హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ నిర్లక్ష్యం, సొసైటీ ఉన్నతాధికారుల అసంబద్ధ నిర్ణయాలతో ఆఖరికి నీట్, జేఈఈ తదితర పోటీ పరీక్షలకు శిక్షణను అందించే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) కాలేజీల్లోనే ఈ ఏడాది సీట్లు పూర్తిగా నిండని దుస్థితి నెలకొన్నది. ఈ ఏడాది వివిధ కాలేజీల్లో సున్నా అడ్మిషన్లు నెలకొన్నాయి. ఎస్సీ గురుకుల పరిధిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, సాధారణ ఇంటర్, ఒకేషనల్ జూనియర్ కాలేజీలు కలిపి మొత్తంగా 238 గురుకులాలు ఉన్నాయి.
అన్ని గ్రూపులు కలిపి 19,490 సీట్లు ఉన్నాయి. అత్యధికంగా ఎంపీసీ 8,360, బైపీసీ 7,880 సీట్లు ఉండగా, మిగతా ఎంఈసీ, సీఈసీ గ్రూపులు ఉన్నాయి. గత ఏప్రిల్‌లో అడ్మిషన్ల కోసం దరఖాస్తులను స్వీకరించారు. గతంలో తొలిదశలోనే సీట్లన్నీ భర్తీ అయ్యే పరిస్థితి ఉండగా, ఈ ఏడాది ఇప్పటికి 5 విడతలుగా మెరిట్ లిస్ట్‌ను విడుదల చేసినా సీట్లు భర్తీ కాలేదు. నాలుగో విడతగా దాదాపు 2,800 సీట్ల భర్తీకి మెరిట్ జాబితాను విడుదల చేయగా, ఇటీవల 5వ విడత మరోసారి దాదాపు 1,200 సీట్ల భర్తీకి మెరిట్ జాబితాను విడుదల చేశారు.
అయినా విద్యార్థులెవరూ గురుకుల కాలేజీల్లో అడ్మిషన్లకు ముందుకు రాలేదు. సీవోఈల్లోనే భర్తీకానీ పరిస్థితి దాపురించింది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన, రాష్ట్రవ్యాప్తంగా పేరుగాంచిన గౌలిదొడ్డి గురుకుల కాలేజీల్లోనే సీట్లు మిగిలి ఉండటం గమనార్హం. ఇబ్రహీంపట్నం, చిలుకూరు, హయత్‌నగర్, ఉప్పల్, కరీంనగర్, మహేంద్రహిల్స్, ఫలక్‌నుమా, సరూర్‌నగర్ గురుకుల కాలేజీల్లో పదుల సంఖ్యలో ఇంకా సీట్లు మిగిలే ఉన్నాయి. షేక్‌పేట్, నార్సింగిలోని స్పోర్ట్స్ కమ్ సీవోఈల్లో మొత్తంగా 160 సీట్లు ఉండగా, ఇప్పటికీ 109 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.
సైనిక్ స్కూళ్లలోనూ సీట్లు భర్తీకావడం లేదంటే గురుకుల సొసైటీ పనితీరుకు అద్దం పడుతుంది. రుక్మాపూర్ సైనిక్స్కూల్లో 120 సీట్లకు గాను 104 సీట్లే భర్తీ అయ్యాయి. జగద్గిరిగుట్టలోని సైనిక్ స్కూల్లో, అక్కడే ఈ ఏడాది కొత్తగా ఏర్పాటుచేసిన టూరిజం అండ్ హాస్పిటాలిటీ, ఆఫీస్ అసిస్టెంట్ కోర్సుల్లో కలిపి 80 సీట్లు ఉండగా, ఒక్క సీటు కూడా భర్తీ కాకపోవడం గమనార్హం. మల్కాజిగిరిలోని ఫైన్ ఆర్ట్స్ కో ఎడ్యుకేషన్ గురుకులంలో 80 సీట్లు ఉండగా, కేవలం 28 సీట్లే భర్తీ అయ్యాయి. నాన్ సీవోఈ గురుకుల కాలేజీల్లో పరిస్థితి మారింత దారుణంగా మారిందని సొసైటీ టీచర్లే వెల్లడిస్తున్నారు. ఇప్పటికీ 25 శాతం మంది విద్యార్థులు కూడా అడ్మిషన్ పొందలేదని తెలుస్తున్నది. వారంతా కూడా పూర్తిస్థాయిలో అడ్మిషన్ పొందలేదని గురుకుల కళాశాలల ప్రిన్సిపాళ్లు వివరిస్తున్నారు.
గురుకుల ఇంటర్ ప్రవేశాలు పూర్తిగా పడిపోవడానికి, విద్యార్థులు విముఖత చూపేందుకు ప్రధాన కారణం ఎస్సీ గురుకుల సొసైటీ ఇష్టారీతిన తీసుకున్న నిర్ణయాలేనని గురుకుల సిబ్బంది వెల్లడిస్తున్నారు. ఈ ఏడాది రాతపరీక్షను రద్దుచేసి సొసైటీ విద్యార్థులకే సీవోఈ కాలేజీల్లో ప్రవేశాలను కల్పించారు. గతంలో అడ్మిషన్ పొందిన విద్యార్థులను ఇంటర్ మొదటి సంవత్సరంలో మార్కులు సరిగా సాధించలేదని చెప్పి ఇతర సాధారణ గురుకులాలకు మార్చారు. నాన్ సీవోఈ, ఒకేషనల్ గురుకుల కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియను కూడా అడ్డదిడ్డంగా చేపట్టారు. దాదాపు 80 గురుకుల కాలేజీల్లో గ్రూపులన్నీ మార్చారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీతోపాటు, ఒకేషనల్ కోర్సుల్లోనూ మార్పులు చేర్పులు చేసింది. కొన్ని కాలేజీలను కేవలం సైన్స్ గ్రూపులకే, మరికొన్ని కాలేజీలను కేవలం ఆర్ట్స్ గ్రూపులకే సొసైటీ పరిమితం పరిమితం చేసింది. మరికొన్నింటినీ మిశ్రమ కోర్సులను నడపాలని నిర్ణయించింది. సొసైటీ ఉన్నతాధికారుల తీరు చూస్తే కావాలనే ఇంటర్ కాలేజీలను పరోక్షంగా మూతవేయడానికే ఈ రకమైన నిర్ణయం తీసుకున్నట్లుగా ఉన్నదని వివరిస్తున్నారు.