Iran vs US : అమెరికా (US) కు చెందిన ఎంక్యూ-9 రీపర్ డ్రోన్ (MQ-9 Drone) ను కూల్చివేసినట్లు ఇరాన్ (Iran) వెల్లడించింది. తమ గగనతలంలోకి ప్రవేశించిన అమెరికా ఆర్క్యూ-4 డ్రోన్, F-35 యుద్ధ విమానంపై కూడా కాల్పులు జరిపినట్లు తెలిపింది. టెహ్రాన్ (Tehran) లోని పలు ప్రాంతాలపై అమెరికా తీవ్రమైన దాడులు చేసిన నేపథ్యంలో ఈ తరహాలో తిప్పికొట్టినట్లు పేర్కొన్నది. అమెరికా చేసే ఏ కాల్పుల విరమణ ఉల్లంఘనకైనా ప్రతీకారం తీర్చుకునే చట్టబద్ధమైన హక్కు తమకు ఉందని ఐఆర్జీసీ (IRGC) వెల్లడించింది. ట్రంప్ సైనిక చర్యను తిరిగి ప్రారంభిస్తే.. పశ్చిమాసియా (West Asia) లోని అమెరికా స్థావరాలు, సైనిక బలగాలపై మరిన్ని ఆశ్చర్యకరమైన దాడులు చేస్తామని హెచ్చరించింది.
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ అమెరికాకు తీవ్ర హెచ్చరికలు చేశారు. శాంతి ఒప్పందంపై చర్చలు జరుగుతుండగా అమెరికా దాడులు చేయడాన్ని ఏ మాత్రం సహించబోమని అన్నారు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని, ఇకపై పశ్చిమాసియాలో అమెరికా బేస్‌లకు ఎక్కడా సురక్షిత ప్రదేశం ఉండదని హెచ్చరించారు. అమెరికా, ఇజ్రాయెల్లను నాశనం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. తన తండ్రి, ఇరాన్ సర్వోన్నత నాయకుడు అయతుల్లా ఖమేనీ మరణం తర్వాత కూడా తాము ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దేశం కోసం పోరాడుతున్నామని పేర్కొన్నారు.
ఇరాన్‌పై తాము ఉద్దేశపూర్వకంగా దాడి చేయలేదని, ఆత్మరక్షణ కోసమే దాడులు చేశామని అమెరికా అధికారులు పేర్కొన్నారు. సముద్రంలో మందుపాతరలు పరిచేందుకు యత్నిస్తున్న బోట్లను, ఇరాన్ క్షిపణి ప్రయోగ లాంచ్ప్యాడ్లను లక్ష్యంగా చేసుకొని దాడులు చేశామని తెలిపారు. తమ దాడిలో బందర్ అబ్బాస్ పోర్టులోని నేవీ బేస్ కూడా ధ్వంసమైనట్లు చెప్పారు.