Rythu Bandhu | మహబూబ్‌నగర్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): యాసంగి సీజన్ రైతుబంధు పంపిణీ గందరగోళంగా మారింది. ఇప్పటికే పలువురు రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం నిధులు జమ కాగా, పలువురి ఖాతాల్లో రూ.1, రూ.62 చొప్పున జమ కావడంతో ఆయా రైతులు విస్తుపోయారు. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలానికి చెందిన పాండురంగారెడ్డికి ఐదు ఎకరాల భూమి ఉన్నది. ఎకరాకు రూ.ఐదు వేల చొప్పున రూ.25 వేలు జమ కావాల్సి ఉండగా.. ఈసారి ఒక్క రూపాయి మాత్రమే జమైనట్టు ఆయన సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో ఆయన కంగుతిన్నారు.
ఇదే మండలంలోని టంకర గ్రామానికి చెందిన మరో రైతు ఆంజనేయులుకు రూ.62 జమైనట్టు మెసేజ్ వచ్చింది. ఆంజనేయులుకి గ్రామంలో రెండు గుంటల భూమి ఉండగా గతంలో రూ.250 పడేది. ఈ సారి రూ.62 మాత్రమే పడింది. తనకు వేరే సర్వే నంబర్లో ఎకరంన్నర భూమి ఉన్నప్పటికీ ఆ పైసలు ఇంకా పడలేదని ఆంజనేయులు పేర్కొన్నారు. రైతుబంధు నిధులు వెంటనే విడుదల చేయాలని ఈ నెల 11న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించినప్పటికీ ఇంకా తమ ఖాతాల్లో జమ కాలేదని పలువురు రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.