హైదరాబాద్, ఫిబ్రవరి 11(నమస్తే తెలంగాణ): గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ) ఇష్టారీతిన వ్యవహరిస్తున్నది. బోర్డు నిర్వహణకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు నిర్ణీత మొత్తంలో ఇచ్చిన నిధులను ఏకపక్షంగా ఖర్చు చేస్తూ, దుర్వినియోగం చేస్తున్నదనే ఆరోపణలున్నాయి. గతంలోనే బోర్డు తీరుపై రాష్ర్టాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశా యి. ఏకపక్షంగా ఖర్చు చేసిన నిధులను చెల్లించబోమని గత బోర్డు సమావేశంలోనూ తేల్చిచెప్పాయి. కానీ, జీఆర్ఎంబీ అధికారులు మా త్రం రాష్ర్టాల వాదనలను బుట్టదాఖలు చే స్తున్నారు. బోర్డు కోరిన నిధులను చెల్లించాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ మేరకు తాజా గా రాష్ర్టాలకు లేఖ రాయడం చర్చనీయాంశమైంది. రివర్ బోర్డు నిర్వహణకు సంబంధించిన నిధులను తెలంగాణ, ఏపీ రాష్ర్టాలు 50ః50 నిష్పత్తిలో భరించాల్సి ఉంటుంది.
ప్రతి సంవత్సరం బోర్డు మీటింగ్లో బడ్జెట్ను ప్రవేశపెట్టి చర్చించి నిర్ణయిస్తారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బోర్డు నిర్వహణకు రూ.14.5కోట్లు అవసరమని అంచ నా వేశారు. బోర్డు మీటింగ్లో ఆ ప్రతిపాదనలకు ఇరు రాష్ర్టాలు అంగీకరించాయి. ఆ నిధులను రూ.7.25 కోట్ల చొప్పున తెలంగాణ, ఏపీ చెల్లించాల్సి ఉన్నది. అయితే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధులు కలిపి తెలంగాణ మొత్తంగా రూ.8.64 కోట్లు చెల్లించాల్సి ఉన్నదని తాజాగా జీఆర్ఎంబీ లేఖ రాసింది. ఆ నిధులను సత్వరం చెల్లించాలని పేర్కొన్నది. ఏపీ సర్కార్ మాత్రం గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధులనే విడుదల చేయకపోవడం గమనార్హం.
ఇష్టారీతిన నిధుల దుర్వినియోగం
బోర్డు తీరుపై తెలంగాణ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బోర్డు ఇష్టారీతిన ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ నిధులను దుర్వినియోగం చేస్తున్నదని మండిపడుతున్నారు. బోర్డులో పనిచేసే ఈఈ స్థాయి అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ తరహాలోనే బోర్డులోనూ వాహన సౌకర్యం కల్పిస్తున్నారు. రాష్ట్రంలో వాహన సదుపాయానికి గరిష్ఠంగా రూ.34 వేలు చెల్లిస్తున్నారు. అయితే, బోర్డు మాత్రం వాహన సదుపాయానికి రూ.45 వేలు ఖర్చు చేస్తున్నది. బోర్డులో ఫర్నిచర్ కొనుగోలుకు ఏకంగా రూ.కోటికిపైగా ఖర్చు చూపింది. జలసౌధలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, నీటిపారుదల శాఖ సెక్యూరిటీ సిబ్బందిని నియమించినప్పటికీ మళ్లీ ప్రత్యేకంగా సెక్యూరిటీ సిబ్బందిని జీఆర్ఎంబీ నియమించుకుని ఖర్చులు అధికంగా పెడుతున్నదని రాష్ట్ర అధికారులు చెప్తున్నారు.
అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఎంపిక విషయంలోనూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నది. బోర్డు మొత్తంగా రూ.కోట్లలో నిధులు వృథా చేసిందని రాష్ట్ర అధికారులు వివరిస్త్తున్నారు. గత సంవత్సరం ఏప్రిల్లో నిర్వహించిన బోర్డు సమావేశంలోనూ ఇవే విషయాలను చాలా స్పష్టంగా వెల్లడించారు. అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఖర్చుచేసిన నిధులను చెల్లించబోమని తేల్చిచెప్పారు. అంతేకాకుండా, సెక్యూరిటీ సిబ్బందిని సైతం తొలగించాలని సూచించారు. అయినప్పటికీ, బోర్డు మాత్రం అవేమీ పట్టించుకోకుండా మొత్తం నిధులు చెల్లించాలని లేఖ రాయడంపై రాష్ట్ర ఇంజినీర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.