Harish Rao |హైదరాబాద్ సిటీబ్యూరో, మే10,(నమస్తే తెలంగాణ): దేశంలోని యువత త్యాగాలకు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పిలుపునిచ్చారు. యుద్ధ సమయాల్లో అవసరమైతే అన్నిరకాల వైద్యసేవలు అందించేందుకు, రక్తదానం చేసేందుకు మల్లారెడ్డి హెల్త్ యూనివర్సిటీ ముందుకురావడం ప్రశంసనీయమని కొనియాడారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సూరారంలోని మల్లారెడ్డి విశ్వ విద్యాపీఠ్ (మల్లారెడ్డి హెల్త్ సిటీ)లో ‘ఆపరేషన్ సిందూర్’లో పాల్గొంటున్న దేశ సైనికుల కోసం శనివారం నిర్వహించిన సంఘీభావ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి హాజరయ్యారు. యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ ఎం మురళీనాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత సైనికులను చూసి గర్వపడుతున్నామని, ఈ దేశ ప్రజల భద్రత, భవిష్యత్తును నిలబెట్టడానికి సైనికులు పోరాడుతున్నారని కొనియాడారు.