Harish Rao | డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. రాజకీయాల్లో నోరు పారేసుకుంటే మొదటికే మోసం వస్తుందని హెచ్చరించారు. తనను అన్ ఫిట్ ఫర్ పాలిటిక్స్ అనడంపై విమర్శలు గుప్పించారు. నేను అన్ ఫిట్ ఫర్ పాలిటిక్స్ కాదు నువ్వే అన్‌ఫిట్ ఫర్ పాలిటిక్స్ అని విమర్శించారు. సచివాలయంలో ఆర్థిక మంత్రి చాంబర్ ముందు కాంట్రాక్టర్లు ధర్నాలు చేయడం చరిత్రలో ఎన్నడైనా ఉందా అని ప్రశ్నించారు. మరి అన్‌ఫిట్ నువ్వా నేనా అని నిలదీశారు. నీలాగా బిల్లులు చెల్లించడానికి 30 కమిషన్ తీసుకోలేదని.. అందులో నేను అన్‌ఫిట్ కావచ్చని వ్యాఖ్యానించారు. భట్టి విక్రమార్క గౌరవం ఇచ్చి తీసుకోవాలని హితవు పలికారు.
భవిష్యత్తులో కరెంటు డిమాండ్ పెరుగుతుందని పీపీటీ పెట్టి మరీ చెప్పారని హరీవ్‌రావు అన్నారు. జనాభా, అవసరాలు పెరుగుతుంటే కరెంటు డిమాండ్ పెరుగుతుందని.. ఈ విషయాన్ని మూడో తరగతి పిల్లాడిని అడిగినా చెబుతాడని వ్యాఖ్యానించారు. ఫ్రస్ట్రేషన్లో నోరు జారితే మొదటికే మోసం వస్తుందని హెచ్చరించారు. తెలంగాణ వచ్చినప్పుడు రాష్ట్ర అంధకారంలో ఉందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రమంతా కేసీఆర్ 24 గంటల కరెంటు ఇచ్చారని అన్నారు. మరి ఎవరు అన్‌ఫిట్.. మీరా? మేమా? అని ప్రశ్నించారు.
రాజకీయాల్లో నోరు పారేసుకుంటే మొదటికే మోసం వస్తుంది
భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై స్పందించిన హరీష్ రావు
నేను అన్ ఫిట్ ఫర్ పాలిటిక్స్ కాదు నువ్వే అన్‌ఫిట్ ఫర్ పాలిటిక్స్
సచివాలయంలో ఆర్థిక మంత్రి ఛాంబర్ ముందు కాంట్రాక్టర్లు ధర్నాలు చేయడం చరిత్రలో ఎన్నడైనా ఉందా? మరి అన్‌ఫిట్ నువ్వా… pic.twitter.com/VeqrfuOYcH
— Telugu Scribe (@TeluguScribe) December 1, 2025
రామగుండం, మక్తల్, పాల్వంచలో థర్మల్ విద్యుత్ కేంద్రాలు నెలకొల్పుతామని కేబినెట్ మీటింగ్ తర్వాత మంత్రులే చెప్పారని హరీశ్‌రావు తెలిపారు. అదే మేం ప్రశ్నిస్తే భట్టి విక్రమార్క తత్తరపడ్డారని అన్నారు. మక్తల్‌లో పెట్టేది థర్మల్ ప్లాంట్ కాదని మాట మార్చారని విమర్శించారు. ప్రాజెక్టులు నిర్మించకముందే అవినీతి అని ఎలా అంటారని భట్టి ప్రశ్నించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉండగానే.. లక్ష కోట్ల అవినీతి అన్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు ఊరూరా తిరిగి అబద్ధాలు చెప్పారని గుర్తుచేశారు. రూ.84 వేల కోట్లు ఖర్చయిన ప్రాజెక్టుకు లక్ష కోట్ల అవినీతి అన్నారని మండిపడ్డారు.