గ్రేటర్ విభజనపై నగర వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. కాంగ్రెస్ అడ్డగోలు విధానంతో నగరం రూపురేఖలు మారిపోవడంతో.. అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడంలో సీఎం రేవంత్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారంటూ నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నగరంలోని పలు నియోజకవర్గాల పరిధిలో సీఎం దిష్టి బొమ్మలను దహనం చేశారు. జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం పూర్తిగా అనాలోచితమేనని నగరాన్ని కుట్రపూరితంగానే విచ్ఛిన్నం చేశారని నగరంలో పలు నియోజకవర్గాల పరిధిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో నాయకులు మండిపడ్డారు.
సిటీబ్యూరో, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్ విభజనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. మూడు కార్పొరేషన్లగా విభజించి, నగరం అస్తిత్వాన్ని దెబ్బతీసిందంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ క్రమంలోనే నగరంలో పలు నియోజకవర్గాల పరిధిలో బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగింది. ప్రజా పాలన పేరిట కాంగ్రెస్ సర్కారు అమలు చేసే విధానాలపై నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించకుండా, ప్రత్యేకాధికారులను నియమించారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ర్టానికి గుండెకాయ వంటి నగరాన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పేరిట ముక్కలు చేశారని, అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. 12 ఏండ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించి.. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి వేల కోట్లు రూపాయలను ఖర్చు చేసింది. కానీ పాలకుల ప్రయోజనాల పేరిట నగరాన్ని విచ్ఛిన్నం చేయలేదని పలువురు నాయకులు విమర్శించారు.
పలు నియోజకవర్గాల్లో ఆందోళనలు
జీహెచ్ఎంసీ విచ్ఛిన్నంపై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎల్పీ విప్ కేపీ వివేకానంద్ తీవ్రంగా మండిపడ్డారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సర్కారు తీరును తప్పుబట్టారు. విభజన ప్రక్రియ రేవంత్ రాచరిక పాలనకు నిదర్శనంగా ఉందన్నారు. స్థానికుల అభిప్రాయాలకు ప్రాధాన్యత లేకుండా, దండుపాళ్యం ముఠాలుగా నగరాన్ని దోచుకు తినేందుకే రేవంత్‌రెడ్డి విభజన చేశారన్నారు. నగరాన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లుగా ముక్కలు చేయడంతో అభివృద్ధికి ఆస్కారమే ఉండదన్నారు. రాజేంద్రనగర్ బండ్లగూడలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. బండ్లగూడ కూడలి వద్ద జరిగిన ఆందోళన కార్యక్రమంలో సీఎం తీరుపై మండిపడ్డారు. ఇక హైదర్‌గూడ చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో ప్రజాభిప్రాయం లేకుండా విభజన చేయడం సరికాదన్నారు. శంషాబాద్ జోన్‌ను హైదరాబాద్‌లో విలీనం చేయడాన్ని అఖిలపక్ష నేతల ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో జరిగిన ఆందోళనలో పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.