Zaheerabad | సంగారెడ్డి : జహీరాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీకి చెందిన కీలక నేతలు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాణిక్ రావు పాల్గొన్నారు.
బీజేపీ నుండి బీఆర్ఎస్లో చేరిన వారిలో మాజీ సీడీసీ ఛైర్మన్ ఉమాకాంత్ పటేల్, మాజీ సహకార సంఘం అధ్యక్షుడు బస్వరాజు, మాజీ ఎంపీటీసీలు విజయేందర్ రెడ్డి, సంతోష్ పాటిల్, సీనియర్ నాయకులు సుభాష్ రావు, భూమయ్య, లక్ష్మయ్యతో పాటు దాదాపు 20 మంది ముఖ్య నాయకులు బీఆర్ఎస్లో చేరారు. వారందరికీ హరీష్ రావు బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ ఛైర్మన్ శివకుమార్, బీఆర్ఎస్ నాయకులు నామా రవికుమార్, ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు గారు మాట్లాడుతూ.. తెలంగాణను బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. 8 మంది ఎంపీలను గెలిపించినా బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేసింది. ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీను తుక్కు కింద అమ్ముతున్నారు. దక్షిణాది రాష్ట్రాల పట్ల బీజేపీ చిన్న చూపు చూస్తోంది. ముఖ్యంగా తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ ప్రారంభించిన బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టింది. అలాగే సంగారెడ్డి జిల్లా అభివృద్ధిని కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తోంది. ఎస్డీఎఫ్ నిధులను విడుదల చేయకుండా జిల్లా అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోంది. సంగమేశ్వర ప్రాజెక్టు పూర్తయితే జిల్లా మొత్తం సాగు నీటితో సస్యశ్యామలం అవుతుంది. బసవేశ్వర ప్రాజెక్టుపై త్వరలో బీఆర్ఎస్ తరపున కార్యాచరణ ప్రకటిస్తాం. ప్రజల కోసం పోరాడే శక్తి బీఆర్ఎస్ మాత్రమే అని ప్రజలకు తెలుసు అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.