నర్సాపూర్: పిల్లలు పాఠశాలకు రాకపోతేనే.. వాళ్లు చదవకపోతేనే.. మాకు మాత్రం నెల తిరిగేలోపు జీతాలు వస్తున్నాయి కదా అని అనుకునే ఉపాధ్యాఉలు ఉన్న ఈ రోజుల్లో.. బడికి రాని పిల్లల భరతం పడితూ వారిని చదువులమ్మ ఒడిలోకి చేర్చుతూ మిగతా పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తున్నారు బ్రాహ్మణపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) ఉపాధ్యాయుడు. స్కూల్‌కి డుమ్మా కొట్టే విద్యార్థుల పట్ల సింహస్వప్నంగా మారుతూ వారిని మంచి దారిలో నడిపిస్తున్నారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం బ్రాహ్మణపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల ఎనలేని శ్రద్ధను చూపిస్తూ గ్రామస్తుల నుండి ప్రశంసలను అందుకుంటున్నారు. పాఠశాలకు రాకుండా గ్రామంలో తిరుగుతున్న విద్యార్థులను గుర్తించి ప్రత్యేకంగా వాళ్ల ఇంటికి వెళ్లి విద్యార్థులను బడికి తీసుకుస్తున్నారు. అలాగే విద్యార్థులను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. డుమ్మాలు కొడుతున్న విద్యార్థులను పాఠశాలలకు తీసుకొని పోయి చదువుకుంటే ఎలాంటి లాభాలు కలుగుతాయో వారికి అవగాహన కల్పిస్తూ చదువు పట్ల ఆసక్తిని పెంచుతున్నారు. ఇదే పాఠశాల మాదిరిగా మిగతా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల శ్రద్ధ వహిస్తే వారు ఉన్నత శిఖరాలను చేరుకుంటారని పలువురు భావిస్తున్నారు.