హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఏపీలోని తిరుపతి జిల్లా నుంచి వైసీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరారు. గురువారం హైదరాబాద్ కార్యాలయంలో అనంతరం తోట చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ.. అధికార వైసీపీ, గత టీడీపీ పాలనతో ఏపీ ప్రజలు విసిగిపోయారని అన్నారు.
ఏపీవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నదని చెప్పారు. ఫలితంగా ఆయా పార్టీల నుంచి పెద్దఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం, నాయుడుపేట మండలం మేనకూరు గ్రామానికి చెందిన వైసీపీ నేత కందాటి రజినీకాంత్ ఆధ్వర్యంలో పలు పార్టీలకు చెందిన వారు బీఆర్ఎస్లో చేరారు. వారికి తోట చంద్రశేఖర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.