ఖానాపూర్ టౌన్, బీబీపేట్/మాచారెడ్డి, జడ్చర్ల మే 10 : రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని పలు జిల్లాల రైతులు డిమాండ్ చేశారు. శుక్రవారం కామారెడ్డి, నిర్మల్ జిల్లాల రైతులు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలులో సర్కార్ జాప్యాన్ని నిరసిస్తూ రాస్తారోకో చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఏనాడూ రైతులను ఇబ్బంది పెట్టలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినదించారు. చేతికొచ్చిన పంట వర్షం పాలైందని, వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనాలని నిర్మల్ జిల్లాలో రైతులు ఖానాపూర్తర్లపాడ్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. తూకం వేసిన ధాన్యాన్ని కూడా సకాలంలో తరలించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మల్ అదనపు కలెక్టర్ ఫోన్లో మాట్లాడి ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేస్తామని హామీనివ్వడంతో రైతులు శాంతించారు.
వడ్లు కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తా, పాల్వంచ మండల కేంద్రంలోని కామారెడ్డి-సిరిసిల్ల రహదారిపై రైతులు ధర్నా చేశారు. బీబీపేట్ సొసైటీ పరిధిలో ఇప్పటివరకు 24 వేల తడిసిన ధాన్యం బస్తాలు ఉన్నాయని, వీటిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో శుక్రవారం మధ్యాహ్నం వర్షం కురియగా, మార్కెట్లో ధాన్యం తడిసిపోయింది. ఉదయం మార్కెట్‌కు 3,280 క్వింటాళ్ల ఆర్ఎర్ఆర్ రకం ధాన్యం, వేరుశనగ, మొక్కజొన్న, ఆముదాలు అమ్మకానికి వచ్చాయి. ఒక్కసారిగా వాన రావడంతో ధాన్యం తడిసి ముద్దవగా.. కొంత కొట్టుకుపోయింది. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఎన్నో పాట్లు పడ్డారు. కొందరు వరి కుప్పలపై కవర్లు కప్పగా.. మరికొందరు కవర్లు తీసుకొచ్చేలోపు ధాన్యమంతా తడిసిపోయింది. వర్షం తగ్గాక ధాన్యాన్ని రైతులు ఆరబెట్టారు.

సారంగాపూర్, మే 10 : అకాల వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల్లో తడిచిన ధాన్యాన్ని సర్కారు వెంటనే కొనుగోలు చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని కొనుగోలు కేంద్రంలో తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించి, రైతులను వివరాలు అడిగి తెలుసుకొన్నారు. ప్రభుత్వం ప్రణాళికతో ధాన్యం కొనుగోలు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు విషయమై జాయింట్ కలెక్టర్‌ను కూడా ఇటీవల కలిసి సమస్యలు వివరించానని చెప్పారు. రైతులు సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే వారి పక్షాన నిలబడి కొట్లాడుతానని తెలిపారు. జీవన్‌రెడ్డికి ఇంకా ఎమ్మెల్సీగా ఏడాది పదవీ కాలం ఉన్నదని, ఓట్ల కోసం రైతుల కష్టాలు మరిచారని, హామీలను నెరవేర్చని కాంగ్రెస్‌కు ఓట్లతో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.