Yadagirigutta | హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : రాజుల కాలంలో శ్రీకృష్ణదేవరాయలు ఊరూరా గుడులు, గోపురాలు నిర్మించేవారని విన్నాం. ఇప్పుడు అభినవ శ్రీకృష్ణదేవరాయలు కేసీఆర్ ఆ భాగ్యాన్ని చూసే అదృష్టం మనకు కల్పించారు. ఆయన ఆ దేవదేవుడికి చేసిన సేవకు గుర్తింపు దక్కింది. తెలంగాణ ఇలవేల్పు యాదగిరిగుట్టను పునర్నిర్మించి, ఆలయానికి పూర్వవైభవం తీసుకొచ్చిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషిని రాష్ట్ర అసెంబ్లీ కొనియాడింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో యాదగిరిగుట్ట పునర్వైభవానికి పునాది వేసిన కేసీఆర్‌ను శాసనమండలి, శాసనసభ ప్రశంసించాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కృష్ణశిలతో ఆలయాన్ని నిర్మించిన కేసీఆర్‌ను పలువురు కీర్తించారు. ఆలయాలపై కేసీఆర్‌కు ఉన్న అభిలాషతోనే యాదగిరిగుట్ట నిర్మాణం సాధ్యమైందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కొనియాడారు. విమాన గోపురం బంగారు తాపడం నిర్మాణం కోసం ఎందరో దాతలను కలిసి కేసీఆర్ మాట్లాడారని గుర్తుచేశారు.
ఆలయాన్ని ఎవరు నిర్మించారనే అంశం చర్చకు వస్తే కేసీఆర్ పేరే చెబుతారని, చరిత్రను ఎవరూ మార్చలేరని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ఎవరూ అవునన్నా, కాదన్నా యాదగిరిగుట్ట ఆలయ నిర్మాణ క్రెడిట్ కేసీఆర్‌కే దక్కుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) మాదిరిగా తెలంగాణ తొలి సీఎం కే చంద్రశేఖర్‌రావు యాదగిరిగుట్ట నిర్మాణం చేపట్టారని గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రశంసించారు. మంగళవారం శాసనమండలిలో దేవాదాయ, ధర్మాదాయ, వైటీడీఏ బోర్డు బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రూ.1800 కోట్లతో యాదగిరిగుట్ట నిర్మాణం, యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో అద్భుతమైన రహదారులు వేయించారని పేర్కొన్నారు. కేసీఆర్ విజ్ఞప్తి మేరకు చాలామంది దాతలు బంగారం సమర్పించారని పేర్కొన్నారు. దేవాలయం ఆవరణలో అద్భుతంగా కాటేజీలు ఏర్పాటు చేశారని చెప్పారు. యాదగిరిగుట్ట బోర్డుకి నిబద్ధత గల అధికారిని నియమించాలని సూచించారు. కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా ఈ ప్రభుత్వం కూడా యాదగిరిగుట్టకు అద్భుత పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు.
యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణంలో కేసీఆర్ కృషి ఉందని, చరిత్ర చరిత్రగానే ఉంటుందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఆలయం ఎవరు నిర్మించారంటే… కేసీఆరే కట్టారని ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఇందులో తమకు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని, కేసీఆర్ మనసు పెట్టి ఆలయాన్ని నిర్మించారని చెప్పారు. ఆలయ నిర్మాణ పనుల్లో పాలుపంచుకునే అవకాశం రావడం అప్పటి మంత్రి ప్రశాంత్ రెడ్డి అదృష్టమని మంత్రి తెలిపారు. ముందుగా బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి కొండా సురేఖ ఆలయ అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూ వివరాలు వెల్లడించారు.
యాదాద్రి ఆలయ కెడ్రిట్ మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కొనియాడారు. ‘గుడి కట్టినా, బడి కట్టినా, ప్రాజెక్టు కట్టినా ప్రజల ధనంతోనే కేసీఆర్ కట్టారు. యాదగిరిగుట్ట దేవస్థానం కట్టాలని దేవుడు ఆయనకు ఆలోచన కల్పించడం గొప్పవిషయం. అందుకు అనుగుణంగా తెలంగాణ వచ్చిన వెంటనే చాలా గొప్పగా కట్టారు. యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మించిననందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా కేసీఆర్‌ను కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఇందులో రాజకీయాలు ఏమీ లేవు. మేము మంచి చేస్తే మీరూ మెచ్చుకోవాలి. వైటీడీ కాకుండా.. యాదగిరిగుట్ట దేవస్థానం (వైజీడీ)గా పేరు మార్చాలి’ అని సూచించారు.
ఎంఐఎం సభ్యుడు కౌసర్ మొయినొద్దీన్ యాదాద్రి ఆలయాన్ని కేసీఆర్ చక్కగా నిర్మించారని కొనియాడారు. కానీ, ఈ బిల్లు పెట్టిన మంత్రి కొండా సురేఖ మాత్రం మాటమాత్రంగానైనా కేసీఆర్ కృషిని ప్రస్తుతించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ దేశంలో కొందరు రాజకీయాల కోసం దేవుడిని ఉపయోగించుకుంటారని, కానీ కేసీఆర్ మాత్రం యాదాద్రి ఆలయ నిర్మాణాన్ని ఎక్కడా ప్రచారం కోసం వాడుకోలేదని చెప్పారు. కాంగ్రెస్ సభ్యుడు శ్రీహరి మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట ఆలయాన్ని అభివృద్ధి చేయబట్టే దానికి మంచి ప్రాచుర్యం లభించి, ఆదాయం కూడా భారీగా పెరిగిందని తెలిపారు. సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట ఆలయాన్ని కేసీఆర్ తన బ్రైన్ చైల్డ్‌గా భావించారని, ఆలయాన్ని అభివృద్ధి చేయడం వల్ల నేడు ఆదాయం వస్తున్నదని పేర్కొన్నారు.
హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ పదేండ్ల పాలనలోనే తెలంగాణ ఆలయాలు పూర్వవైభవం సంతరించుకున్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రూ.2 వేల కోట్లు వెచ్చించి భక్తిశ్రద్ధలు, బాధ్యతతో తెలంగాణ ఇలవేల్పు యాదగిరిగుట్ట ఆలయాన్ని కేసీఆర్ పునర్నిర్మించారని, వెయ్యేండ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అత్యద్భుతంగా తీర్చిదిద్దారని ఉద్ఘాటించారు. కానీ 15 నెలల కాంగ్రెస్ పాలనలో దేవాదాయ రంగం తిరోగమన దిశలో పయనిస్తున్నదని దుయ్యబట్టారు. 18వ తేదీ వచ్చినా అర్చకులకు వేతనాలివ్వని దుస్థితికి కాంగ్రెస్ సర్కారు తీసుకువచ్చిందని నిప్పులు చెరిగారు. మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వైటీడీఏ బిల్లుపై జరిగిన చర్చలో హరీశ్‌రావు మాట్లాడారు. ఆలస్యంగానైనా యాదాద్రి ఆలయానికి బోర్డు ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని, బిల్లుకు సంపూర్ణంగా మద్దతిస్తున్నామని ప్రకటించారు.
నాడు కాళేశ్వరం ద్వారా పోచమ్మ సాగర్ నుంచి గంధమల్ల కెనాల్ ద్వారా ఇక్కడి కోనేరును గోదావరి జలాలతో నింపిన అనుభూతిని మరిచిపోలేమని హరీశ్‌రావు తెలిపారు. ధర్మకర్తల బోర్డు కాకుండా మండలిని ఏర్పాటు చేసి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేతో పాటు గిరిజన సామాజికవర్గానికి చెందిన సభ్యుడిని నియమించాలని డిమాండ్ చేశారు. టీటీడీ తరహాలో ఈవో, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్స్, ఉద్యోగుల వేతనాలను టెంపుల్ ద్వారానే చెల్లించాలని సూచిం చారు. పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ కోసం దేవాలయ నిధులు ఖర్చుచేసే దిశగా ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని చెప్పారు. రూ.100 కోట్లకు పైగా ఆదాయం ఉన్న ఆలయాలకు ట్రస్ట్‌బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. బాసర, భద్రాద్రి, ధర్మపురికి రూ. 50 కోట్లు, వేములవాడ ఆలయానికి రూ. 70 కోట్ల చొప్పున వెచ్చించి అభివృద్ధి చేశామని చెప్పారు. కాళేశ్వరం ఆలయాన్ని రూ. 30 కోట్లతో, కొండగట్టు అంజన్న సన్నిధిని రూ.600 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు చేశామని పేర్కొన్నారు.
వేములవాడకు ఏటా రూ.127 కోట్లకు పైగా ఆదాయం వస్తున్నదని తెలిపారు. ఈ ఆలయానికి కూడా ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసి, అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విమాన గోపుర నిర్మాణంపై కాంగ్రెస్ సభ్యులు తమను ప్రశ్నించడం విడ్డూరంగా ఉన్నదని పేర్కొన్నారు. సిద్దిపేట నియోజకవర్గం నుంచి తన డబ్బులతో కొనుగోలు చేసిన రెండు కిలోల బంగారాన్ని భక్తులతో కలిసి వెళ్లి ఆలయానికి సమర్పించామని తెలిపారు. కేసీఆర్ కూడా 1 కేజీ 116 గ్రాముల బంగారాన్ని ఇచ్చారని గుర్తుచేశారు.
ఆలయ పూజారులకు ప్రభుత్వ సొమ్ము ద్వారా వేతనాలు ఇచ్చిన చరిత్ర కేసీఆర్‌కే దక్కిందని కొనియాడారు. కారుణ్య నియామకాల కింద 86 మంది దేవాదాయ శాఖ ఉద్యోగుల కుటుంబీకులకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద చేర్పించి నియమించామని గుర్తుచేశారు. కానీ, వారికి వేతనాలు రావడం లేదని, ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారంపై దృష్టిపెట్టాలని కోరారు. ధూపదీప నైవేద్యం రూ.2 వేలను రూ.10 వేలకు పెంచామని తెలిపారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.12 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో బ్రాహ్మణ పరిషత్ సంక్షేమ నిధికి రూ.100 కోట్లు ఇచ్చారని చెప్పారు. కేసీఆర్ సమ్మక్క సారక్క ఆలయ నిర్వహణకు రూ.100 కోట్లు కేటాయించారని తెలిపారు. హైదరాబాద్‌లో రూ.10 కోట్లతో బ్రాహ్మణ భవన్ నిర్మాణాన్ని చేపట్టామని, కాంగ్రెస్ వచ్చిన తర్వాత పనులు నిలిచిపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. కేసీఆర్ మాదిరిగానే విద్యానిధి కింద విదేశాల్లో చదువుకుంటున్న బ్రాహ్మణ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించాలని డిమాండ్ చేశారు. సీజీఎఫ్‌లో ప్రారంభించిన పనులకు టెండర్లు పిలిచి పూర్తిచేయాలని కోరారు.
తెలంగాణ వారసత్వ సంపద యాదగిరిగుట్ట అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. మంగళవారం వైటీడీ బోర్డు బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడుతూ.. కేసీఆర్‌తో ఆ భగవంతుడే ఆలయాన్ని కట్టించినట్టు నమ్ముతున్నానని చెప్పారు. ‘ఆలయాన్ని కృష్ణశిలతోనే అద్భుతంగా నిర్మించారు. గత ప్రభుత్వం బోర్డు ఏర్పాటు చేయాలని అనుకున్నది. కానీ కుదరలేదు. యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటు చేయడాన్ని ఆహ్వానిస్తున్నాం. ఆలయ ఉద్యోగులకు జీతాల నుంచి ఉపాధి వరకు ప్రభుత్వమే రిక్రూట్ చేయాలి. తెలంగాణ సంసృతి సాంప్రదాయాలు కొనసాగించేలా కమిటీ కొనసాగాలి’ అని సూచించారు.
వైటీడీ బోర్డు బిల్లుపై జరిగిన చర్చలో బీఆర్ఎస్ సభ్యుడు శేరి సుభాష్‌రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం టీటీడీని చూసి వైటీడీ పేరు పెట్టినట్టు అనిపిస్తున్నదని అన్నారు. వైటీడీకి బదులుగా యాదగిరిగుట్ట డెవలప్మెంట్ అథారిటీగా పెడితే బాగుండేదని సూచించారు. ప్రస్తుత రాజకీయ నాయకులు ఓట్ల కోసం ప్రయత్నించే వారేనని తెలిపారు. ‘ఎప్పుడో రాజుల కాలంలో శ్రీకృష్ణదేవరాయలు గుడులు కట్టించారని విన్నాం. ఇప్పుడు మనందరికి చూసే అదృష్టం కేసీఆర్ కల్పించారు’ అని తెలిపారు.