Suvendu Adhikari : తెలంగాణతోపాటు ఏపీలోనూ ఐదు రూపాయలకే భోజన పథకం అమలవుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం నిర్వహించే క్యాంటీన్లలో ఈ భోజన పథకం అమలవుతోంది. అయితే, ఇక్కడ శాకాహార భోజనమే అందిస్తారు. కానీ, అదే ఐదు రూపాయలకు పశ్చిమ బెంగాల్లో నాన్ వెజ్ భోజనం లభించనుంది. అదీ చేపల కూరతో. ఐదు రూపాయలకే చేపల కూర లేదా ఫ్రై తో కలిపి అన్నం అందిస్తారు.
ఈ మేరకు బెంగాల్ సీఎం సువేందు అధికారి తాజాగా ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు. పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో గత ఫిబ్రవరిలో ‘మా’ క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. ఇందులో సబ్సిడీపై పేద ప్రజలకు రూ.5కే భోజనం అందిస్తున్నారు. అయితే, ఇకపై వీటిలో రూ.5లకే చేపల కూర లేదా ఫ్రై తో భోజనం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. అన్నం, చేప కలిపి రూ.5కే అందిస్తారు. ప్రతి రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఈ క్యాంటీన్లు నడుస్తాయి.
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 400 క్యాంటీన్లు ఉండగా, త్వరలో వీటి సంఖ్యను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. బీజేపీ ప్రభుత్వం చేపల కూర అందించడానికి రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. బీజేపీ అధికారంలోకి వస్తే బెంగాల్లో ప్రజలు నాన్ వెజ్ తినలేరని, గుడ్డు, చేపలు కూడా మర్చిపోవాల్సిందే అని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీఎంసీ ఆరోపించింది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ.. నాన్ వెజ్‌ను నిషేధిస్తుందని తెలిపింది. ఈ ఆరోపణల్ని అప్పట్లోనే బీజేపీ ఖండించింది. పైగా రాష్ట్ర బీజేపీ నేతలు పలు చోట్ల చేపల కూరతో ఫెస్టివల్స్ నిర్వహించారు. చేపలు పట్టుకుని మరీ ప్రచారం చేశారు. తాము నాన్ వెజ్‌కు వ్యతిరేకం కాదని చెప్పారు.
తాము సొంతంగా పాలిస్తున్న రాష్ట్రాలతోపాటు, కూటమి ప్రభుత్వాలు ఉన్న చోట కూడా మాంసాహారంపై ఎలాంటి నిషేధం లేదని బీజేపీ బదులిచ్చింది. బెంగాల్లో కూడా ఎలాంటి నిషేధం విధించబోమని తెలిపింది. అందుకే ఇప్పుడు ఏకంగా రూ.5కే ఏకంగా నాన్ వెజ్‌తో భోజనాన్ని అందించాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది.