ఇల్లెందు, సెప్టెంబర్ 13 : యూరియా కోసం క్యూలో జరిగిన తోపులాటలో ఓ రైతు డబ్బులు పోగొట్టుకున్నాడు. ఈ విషయాన్ని ఇంటికి వెళ్లి భార్యకు చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన యువరైతు పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాలు .. సేవాతండాకు చెందిన కున్సోత్ సుమన్ (30) రేపల్లెవాడ పంచాయతీలో యూరియా కోసం వెళ్లాడు. ఈ క్రమంలో రైతుల మధ్య జరిగిన తోపులాటలో తన వెంట తెచ్చుకున్న డబ్బులు పోగొట్టుకున్నాడు. దిక్కుతోచని స్థితిలో ఇంటికి చేరుకున్న సుమన్.. అక్కడ జరిగిన విషయాన్ని భార్యకు వివరించాడు. దీంతో వారి మధ్య గొడవ జరగడంతో మనస్తాపం చెందిన సుమన్ పురుగులమందు తాగాడు. స్థానికులు, కుటుంబసభ్యులు దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. సుమన్‌కు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తండావాసులు కోరారు.
యువరైతు సుమన్‌ది ప్రభుత్వ హత్యే : బానోత్ హరిప్రియ నాయక్
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యూరియా సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైందని, యువరైతు సుమన్ ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియనాయక్ ఆరోపించారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం ధనియలపాడు గ్రామ పంచాయతీ పరిధి సేవ్యాతండాకు చెందిన యువరైతు కన్సోత్ సుమన్(30) మృతదేహాన్ని ఇల్లెందు ప్రభుత్వ దవాఖానలో సందర్శించి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుమన్ వారంరోజులుగా యూరియా కోసం సొసైటీ చుట్టూ తిరుగుతున్న క్రమంలో ఓ గోడౌన్ వద్ద కొంత నగదును పోగొట్టుకున్నాడని తెలిపారు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ సుమన్ ఆత్మహత్యకు దారితీసిందని చెప్పారు. సుమన్ కుటుంబానికి సకాలంలో యూరియా అందిఉంటే అతడు ఆత్మహత్య చేసుకునేవాడుకాదని తెలిపారు. ఇప్పటికైనా రైతులకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.