సిటీబ్యూరో, జూలై 27 (నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇండ్ల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిరుపేదలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. అధికారంలోకి వచ్చిన మూడేండ్ల నుంచి దరఖాస్తులతోనే కాలయాపన చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా పాలన పేరిట ప్రజలంతా ఒకే దరఖాస్తు ఫారంలో రేషన్ కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత విద్యుత్ పథకం, గ్యాస్ సబ్సిడీ, రైతు భరోసా, రైతు బీమాకు అర్జీలు పెట్టుకుంటే వంద రోజుల్లో మంజూరు చేస్తామని ప్రకటించారు.
దీంతో ప్రజలంతా ఆయా ఫారాల్లో వివరాలు నమోదు చేసి ఇచ్చారు. కానీ ఆ దరఖాస్తు ఫారాలు ఎక్కడా అధికారికంగా పనిచేయలేదు. దీంతో చేసేదేమీ లేక మీసేవ కేంద్రాల్లో ఆయా పథకాలకు అర్హులైన వారు మరోసారి దరఖాస్తులు చేసుకున్నారు. అయినా ఒక్క పథకం పూర్తిస్థాయిలో అమలు చేయలేదు. ఇక ఇందిరమ్మ ఇండ్ల పథకానికి మాత్రం ప్రభుత్వం రోజుకో ప్రకటన.. పూటకో మాట మారుస్తుండటంతో ఇప్పటికి ఏకంగా నాలుగు సార్లు దరఖాస్తులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇందిరమ్మ ఇండ్ల కోసం నిరుపేదలు మొదటిసారిగా ప్రజాపాలన దరఖాస్తులు, ఆ తర్వాత మీసేవలో దరఖాస్తు చేసుకున్నారు. మీసేవ దరఖాస్తులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి కదలిక లేకపోవడంతో కలెకక్టర్ నిర్వహించే ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్నారు. అయినా ప్రభుత్వం నుంచి స్పష్టమైన భరోసా రాకపోవడంతో ముఖ్యమంత్రి ప్రజాపాలనలో కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా ఇందిరమ్మ ఇండ్లను రూ.6 లక్షలకు విక్రయిస్తామని ప్రకటించి మీసేవలో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించారు. ఈసారి రియల్ ఎస్టేట్ ప్రీలాంచ్ ప్రాజెక్టు మాదిరిగా రూ.10 వేలు టోకెన్ అమౌంట్ చెల్లించాలని పేర్కొన్నారు. దీంతో నగర ప్రజల్లో గందరగోళం నెలకొంది.
ఇప్పటికే నాలుగు సార్లు దరఖాస్తు చేసుకున్నామని.. మళ్లీ కొత్తగా ఇంకో దరఖాస్తు చేసుకోవాలని చెప్తుండటంతో ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయామని వాపోతున్నారు. ఇండ్లు వచ్చుడు దేవుడెరుగు కానీ.. దరఖాస్తులు చేసుకోవడానికే రోజుల తరబడి తిరుగుతున్నామని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ దరఖాస్తులు చేస్తూనే ఉన్నామని.. ఈసారి డబ్బులు చెల్లించాక ఇండ్లివ్వకుంటే తమ పరిస్థితేంటని అయోమయానికి గురవుతున్నారు. దరఖాస్తు చేసేందుకు పనులు వదులుకుని కార్యాలయాల చుట్టూ తిరిగినా పథకం అమలు మాత్రం అయ్యేలా లేదని ఆందోళన చెందుతున్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని నగరంలో అమలు చే సేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు పూటకో మాట, రోజుకో విధానంపై ప్రకటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఇంటి స్థలం ఉన్నవాళ్లకు అక్కడే నిర్మించి ఇస్తామని ప్రకటించారు. స్థలంలేని వాళ్లకు నగర వ్యాప్తంగా ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి.. ఉచితంగా ఇండ్లను నిర్మిస్తామని వెల్లడించారు. అందుకోసం కొద్దిరోజుల దాకా అందుకు ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తామన్నారు. ఆ తర్వాత అర్హులంతా మీసేవలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఇప్పుడేమో గ్రేటర్ వ్యా ప్తంగా 16 ప్రాంతాలను గుర్తించి అక్కడ అపార్ట్మెంట్లను నిర్మించి అందులో ఫ్లాట్లను అందజేస్తామని చెప్తున్నారు. ఇది పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని తలపిస్తున్నది. అర్హులు ముందుగా రూ.10వేలు చెల్లించి దరఖాస్తు చేసుకుంటే లాటరీ విధానంలో ఇంటిని కేటాయిస్తామంటున్నారు. లాటరీలో పేరు వచ్చినవారు దశలవారీగా రూ.6 లక్షలు చెల్లిస్తే ఫ్లాట్ హ్యాండోవర్ చేస్తామని ప్రకటించారు. ఇందులో ఏది నమ్మాలో తెలియక నగర ప్రజలు అయోయమంలో ఉన్నారు.