హైదరాబాద్, నవంబరు 6 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితికి సబ్బండ వర్ణాలు అండగా నిలిచాయి. మహిళలు, యువత, ఉద్యోగులు, రైతులు ఇలా ప్రతి ఒక్కరూ గులాబీ జెండాను గుండెకు హత్తుకున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని మరోసారి బలపర్చారు. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనాన్ని పొందుతున్నవారు, వారి కుటుంబాలకు ఉపయోగపడిన పథకాలతో తమ మద్దతును ఓట్ల ద్వారా ప్రకటిస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులకు ఎన్నికల్లో సంఘీభావం ప్రకటిస్తూ గులాబీ జెండా ఎగిరేందుకు కృషి చేశారు. ఉద్యోగులకు రెండుసార్లు అత్యధిక పీఆర్సీని అమలు చేసి, వారి సమస్యలను పరిష్కరించిన ప్రభుత్వం ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వమని ఉద్యోగులు బహాటంగానే చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తమ ప్రభుత్వంగా భావిస్తున్నారు. ప్రతిరోజూ ఎదుర్కొనే తాగునీటి సమస్యను పరిష్కరించి.. బిందెలను మోసే బాధ తప్పించిన ఘనత కేసీఆర్‌ది అని.. తమ కష్టాలు తీర్చిన కేసీఆర్ రుణం తీర్చుకోవడానికి సారుకు ఓటు వేస్తున్నామని మహిళలు బహిరంగంగానే ప్రకటించారు. ఓట్ల రూపంలో వారు తమ అభిమానాన్ని చూపారు. నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగాలు భర్తీ చేయడానికి రాష్ట్రానికి పెద్ద ఎత్తున ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. దీంతో ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తున లభిస్తున్నాయి. మునుగోడు నియోజకవర్గంలో 1.30 లక్షల మంది 40 సంవత్సరాల లోపు మహిళలు, పురుషులు ఉండగా.. వీరిలో అత్యధికులు టీఆర్ఎస్కు ఓటు వేసినట్టుగా టీఆర్ఎస్కు పోలైన ఓట్లను పరిశీలిస్తే అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలపై ఆగ్రహంగా ఉన్న మహిళలు ఏకపక్షంగా టీఆర్ఎస్కు అండగా నిలిచి మోదీకి బుద్ధి చెప్పాలని నిర్ణయానికి వచ్చినట్టు పోలింగ్‌బూత్‌లలో బహిరంగంగానే వ్యాఖ్యానించారు. మోటర్లకు మీటర్లు పెట్టాలనే నిర్ణయాన్ని వ్యతిరేకించిన టీఆర్ఎస్కు, కేసీఆర్‌కు అండగా ఉండాలని నిలిచి రైతులు టీఆర్ఎస్కు ఓటు వేశారు.