కమలాపూర్, జనవరి 1: ఫైనాన్స్ వేధింపులతో(Financial harassment) యువకుడు మృతి చెందిన ఘటన హనుమకొండ(Hanumakonda) జిల్లా కమలాపూర్ మండలంలోని వంగపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆకునూరి రాకేశ్(24) ఆర్మాన్ ఫైనాన్స్ కంపెనీలో రూ.75 వేల అప్పు తీసుకున్నాడు. ఇందుకు నెలకు రూ. 4,350 చొప్పున 24నెలలు చెల్లించాల్సి ఉంటుంది. నాలుగు నెలలుగా కిస్తీ చెల్లించలేదు.
ఫైనాన్స్ సిబ్బంది డబ్బుల కోసం ఇంటికి వచ్చి ఇబ్బందులకు గురిచేశారు. దీంతో మానసిక ఒత్తిడికి గురైన రాకేష్‌కు మంగళవారం గుండెపోటు రావడంతో చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఫైనాన్స్ వేధింపులు తట్టుకోలేకనే తన భర్త మృతి చెందినట్లు మృతుడి భార్య వైష్ణవి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. రాకేష్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.