యాదాద్రి : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ముఖమండపంలో సువర్ణమూర్తులకు బంగారు పుష్పార్చనలు అత్యంత వైభవంగా జరిగాయి. బుధవారం మన్యుసూక్త పారాయణం జరిపి ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చన జరిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా జరిగిన సువర్ణపుష్పార్చనల్లో భక్తులు పాల్గొని పూజలు చేశారు. స్వయంభూ నారసింహుడికి నిత్యోత్సవాలను అర్చకులు తెల్లవారుజాము నుంచే ప్రారంభించారు. స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధనలు, నిజాభిషేకం జరిపిన అర్చకులు తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన నిర్వహించారు. సాయంత్రం స్వామివారిని గరుఢ వాహనం, అమ్మవారి తిరుచ్చివాహనం వేంచేపు చేసి సేవలు కొనసాగించారు.
దర్బార్ సేవలో భాగంగా ప్రధానాలయ ముఖ మండపంలో స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా అలంకరించి వేంచేపు చేశారు. స్వామివారికి పారాయణం, స్వామివారి స్వస్తి మంత్రార్థ వంటి మంత్రాలతో శాంతిపజేసి అనంతరం స్వామివారిని గర్భాలయానికి వేంచేపు చేశారు. పాతగుట్ట ఆలయంలో స్వామివారి నిత్యోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. కార్తిక మాసం సందర్భంగా సత్యనారాయణ వ్రతాలు, కార్తిక దీపారాధనలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సుమారు 17వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఖజానాకు రూ.20,26,825 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.