నిర్మల్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): నిర్మల్ జిల్లాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు కింద యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందడం లేదు. భైంసా పట్టణ శివారులో నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా భైంసా, లోకేశ్వరం మండలాల్లోని దాదాపు 14 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉన్నది. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2017లో ఈ ప్రాజెక్టు కింద ప్రధాన కాలువ నిర్మాణానికి అప్పటి సీఎం కేసీఆర్ రూ.6 కోట్లు విడుదల చేశారు.
దీంతో దాదాపు 20 కిలోమీటర్ల మేర కాలువ నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం భైంసా నుంచి పుస్పూర్, బిలోలి గ్రామాల వరకు నీరు అందుతున్నది. మరో ఎనిమిది కిలోమీటర్ల మేర కాలువ నిర్మాణ పనులు పెండింగ్లో ఉన్నాయి. ఇందుకోసం గత ఏడాది కాలంగా నిధులు మంజూరు చేయాలని అధికారులు ప్రతిపాదనలు పంపినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రతిపాదనలను బుట్టదాఖలు చేసింది. దీంతో ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందడం లేదు.
గడ్డెన్నవాగు ప్రాజెక్టు కింద కాలువను నమ్ముకుని వరి వేస్తే రెండెకరాలు ఎండిపోయింది. నోటికి అచ్చిన పంట కండ్ల ముందే ఎండిపోతున్నది. నీళ్లు లేక రెండెకరాలు ఇడిసిపెట్టి, పొట్ట కోసం ఒక ఎకరం పొలాన్నైనా కాపాడుకుందామని నానా తంటాలు పడుతున్న. ఎకరానికి రూ.5 వేలు కిరాయి ఇచ్చి మోటరు తెచ్చుకుని నీళ్లు పారించుకుంటున్న. రోజుకు 10 సార్లు కరెంటు బంద్ అయితున్నది. అర్ధరాత్రి ఒంటిగంటకు కరెంటు ఇస్తున్నరు. మళ్లీ పాతకాలం లెక్క రోజులు అచ్చినయ్.
– పర్స పోతన్న, రైతు, పుస్పూర్, లోకేశ్వరం మండలం