యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ప్రతిష్టామూర్తులకు చేపట్టి న నిజాభిషేకం మొదలుకుని స్వామి వారికి జరిగే నిత్య కైంకర్యాలలో భక్తులు పాల్గొని తరించారు. పూజల అనంతరం స్వామివారిని దర్శించుకునే భక్తులు ఉదయం నుంచే క్యూ లైన్లలో నిలుచున్నారు.
పలువురు భక్తులు సువర్ణ పుష్పార్చనలో పాల్గొని స్వామి వారి వేద ఆశీర్వచనం తీసుకున్నారు. బాలాలయంలోని స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్యపూజలు జరిపారు. తెల్లవారుజామునే స్వామి వారిని సుప్రభాతంతో మేల్కొలిపి, లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేపపట్టారు.
అనంతరం స్వామి వారికి హారతి నివేదనలు అర్పించారు. బాలాలయం కల్యాణ మండపంలో సుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరుపుగా భక్తులు పాల్గొని తరించారు. స్వామి వారి నిత్య తిరు కల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ఊరేగించారు.
లక్ష్మీ సమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ గంటన్నరకు పైగా కల్యాణ తంతును జరిపారు. బాలాలయ ముఖ మండ పంలో అష్టోత్తర పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, అంజనేయ స్వామివారిని సహస్రనామార్చన చేశారు.
సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. పూర్వగిరి (పాతగుట్ట)లో లక్ష్మీ నరసింహ స్వామి వారి నిత్య కైంకర్యాలు సంప్రదాయబద్దంగా సాగాయి. అనుబంధ శివాలయంలో శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేష పూజా పర్వాలు శాస్ర్తోక్తంగా జరిగాయి.