e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, April 15, 2021
Advertisement
Home Top Slides గంగ మెరిసే.. వాగు మురిసే!

గంగ మెరిసే.. వాగు మురిసే!

గంగ మెరిసే.. వాగు మురిసే!
  • మండుటెండల్ల మంజీర నాదాలు.. తెలంగాణ జలచరిత్రలో మహోజ్వల ఘట్టం
  • నిజాంసాగర్‌కు నీళ్లు విడుదల చేసిన సీఎం కేసీఆర్‌
  • మంజీర ఒడికి తల్లి గోదావరి పయనం
  • కొండపోచమ్మ నుంచి హల్దీవాగులోకి నీరు
  • సంగారెడ్డి కాల్వద్వారా వదిలిన కేసీఆర్‌
  • గంగమ్మకు చీరెసారెలు.. వాగులోకి నాణేలు
  • జల సంబురం జరుపుకొన్న అన్నదాతలు
  • వాగు పొడవునా గోదావరి నీటికి పూజలు
  • ఉమ్మడి మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాల నుంచి భారీగా హాజరైన రైతులు, ప్రజాప్రతినిధులు

సురసురమని కాలే ఎండలో బుసబుసమని పొంగిన నీళ్లను చూసి… పొడారిపోయిన వాగు
ఇసుక కిసుక్కున నవ్వింది.
తడి వాసన తగిలి పెద్ద ముక్కు కొంగలు అనుమానంతో మబ్బుల దిక్కొక్కసారి చూసి.. మట్టిని పసిగట్టి చిక్కగా పారుతున్న వాగులో వాలిపోయాయి.
శిశిరంలో వాగంచున వాడిపోయిన తుమ్మ చెట్టు వేర్లు.. జల తాకిందని ఒక్కసారి జలదరింపుకు లోనయ్యాయి.
పాడుబడ్డ చెరువు కట్ట మీది మైసమ్మకు మళ్లీ పూజలు మొదలయ్యాయి.
కాల్వ నీళ్లలోకి పిల్లలు కైంచి కొట్టి.. కేసీఆర్‌ తాత కటౌట్‌ను పైకెత్తారు.
చల్లటి నీళ్లలోకి దిగిన నడియీడు సరిజోడుగాళ్లు.. ఒకరిపై ఒకరు పన్నీరు చల్లుకుంటూ పరాచికాలాడారు.
మూలకున్న ముసలవ్వ మూలుగుతూనే కాల్వకాడికి వచ్చి.. మనుమరాండ్లతో బోసినవ్వుల సెల్ఫీ తీయించుకుంది.
బంగారు గొలుసుల వరి కంకులకిక ఏ ఢోకా లేదని.. రైతన్న ఆప్యాయంగా, ఆత్మీయంగా తడిమి చూసుకున్నడు.
భక్తితో దండాలు పెట్టిన వారొకరు. ఈలవేసి గోల చేసింది ఇంకొకరు. జలకాలాటకు దిగింది మరొకరు. కేసీఆర్‌కు జైకొట్టింది వేరొకరు.
ఇది మనూరేనా? ఇది మన వాగేనా? అని అబ్బురంతో ఆశ్చర్యంతో చూసిన ముసలయ్యలు వేరు!
కాళేశ్వరుడు తాండవమాడితే విచ్చుకున్న ఝూటం నుంచి విడివడిన జటల మాదిరిగా… నీళ్లు రువ్వడి తిరుగుతూ, సవ్వడి చేస్తూ కాల్వల నుంచి దుంకుతుంటే… తడారిపోయిన నేల కణాలను అణువణువూ కమ్ముకుంటూ, జల రాశిని చిమ్ముకుంటూ గంగమ్మ పరవశంతో పరుగులు తీస్తుంటే… గోసపడ్డ వాగు, చెరువు, చేను, చెలక గోదావరి నీళ్లలో సరిగంగ స్నానాలు చేశాయి. ముత్తెమంత మునిగి మురిసిపోయాయి.
ఎర్ర ర్యాగడి నేల మెరుపు మరింత ఎర్రబడిపోయింది.
కరువు ప్రాంతమైన గజ్వేల్‌ నియోజకవర్గంలో, కొండ పోచమ్మ నుంచి హల్దీవాగు ద్వారా మంజీర- నిజాంసాగర్‌లోకి నీళ్లు వదిలిన ఘట్టాన్ని ఏమని వర్ణించగలం! ఎంతని చెప్పగలం! దిష్టికొడుతుందేమో!
అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ గుమ్మడి కాయ కొట్టి దిష్టి తీశారు. కలశోదకం కలిపి, మంత్రాక్షతలు జల్లి వేడుకున్నారు. గంగమ్మకు చీరె, సారె పెట్టి నిజాంసాగర్‌ వైపు సాగనంపారు!
పారుతున్న నీళ్లలో జనం పోసిన పూల రేకులు కాల్వ నిండా పేరుకున్న దృశ్యం చూస్తుంటే… గోదారికి గులాబీ దండేసినట్టు కనిపించడం లేదూ!

సిద్దిపేట, మార్చి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రపంచంలోనే మహా నిర్మాణమైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మరో చరిత్ర సృష్టించింది. కొండపోచమ్మ రిజర్వాయర్‌నుంచి సంగారెడ్డి కెనాల్‌ ద్వారా హల్దీవాగుకు గోదావరి జలాలను తరలించే అద్భుత ఘట్టాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించారు. మంగళవారం సంగారెడ్డి కాల్వ అప్‌టేక్‌ తూము గేట్లను ఎత్తి హల్దీ వాగులోకి కాళేశ్వర జలాలను వదిలిపెట్టారు. మంగళవారం హైదరాబాద్‌ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ప్రత్యేక బస్సులో సీఎం కేసీఆర్‌.. నేరుగా సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం అవుసులపల్లికి చేరుకొన్నారు. వేదపండితులు ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు, అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి వేద మంత్రోచ్ఛారణల మధ్య గోదావరి జలాలకు సీఎం కేసీఆర్‌ పూజలు నిర్వహించారు. పుష్పాభిషేకంచేశారు. గంగమ్మతల్లికి చీరె, సారె.. పసుపు కుంకుమలు వేసి.. పాలుపోసి.. నీటిలో నాణేలను వదిలారు. ఆ తర్వాత పాములపర్తి వద్ద కొండపోచమ్మసాగర్‌ మరో కాల్వ ద్వారా గజ్వేల్‌ నియోజకవర్గానికి సాగునీటిని విడిచిపెట్టారు. కాల్వ వెంట గోదావరి జలాలు వెళ్తుంటే.. వాటిని చూస్తూ.. మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం తన సంతోషాన్ని పంచుకొన్నారు. రైతులు జై కేసీఆర్‌ అంటూ హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్‌ విక్టరీ సంకేతాన్ని చూపిస్తూ అన్నదాతలకు అభివాదంచేశారు.

500 క్యూసెక్కులు విడుదల

అవుసలపల్లి ప్రాంతానికి సరిగ్గా 11 గంటలకు ముఖ్యమంత్రి చేరుకొన్నారు. సంగారెడ్డి కెనాల్‌ నుంచి హల్దీవాగులోకి నీటిని మళ్లించేందుకు ఏర్పాటుచేసిన అప్‌టేక్‌ తూము వద్దకు వచ్చి.. గేట్లను ఎత్తి నీటిని విడుదలచేశారు. తూము నుంచి వచ్చే నీటిని పరిశీలించారు. మొత్తం 1600 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సిఉండగా.. ఒకేసారి నీటిని విడుదలచేస్తే కాల్వ కు, చెరువులకు ప్రమాదం సంభవించే అవకాశం ఉండటంతో తొలుత 500 క్యూసెక్కుల నీటిని వదిలారు. నీటిప్రవాహాన్ని బట్టి విడుదల మొత్తాన్ని క్ర మంగా పెంచుతారు. తొలుత సంగారెడ్డి కెనాల్‌నుంచి 1.2 కిలోమీటర్‌ దూరంలో ఉన్న చౌదరిపల్లి బంధం చెరువులోకి కాళేశ్వరం జలాలు చేరుకొన్నాయి. అక్కడినుంచి 2.6 కిలోమీటర్ల దూరంలోని వర్గల్‌ పెద్ద చెరువులోకి ప్రవహిస్తాయి. తర్వాత హల్దీవాగుకు.. అటునుంచి నిజాంసాగర్‌కు చేరుకొంటాయి. హల్దీవాగులోకి కాళేశ్వర జలాలరాకతో గజ్వేల్‌ నియోజకవర్గం తూప్రాన్‌తోపాటు, మెదక్‌, నర్సాపూర్‌ నియోజకవర్గాల్లోని దాదాపు 15 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తూ నిజాంసాగర్‌లోకి నీళ్లు చేరుతాయి.

ఉవ్వెత్తున జల పండుగ

దసరా, దీపావళి పండుగల కంటే ఎక్కువ సంతోషంగా ఉన్నామని.. తమ ప్రాంతానికి సాగునీటిని తీసుకొచ్చిన దేవుడు కేసీఆర్‌ అని రైతులు వేనోళ్ల కొనియాడారు. సీఎం కేసీఆర్‌ విజయసంకేతం చూపుతూ రైతుల్లో మరింత ఉత్సాహాన్ని నింపారు. సంగారెడ్డి కెనాల్‌ నుంచి హల్దీవాగులోకి నీటి విడుదల కార్యక్రమానికి ఉమ్మడి మెదక్‌ జిల్లా రైతులతోపాటు నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల నుంచి రైతులు పెద్దఎత్తున తరలివచ్చారు. కొవిడ్‌ నిబంధనల మేరకు కార్యక్రమాన్ని సాదాసీదాగా నిర్వహించినప్పటికీ, రైతులు పెద్దసంఖ్యలో తరలివచ్చి గోదావరి జలాలను చూసి మురిసిపోయారు. తమ ప్రాంతానికి కాళేశ్వర గంగమ్మ చేరడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సాగునీరు తీసుకువస్తానని మాటిచ్చిన సీఎం కేసీఆర్‌ అన్నట్టుగానే నీళ్లు తెచ్చి మండుటెండలల్ల చెరువులు, చెక్‌డ్యాంలను నింపుతున్నారంటూ సంబురాలు చేసుకొన్నారు. మొగులు కేసి చూసే రోజులు ఇక పోయాయంటూ రైతులు హర్షం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌ కెనాల్‌ వద్ద గోదావరి జలాలను కాలువలోకి వదలగానే గజ్వేల్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ మాదాసు అన్నపూర్ణా శ్రీనివాస్‌ నేతృత్వంలో 50 కేసీఆర్‌ చిత్రపటాలకు మహిళలు, రైతులు క్షీరాభిషేకంచేశారు. బెలూన్లను నీటిలోకి వదిలారు. కెనాల్‌కు ముందు భాగంలో గజ్వేల్‌ రూరల్‌ మండలం, గజ్వేల్‌ వైపు నీరు వెళ్లే మార్గంలో ఇరువైపులా కొండపాక, మర్కూక్‌ మండలాల రైతులు కాలువలోకి నీరురాగానే సంబురపడుతూ పూలు, కుంకుమ, పసుపు చల్లి ‘జై కేసీఆర్‌, జై హరీశ్‌రావు’ అంటూ నినాదాలుచేశారు. కొందరు టీఆర్‌ఎస్‌ నాయకులు కాలువలోకి దూకి ఈతకొట్టారు. గజ్వేల్‌ కెనాల్‌ వద్దకు మర్కూక్‌, గజ్వేల్‌ రూరల్‌ మండలం, కొండపాక మండలాలకు చెందిన మహిళలు, రైతులు, నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కెనాల్‌కు రెండువైపులా నిలబడి నీటి విడుదలను ఆసక్తిగా తిలకించారు. బూరుగుపల్లి, పాములపర్తి, ఇంద్రనగరానికి చెందిన వృద్ధ మహిళలు కూడా ఈ కార్యక్రమాన్ని చూసేందుకు వచ్చారు. సీఎం కేసీఆర్‌ చిత్రపటాలను తీసుకొచ్చి సందడిచేశారు.

అస్వస్థతకు గురైన స్పీకర్‌

కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌తో కలిసివచ్చిన శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి పాములపర్తి వద్ద గజ్వేల్‌ కెనాల్‌కు నీటి విడుదల సమయంలో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అవుసలపల్లిలో నీటి విడుదల అనంతరం పాములపర్తి వద్ద పూజ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా కండ్లు తిరిగినట్లు అవ్వగానే పక్కనే ఉన్న మంత్రి హరీశ్‌రావు పట్టుకొని పోచారం శ్రీనివాసరెడ్డిని కుర్చీలో కూర్చోబెట్టారు. కొంచెం తేరుకున్నాక కారులో తీసుకెళ్లారు. సీఎం కేసీఆర్‌ ‘ఎలా ఉంది సీనన్నా’ అంటూ ఆయనను పలకరించారు.

గౌరారం వద్ద పూల వర్షంతో ఘనస్వాగతం

సంగారెడ్డి కెనాల్‌లోకి గోదావరి నీటిని విడుదలచేసేందుకు వస్తున్న క్రమంలో సిద్దిపేట జిల్లా గౌరారం వద్ద రాజీవ్‌ రహదారిపై సీఎం కేసీఆర్‌ కాన్వాయ్‌ మీద మహిళలు పూలవర్షం కురిపించి స్వాగతంపలికారు. గౌరారం నుంచి పాములపర్తి సమీపంలోని గజ్వేల్‌ కెనాల్‌ వరకు ప్రజాప్రతినిధులు, నాయకులు ఏర్పాటు చేసిన ఫ్ల్లెక్సీలు, స్వాగత తోరణాలు ఆకట్టుకున్నాయి. గజ్వేల్‌ నియోజకవర్గంలో సీఎం పర్యటన 50 నిమిషాల పాటు కొనసాగింది. పాములపర్తి వద్ద గజ్వేల్‌ కెనాల్‌ కాల్వకు నీటిని విడుదల చేసి 11.50 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు.

ముఖ్యమంత్రికి ఉమ్మడి జిల్లాల నేతల కృతజ్ఞతలు

నిజాంసాగర్‌కు కాళేశ్వరం జలాలను విడుదల చేసిన సందర్భంగా ఉమ్మడి మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాల మంత్రులు, ప్రజా ప్రతినిధులు మంగళవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును ప్రగతిభవన్‌లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను కలిసినవారిలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు బీబీ పాటిల్‌, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు గంగాధర్‌గౌడ్‌, డీ రాజేశ్వర్‌రావు, హన్మంత్‌షిండే, శేరి సుభాష్‌రెడ్డి, ఫరూక్‌, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, మాణిక్యరావు, మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి, ఎలక్షన్‌రెడ్డి తదితరులున్నారు.

గజ్వేల్‌కు కాళేశ్వర జలాలు

సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం పాములపర్తి వద్ద కొండపోచమ్మ సాగర్‌ నుంచి ప్రత్యేకంగా నిర్మించిన కాలువ ద్వారా గజ్వేల్‌ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాగునీటిని విడుదలచేశారు. ఈ కాలువ ద్వారా గజ్వేల్‌ నియోజకవర్గంలోని దాదాపు 20 చెరువులను నింపడం ద్వారా యాసంగి పంటలకు అవసరమైన సాగునీటిని అందిస్తారు. ఈ చెరువులను నింపుకొంటూ పోవడంద్వారా కాలువ కూడవెల్లి వాగులో కలుస్తుంది. దీంతో ఇంతకాలం బోరుబావులు, వర్షాలపై ఆధారపడి పంటలు పండించిన రైతులకు మంచి రోజులు వచ్చినట్టయింది. బీడుభూముల్లో గోదావరి జలాలు పారించి సస్యశ్యామలం చేయాలన్న సీఎం కేసీఆర్‌ సంకల్పం నెరవేరింది.

పుల్‌ హ్యాపీగా సీఎం కేసీఆర్‌

గజ్వేల్‌ పర్యటనలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పుల్‌ హ్యాపీగా కనిపించారు. ఉన్నంతసేపు సంతోషంగా గడిపారు. హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి నీటిని విడుదల చేశాక ప్రత్యేకంగా నీటి ప్రవాహాన్ని పరిశీలిస్తూ మంత్రముగ్దులయ్యారు. కాలువలో గోదారమ్మ జలాలు పరుగులు పెడుతుంటే.. సంతోషంగా నాణేలను వదిలారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంట స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు సంతోష్‌కుమార్‌. కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్‌, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మహిపాల్‌రెడ్డి, మాణిక్‌రావు, బాజిరెడ్డి గోవర్ధన్‌, గణేశ్‌గుప్తా, హన్మంతు షిండే, చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, వీ గంగాధర్‌గౌడ్‌, ఫరీదుద్ద్దీన్‌, రాజేశ్వర్‌రావు, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్లు రోజా రాధాకృష్ణ శర్మ (సిద్దిపేట), మంజూశ్రీ జైపాల్‌రెడ్డి (సంగారెడ్డి), హేమలత శేఖర్‌ (మెదక్‌), ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, సీఎం వోఎస్డీ స్మితా సబర్వాల్‌, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌, ఈఎన్సీ హరిరామ్‌, కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి ఉన్నారు.

చెరువంత నీళ్ల పండుగ

గజ్వేల్‌, ఏప్రిల్‌ 6: గోదావరి జలాలు బంధం చెరువులోకి చేరడంతో రైతుల సంతోషం పట్టరాకుండా మారింది. చెరువంతా గోదావరి నీరు పారుతూ గంటగంటకు నీటిమట్టం పెరుగుతుంటే రైతులు, ప్రజలు సంబురాలు చేసుకొన్నారు. సీఎం కేసీఆర్‌ సిద్దిపేట జిల్లా అవుసులోనిపల్లి వద్ద బంధం చెరువు ఫీడర్‌ కెనాల్‌ గేట్లు స్వయంగా తిప్పి నీటిని వదిలారు. కొవిడ్‌ కట్టుబాట్లు ఉన్నా మాస్క్‌లు ధరించి చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి తిలకించారు. నీరు విడుదల కాగానే బంధం చెరువు వరకు 1.20 కిలోమీటర్లున్న ఫీడర్‌ కెనాల్‌ గుండా గోదావరి జలాలు ఉరకలు వేశాయి. అక్కడక్కడ మత్తళ్లు దుంకుతూ వెళ్లడం చూపరులకు కనువిందు కలిగించింది. కెనాల్‌ ఇరువైపులా చౌదరిపల్లి, అవుసులోనిపల్లి, రామక్కపేట, వర్గల్‌, గౌరారం, చాంద్‌ఖాన్‌ మక్త, శేరిపల్లి , సీతారాంపల్లి తండా తదితర గ్రామాల రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. సీఎం కేసీఆర్‌ గేట్లు ఎత్తి ప్రవాహంలో పూలుచల్లారు. కిలోల కొద్ది పూలు నాయకులు, వివిధ గ్రామాల ప్రజలు చల్లడంతో కాలువలో నీటి ప్రవాహంపై పూల తెప్పలు ఏర్పడ్డాయి. సీఎం విడుదలచేసిన సుమారు గంటలోపే గోదావరి జలాలు బంధం చెరువును చేరుకోవడంతో రైతులు సంతోషంగా నీళ్లల్లో ఆటలాడుకొన్నారు. చౌదరిపల్లి గ్రామ సర్పంచ్‌ బుడిగే లలితశంకర్‌ గౌడ్‌, ఎంపీటీసీ సంజనా భిక్షపతిరెడ్డి, చాంద్‌ఖాన్‌ మక్త సర్పంచ్‌ కనకయ్య, రైతుబంధు సమితి సభ్యులు, వివిధ గ్రామాల ప్రజలు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

సారుకు రుణపడి ఉంటం
ఎన్కట 15 గజాల బాయి తవ్వితే మస్తు నీళ్లుంటుండే. రాను రాను బోర్లేసి నీళ్లు తగ్గిపోయినయి. పదేండ్ల క్రితం తాగుదామంటే లేవాయే. మస్తు నీళ్లు సముద్రంల కలుస్తున్నయని టీవీల్లల్ల చెప్త్తుంటే విని.. గా నీళ్లు ఇటు తెప్పిస్తే బాగుండనిపించేది. ఆంద్రల బాగా నీళ్లుంటయి, పంటలు బాగా పండుతయని ఇన్నం. మనం గన్ని నీళ్లు చూస్తమా అనుకున్నా. సీఎం కేసీఆర్‌ పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి ఊరూరికి కాల్వలు తొవ్వి నీళ్లు ఇడుస్తుండు. సంతోషంగున్నది. ఇన్ని నీళ్లు చూస్తనా అనుకున్న నాకు నీళ్ళు తెప్పించిన కేసీఆర్‌ సారుని చూసి గర్వంగా ఉన్నది.. సారుకు రుణపడి ఉంటం.

-లక్ష్మారెడ్డి, రైతు, కొండపాక మండలం (సిద్దిపేట జిల్లా)

మూడు పంటలకు ఢోకా లేదు..
కొండపోచమ్మ సాగర్‌ నుండి సీఎం సారు నీళ్ళు ఇడువడంతోటి మూడు పంటలకు ఇక ఢోకా లేదు. గతంలో ఎండకాలం వచ్చిందంటే పంట ఎండుతదా పండుతదా తెలిసేది కాదు. నేడు కాల్వల ద్వారా గజ్వేల్‌, వర్గల్‌ మండలాల్లోని చెరువులన్నీ నింపుతుడటంతోటి పంటలకు జీవం పోసినట్టయింది. భూగర్భ జలాలు పెరుగుతున్నయి. కొద్ది రోజుల్లో బోర్లు ఎల్లవోస్తయి. నీళ్ళు పుష్కలంగా ఉంటయనే ధీమాతో మూడు పంటలు వేసుకుంటం.

-పోతగల్లు బాలయ్య, చౌదర్‌పల్లి ,వర్గల్‌ మండలం (సిద్దిపేట జిల్లా)

నీళ్ల దేవుడు
నాకు నాలుగెకరాల భూమి ఉంది. నీళ్లు లేక యాసంగి పడాఉంది. పక్కనే హల్దీవాగున్నా నీటి కటకట తప్పలేదు. వానకాలంలో మక్క, పత్తి పెట్టిన. ఇప్పుడు వాగులకు నీళ్లు వస్తే వచ్చే రోహిణిలో నారు పోసుకొని ముందుగల్ల వరి సాగు చేసుకుంట. గింతెండ కాలంల వాగు పారుతే బోర్లల్ల కూడా నీరు పెరుగతది. ఏది లేకున్నా సాగు నీరు మాత్రం కావల్సినంత ఉంటే ఏ సమయంలోనైనా ఏదో ఓ పంట సాగు చేసి తిండి మందమైన పండించుకుంటనన్న ధీమా రైతుకుంటది. ఆ ధీమా ఇప్పుడు మాకు కల్గింది. గోదావరి నీళ్లు మా వాగులోకి మల్పి కేసీఆర్‌ సార్‌ మా బతుకులను మార్చుతున్నరు. మంచిగ పంటలు పండించి మా పిల్లల్ని మంచిగ చదివించుకుంటం.

అజ్మీరా బిక్షపతి, సీతారాంపల్లి తండా

నీళ్ల కోసం సారు తండ్లాడుతుండు
ఎప్పుడో చూసిన పంటలను మళ్లీ చూస్త్తమనుకోలే. కేసీఆర్‌ ఇక్కడికి రావడం మంచిగైంది. ఆయన రావడంతోనే మా ఊరు మీద పెద్ద ప్రాజెక్టు కొండపోచమ్మను కట్టించిండు. మొదట్లో ఈ ప్రాజెక్టును చూస్త్తమా అని ముసలోళ్లం మాట్లాడుకొనేది. కానీ కేసీఆర్‌ మా కోసం ఏదైనా చేస్తడు. మా కండ్ల మందు నుంచే కాల్వల్లో నీళ్లు ఊర్లకు పంపిస్తుండు. బోర్లలో నీళ్లు ఎక్కువయ్యాయి. ఇంత మంచి పనిచేసిన కేసీఆర్‌ను మేమెట్ల మరిచిపోతాం బిడ్డ! రేపటి నుంచి కాల్వలో మోటర్‌ ఏసి నీళ్లుతెచ్చి ఎక్కువ పంటను ఏసుకుంటాం. ఎప్పడు ఇట్ల్లనే నీళ్లుంటే రైతులేసిన పంటలెందుకు ఎండిపోతయ్‌? మంచి సౌలత్‌ను కల్పించి నీళ్ల కోసం బాగానే కేసీఆర్‌ సారు తండ్లాడుతుండు. ఆయన సల్లంగ ఉండాలె.

నీళ్ల లస్మయ్య,చాకలి అంజయ్య, రైతులు

ఇవి కూడా చదవండి..

ఆరోగ్యకర సమాజంతోనే అభివృద్ధి సాధ్యం

పది విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌

నేటినుంచి టీచర్లకు ఒంటిపూట బడులు

ఇక మైక్రో కంటైన్మెంట్‌జోన్లు

కొవిడ్‌ పరీక్షలు రెండింతలు

జానారెడ్డి గెలిచి ఏం చేస్తారు?

Advertisement
గంగ మెరిసే.. వాగు మురిసే!

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement