Mancherial | పెళ్లయిన అమ్మాయిని ప్రేమిస్తున్నానని వేధిస్తున్న యువకుడిని ఓ కుటుంబం నడిరోడ్డుపై దారుణంగా హత్య చేసింది. బైక్‌పై వెళ్తున్న అతన్ని అడ్డగించిన వివాహిత కుటుంబీకులు కత్తితో గొంతుకోశారు. తమ కోపం చల్లారేదాక పక్కనే ఉన్న పెద్ద బండరాయితో తలపై కొట్టి చంపారు. వివాహిత తల్లిదండ్రులు, సోదరి, సోదరుడు కలిసి ఈ దారుణానికి తెగబడ్డారు. ఈ భయానక ఘటన మంచిర్యాల జిల్లాలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో ఇందారం గ్రామానికి చెందిన పెద్దపల్లి కనకయ్య – పద్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. వీళ్ల పెద్ద కుమార్తె శృతిని మహేశ్ (24) అనే యువకుడు కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ విషయం తెలిసి శృతికి నస్పూర్ గ్రామానికి చెందిన యువకుడితో గతేడాది వివాహం జరిపించారు. పెళ్లయినపన్పటికీ మహేశ్ వేధింపులు మానలేదు. వేధించడమే కాకుండా పెళ్లికి ముందు శృతితో సన్నిహితంగా ఉన్న వీడియోలను సోషల్‌మీడియాలో బహిర్గతం చేశాడు. ఆ వీడియోలు వైరల్ కావడంతో మనస్తాపం చెందిన శృతి భర్త.. ఆమెకు ఆరు నెలల క్రితం విడాకులు ఇచ్చారు. అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పట్నుంచి మహేశ్‌తో శృతి కుటుంబానికి గొడవలు జరుగుతూనే ఉన్నాయి.
మహేశ్ వేధిస్తున్నాడని జైపూర్ పోలీస్ స్టేషన్లో సైతం శృతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ మహేశ్ తన తీరు మార్చుకోలేదు. భర్త చనిపోయిన తర్వాత పుట్టింట్లోనే ఉంటున్న శృతికి తరచూ కాల్స్, మెసేజ్ చేస్తూ వేధించాడు. అతని టార్చర్ భరించలేని శృతి.. కుటుంబసభ్యుల ముందు బాధపడింది. తమ బిడ్డ జీవితంతో ఆడుకుంటున్నాడని మహేశ్‌పై కోపంతో రగిలిపోయారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం బైక్‌లో పెట్రోల్ కొట్టించుకుని తమ ఇంటి ముందు నుంచి వెళ్తున్న సమయంలో మహేశ్‌ను అడ్డగించారు. శృతి తల్లిదండ్రులు, ఆమె సోదరుడు, సోదరి మహేశ్‌పై మూకుమ్మడిగా దాడి చేశారు. ముందుగా కత్తితో అతని గొంతు కోశారు. అనంతరం పక్కనే ఉన్న బండరాయితో తలపై కొట్టి కొట్టి దారుణంగా చంపేశారు. నడిరోడ్డుపై ఇంత జరుగుతున్నా చుట్టుపక్కల వాళ్లు వీడియోలు తీసుకుంటూ ఉండిపోయారే తప్ప.. ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. పైగా ఈ తతంగం మొత్తాన్ని వీడియోలు తీశారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హత్య అనంతరం నిందితులు వెళ్లి పోలీసుల ముందు లొంగిపోయారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఏసీపీ నరేందర్, సీఐ రాజు ఘటనాస్థలిని సందర్శించారు.