హైదరాబాద్, జూన్ 23(నమస్తే తెలంగాణ): నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర కార్యాలయ ముట్టడికి యత్నించిన యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్ గాంధీభవన్ నుంచి ఆదివారం మధ్యాహ్నం పెద్ద సంఖ్యలో కార్యకర్తలు బీజేపీ ఆఫీసును ముట్టడించేందుకు బయల్దేరారు. ఈ సందర్భంగా కార్యకర్తలు బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనరెడ్డి మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీలో 14 మంది బీజేపీ మంత్రుల ప్రమేయం ఉన్నదని ఆరోపించారు. ఆసలు నిజాలు బయటపడితే కేంద్ర ప్రభుత్వం కుప్పకూలుతుందని చెప్పారు. దీనికి నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.