హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీకి అధికార యావ అయితే, బీజేపీది విద్వేష తోవ అని.. ఆ రెండు పార్టీలకు ప్రజల బాగు పట్టదని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. బీఆర్ఎస్ది మాత్రం వికాస నావ అని తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్ర, మణిపూర్ సహా దేశవ్యాప్తంగా హిందూ, ముస్లింల నడుమ చిచ్చురేపుతూ బీజేపీ శాంతి భద్రతల సమస్యను సృష్టిస్తున్నదని ధ్వజమెత్తారు. తెలంగాణలో గత తొమ్మిదేండ్లలో ఒక్క చిన్న గొడవ కూడా జరగలేదని, ఇది బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న సామరస్య విధానానికి నిదర్శనమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ముస్లిం మైనార్టీ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ అవకాశమున్న ప్రతీచోటా వారికి ప్రాధా న్యం ఇస్తున్నారని తెలిపారు. మెదక్ జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముస్లిం మైనార్టీ నేతలు, కార్యకర్తలు శుక్రవారం హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
టీఎస్ఐడీసీ చైర్మన్, బీఆర్ఎస్ నేత మహమ్మద్ తన్వీర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పట్టణ కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడు మహమ్మద్ మో యిస్, సీనియర్ కాంగ్రెస్ నేత అక్బర్, మాజీ కౌన్సిలర్ ఫక్రుద్దీన్తోపాటు దాదాపు 200 మంది నేతలకు మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల సంక్షేమం పట్టదని, కేవలం అధికారం కోసమే పరితపిస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నేతలు కలలు కంటున్నారని, అవి పగటి కలలే అవుతాయని తేల్చిచెప్పారు. అధికార యావతో ఉన్న కాంగ్రెస్, విద్వేషాన్ని రగిలించే బీజేపీ పార్టీలు కావాలా? అణువణువునా ప్రగతిదారుల్లో నడిపిస్తున్న బీఆర్ఎస్ కావాలా? అంటే ప్రజలు బీఆర్ఎస్ వెంట, సీఎం కేసీఆర్ వెంటే ఉంటామని అంటున్నారని తెలిపారు.
మైనార్టీల సంక్షేమం కోసం దేశంలోని ఏ రాష్ట్రమూ తెలంగాణ స్థాయిలో బడ్జెట్ కేటాయించలేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కోటిన్నర మంది మైనార్టీలున్న మహారాష్ట్రలో రూ.674 కోట్లు కేటాయిస్తే, 50 లక్షల జనాభా ఉన్న తెలంగాణలో రూ.2,200 కోట్లు ఇచ్చామని వివరించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత మైనార్టీల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ రూ.10 వేల కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడించారు. ముస్లిం మైనార్టీ విద్యార్థుల కోసం 204 పాఠశాలలను ఏర్పాటుచేసి నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు. ఉర్దూతో పాటు ఇంగ్లిష్ మీడియం బోధన అమలుచేస్తూ భవిష్యత్తులో ఉద్యోగ ఉపాధి రంగాల్లో మంచి అవకాశాలు దకేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. తెలంగాణ మాడల్ దేశవ్యాప్తంగా కావాలని డిమాండ్ పెరిగిందని, ‘అబ్ కీ బార్ కిసాన్ సరార్’ నినాదంతో ముందుకుసాగుతున్న సీఎం కేసీఆర్‌కు మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాల్లో అద్భుతమైన ఆదరణ లభిస్తున్నదని చెప్పారు. జహీరాబాద్ పట్టణం బీఆర్ఎస్ పాలనలో మునుపెన్నడూలేనంత అభివృద్ధి సాధించిందని వివిరంచారు. పట్టణంలో హజ్ హౌజ్, షాదీఖా నా నిర్మిస్తున్నామని, స్మశానం కోసం కూడా స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు నరోత్తం, నామ రవికిరణ్, బాసిత్, షాకి వస్తాద్, తాజుద్దీన్, అక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
మైనార్టీ సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా ఉన్నదని మంత్రి హరీశ్ రావు తెలిపారు. సీఎం కేసీఆర్ దార్శనిక పాలన రాష్ట్రంలో హిందూ ముస్లింల ఐక్యతను పటిష్టం చేస్తూ గంగా జమునా తెహజీబ్‌ను కాపాడుతూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న లౌకిక వైఖరి తెలంగాణలో మత సామరస్యాన్ని చాటిచెప్తున్నదని అన్నారు. మైనార్టీల్లోని పేదలు, నిరుద్యోగులు సొంత వ్యాపారాలు పెట్టుకొనేందుకు రూ.లక్ష ఉచిత గ్రాంటును అందజేయబోతున్నామని చెప్పారు. లక్షమంది అర్హులైన వారికి ఈ పథకాన్ని త్వరలోనే దశలవారీగా అమలు చేస్తామని తెలిపారు. షాదీ ముబారక్ ద్వారా 9 ఏండ్లలో రెండున్నర లక్షల మంది పెండ్లిళ్లకు మొత్తం రూ.2,130 కోట్లు ప్రభుత్వం అందించిందని వెల్లడించారు.