సారంగాపూర్, మే 15: ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో నుంచి అధికారులు తన పేరును తొలగించారని నిరసన వ్యక్తంచేస్తూ ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కిన ఘటన నిజామాబాద్ మండలం మల్లారంలో గురువారం చోటుచేసుకున్నది. బాధితుడి వివరాల ప్రకారం.. జల్లాపురం సాయిలు తన భార్య, ఇద్దరు పిల్లలతో మల్లారంలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు.
ఇందిరమ్మ ఇల్లు మంజూరవుతుందనే నమ్మకంతో ఉన్న సొంత స్థలంలో బేస్మెంట్ వరకు ఇల్లు నిర్మించుకున్నాడు. అతడి పేరును ఇందిరమ్మ కమిటీ బాధ్యులు అర్హుల జాబితాలో చేర్చారు. సర్వే నిర్వహించిన అధికారు లు.. సాయిలు బేస్మెంట్ వరకు ఇల్లు నిర్మించడంతో అర్హుల జాబితా నుంచి పేరును తొలగించారు.
దీంతో యువకు డు గ్రామ సమీపంలోని సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. స్థానికులు రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. కాంగ్రెస్ నాయకులు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి విషయాన్ని ఫోన్లో వివరించగా ఎమ్మెల్యే స్పందించి.. బాధితుడితో మాట్లాడారు. ఇల్లు మంజూరు చేయిస్తానని భరోసా ఇవ్వడంతో సాయిలు టవర్ దిగాడు. రూరల్ పోలీసులు బాధితుడికి కౌన్సెలింగ్ ఇచ్చారు.