అంటూ డివిజన్ కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.
సిర్సపల్లి మాలమహానాడు తీర్మానం
హుజూరాబాద్ మండలం సిర్సపల్లి మాల మహానాడు గ్రామశాఖ అధ్యక్షుడు ఎడ్ల భిక్షపతి, ఉపాధ్యక్షుడు బకయ్య, ప్రధాన కార్యదర్శి మద్దెల సురేందర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. వీరికి హుజూరాబాద్ సింగిల్ విండో అధ్యక్షుడు ఎడవెల్లి కొండల్‌రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారంతా కారు గుర్తుకే ఓటు వేస్తామని తీర్మానించారు.