యాదగిరిగుట్ట, జూన్ 22 : వచ్చే స్వాతి నక్షత్రంలోపు ఆలయం చుట్టూ నిర్మించిన గిరిప్రదక్షిణ రోడ్డులో యాదమహర్షి, శ్రీలక్ష్మీసమేత నరసింహస్వామి మండపాలను నిర్మించనున్నట్టు యాదగిరిగుట్ట ఆలయ ఈవో భాస్కర్‌రావు తెలిపారు.
గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు ఆధ్యాత్మికత పెంపొందేలా చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. శనివారం గిరిప్రదక్షిణ, కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, నిత్యాన్నదాన సత్రం, యాదరుషి విగ్రహాలను ఆయన పరిశీలించారు. మొదటి ఘాట్ ప్రాంతంలోని రోడ్డు డివైడర్‌లో గల యాదమహర్షి విగ్రహం అక్కడే ఉంటుందని, ఆయన పేరిట గిరి ప్రదక్షిణలో మండపాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. గిరి ప్రదక్షిణ రోడ్డులోకి ఇతర వాహనాలు రాకుండా ఇరువైపులా ప్రహరీ నిర్మిస్తామని పేర్కొన్నారు. పందులను నిర్మూలించేందుకు త్వరలో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, కొండపైన కోతుల బెడద లేకుండా చూస్తామని తెలిపారు.