యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్య క్షేత్రంలో ఆదివారం స్వాతి నక్షత్ర పూజల కోలహలం నెలకొంది. వేకువ జామూనే స్వయంభువులను కొలిచిన అర్చకులు బాలాలయంలోని కవచమూర్తులకు అష్టోత్తర శతఘటాభిషేకం పూజలు నిర్వహించారు. నారసింహుని జన్మ నక్షత్రం సందర్భంగా బాలాలయ మండపంలో 108 శత కలశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కలశాల్లోని జలాలకు పాంచరాత్రగమశాస్త్రం ప్రకారం పూజలు జరిపారు. పాలు, పెరుగు వివిధ శుద్ధ జలాలతో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలతో రెండు గంటలు అష్టోత్తర శతఘటాభిషేకం పూజలు నిర్వహించారు.
స్వామి వారిని ప్రత్యేకంగా ఆలంకరించి బంగారు పుష్పాలతో అర్చన చేశారు. పంచసూక్త పఠనంతో హోమం నిర్వహించి ఉత్సవమూర్తులను, ప్రతిష్ఠ అలంకార మూర్తులను అభిషేకించారు. తులసీ దళాలతో సహస్రనామార్చనలు జరిపారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లను రథసేవలో తీర్చిదిద్ది బాలాలయ మండపంలో ఊరేగించారు. స్వామి వారి జన్మ నక్షత్రం సందర్భంంగా భక్తుల వేకువ జామునే కొండచుట్టూ గిరి ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అష్టోత్తర శత ఘటా భిషేకం పూజల్లో ఆలయ ఈవో గీత, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, అధికారులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.