హుజూరాబాద్ | బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు ఆర్థిక మంత్రి హరీశ్ రావు అదిరిపోయే పంచ్ ఇచ్చారు. నాడు రైతు బంధు ప్రవేశపెడితే చప్పట్లు కొట్టిన చేతులే నేడు దళిత బంధు ప్రారంభిస్తుంటే గుండెలు బాదుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్‌లోని సిటీ సెంటర్లో మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు.. దళితబంధుపై ఎవ్వరూ చెప్పుడు మాటలు వినవద్దని సూచించారు. ‘దళితబంధు విషయంలో అపోహలు, అనుమానాలు అక్కర్లేదు. రైతుబంధు ప్రారంభించినప్పుడు ఇదే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఇలాగే మాట్లాడారు. రైతుబంధును కరోనా కాలంలో కూడా అమలు చేశాం. హుజూరాబాద్‌లో ప్రారంభించినప్పుడు చప్పట్లు కొట్టిన నాయకులే.. నేడు దళిత బంధు ప్రారంభిస్తామంటే అదే చేతులతో గుండెలు బాదుకుంటున్నారు. ఆ రోజు రైతుబంధు ప్రారంభించినప్పుడు ఇలాంటి అనుమానాలు, అపోహలు సృష్టించారు. వారికి ఓటమి భయం పట్టుకుంది. ప్రజలను రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారు. దళిత బంధు ఎన్నికలప్పుడు ప్రారంభించడం లేదు. గత సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడే సీఎం దళిత్ ఎంపవర్మెంట్ అనే కార్యక్రమాన్నిఈ ఏడాది ప్రారంభిస్తున్నామని చెప్పారు. మార్గదర్శకాలు విడుదలవుతాయని బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. అప్పుడు ఏ ఎన్నికలు లేవు’ అని మంత్రి అన్నారు.
‘ఇదే హుజూరాబాద్‌లో రైతుబంధు ప్రారంభిస్తే ఒప్పు.. దళితబంధు ప్రారంభిస్తే తప్పు ఎట్ల అయితది. ఆరోజు ఒప్పయింది.. ఇవాళ కూడా ఒప్పు అయితది కదా. మేలు జరుగుతుందంటే ఆహ్వానిస్తారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతారు. కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ నిరసనలు తెలుపుతున్నారు. అక్కసు వెళ్లగక్కుతున్నారు. కుట్రలు, కుతంత్రాలు, అపోహలు, అనుమానాలు సృష్టించి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. నిజంగా ప్రేమ ఉంటే కేంద్రం నుంచి మరో రూ. 10 లక్షలు తెప్పించండి. లేదంటే మాకంటే ఎక్కువ ఇవ్వాలనిపిస్తే రూ.20 లక్షలు ఇవ్వండి. బండి సంజయ్ 50 లక్షలు ఇవ్వాలంటున్నారు. రాష్ట్రం 10 లక్షలు ఇస్తుంది కదా. మిగతా 40 లక్షలు కేంద్రం నుంచి తెప్పిస్తే మీకు, మీ నరేంద్ర మోదీకి పాలాభిషేకం చేస్తాం’ అని హరీశ్‌రావు బీజేపీ నేతల దుమ్ముదులిపారు.