వనపర్తి : ప్రజాపాలనలో యూరియా (Urea)కోసం రైతులు ప్రాణాలు ఫణంగా పెట్టాల్సిన దుస్థితి నెలకొంది. ఒక్క యూరియా బస్తాకోసం యుద్ధమే చేయాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. తాజాగా వనపర్తి జిల్లా గణపురం(Ghanapuram) మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు యూరియా కోసం ఆత్మ హత్యా యత్నానికి సిద్ధపడ్డాడు. వారం రోజులుగా యూరియా కోసం ప్రయత్నించినా ఇప్పుడు.. అప్పుడు అంటూ కాలయాపనతోనే సరికావడంతో విసిగి వేసారిన యువకుడు యూరియా కోసమే ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు.
గణపురం మండల కేంద్రానికి చెందిన బిక్కి చెన్నకేశవులు అనే యువకుడు తన పొలానికి యూరియా వేసుకోవడం కోసం వారం రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాడు. స్థానికంగా ఉన్న సింగిల్ విండో కార్యాలయం అధికారులు రెండు మూడు రోజుల తర్వాత ఏరియా వస్తుందని చెప్పుకుంటూ వచ్చారు.
చివరకు సోమవారం కూడా కార్యాలయం ముందు భారీ జన సందోహంతో రైతులు యూరియా కోసం నిలబడటంతో నిరాశ చెందిన యువకుడు సింగిల్ విండో కార్యాలయం మొదటి అంతస్తు పైకి వెళ్లి ఏరియా ఇవ్వకపోతే దూకి ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేశాడు. అక్కడున్న రైతులు ఇతరులు యువకుడికి నచ్చజెప్పి కిందికి దింపే ప్రయత్నం చేశారు. ఎలాగైనా యూరియా బస్తా ఇప్పిస్తామంటూ అక్కడున్నవారు సర్ది చెప్పడంతో బలవంతంగా యువరైతు కిందికి దిగినట్లు సమాచారం.