సిద్దిపేట : యోగాను దినచర్యలో భాగంగా చేసుకొని దీర్ఘాయుష్షును పొందాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా.. సిద్దిపేట పట్టణం కొండా భూదేవి గార్డెన్లో ఏర్పాటు చేసిన యోగా దినోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.
ప్రపంచంలో చాలామందికి వారు తీసుకునే ఆహారపు అలవాట్లతోనే రోగాలు వస్తాయి. యోగా ద్వారా రోగాల బారిన పడకుండా కాపాడుకోవచ్చని మంత్రి సూచించారు. పిల్లల నుంచి పెద్దల వరకు యోగా చేయొచ్చని ఆయన పేర్కొన్నారు. యోగా చేస్తే శారీరక, మానసిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందన్నారు.
యోగా, వాకింగ్, సూర్య నమస్కారాలతో రోజు వారి పనులు మరింత సులువుగా చేసుకోవచ్చన్నారు. భారత దేశాన్ని చూసి వివిధ దేశాలు యోగా నేర్చుకున్నాయి. ప్రభుత్వ దవాఖానల్లో గర్భిణులకు యోగా శిక్షణ ఇస్తున్నాం. గర్భిణులు ఇలాంటివి చేస్తే నార్మల్ డెలివరీలకు అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.