లక్ష్మీ నృసింహుడు వెలసిన యాదాద్రి క్షేత్ర విశిష్టత నరసింహ, స్కాంద, పద్మ, బ్రహ్మ, బ్రహ్మాండ పురాణాలలో ఉన్నది. నరసింహుడు యాదగిరి క్షేత్రంలో వెలిసిన సందర్భం, భక్తులకు గోచరముగా ఎప్పుడు మారిననేపథ్యం, భవిష్యత్తులో జగద్విఖ్యాతి చెందుతుందని పార్వతికి పరమేశుడు చెప్పడం- మొదలైన ఆసక్తికర విశేషాలు మనకు ఈ పురాణాలలో లభిస్తున్నాయి. పురాణాలలోని ఆధారాల ప్రకారం- బ్రహ్మ, అగస్త్యుల ద్వారా తాను విన్న నరసింహుని మహాత్మ్యాన్ని భృగు మహర్షి నరసింహ భక్తుడైన ఒక రాజుకు వెల్లడించాడు. యుగయుగాలలో ఈ యాదగిరి క్షేత్రము ప్రసిద్ధమై ఉన్నట్టు పురాణాల వల్ల తెలుస్తున్నది. యాదగిరి క్షేత్ర మహత్తర చరిత్రలో మూడు ప్రసిద్ధ ఘట్టాలున్నాయి. ఇందులో రెండు గతంలోనే ఆవిష్కృతమయ్యాయి. మూడో ఘట్టానికి రంగం సిద్ధమవుతున్నది.
పురాణగాథ ప్రకారం నారసింహుడు ప్రహ్లాద రక్షకుడై స్తంభోద్భవుడై అవతరించి రాక్షన సైన్యాన్నంతా తుడిచిపెట్టిన అనంతరం హిరణ్యకశిపుడితో తలపడతాడు. ఇరువురి మధ్య భీకర యుద్ధం సాగుతుంది.
యోధ మానస్య నృహరే ర్వర్షాణ్యా సంత్సహస్రశః
దక్షీణం సముప్రకాన్తౌ యోధమానౌ ముహుర్ముహుః
ఇద్దరూ ఘోరంగా యుద్ధం చేస్తూ కొన్ని వేల ఏండ్లు గడిచిపోయాయి. హిరణ్యకశిపుడికి కాలం సమీపించేవరకు దేవుడు పోరాడుతూ క్రమక్రమంగా దక్షిణ భూభాగాన్ని చేరుకొన్నారు. పురాణాల వివరాల వల్ల- రాయలసీమలోని శ్రీశైల ప్రాంతంలోగల అహోబిల క్షేత్రములో హిరణ్యకశిప వధ జరిగినట్టు విద్వాంసులు భావిస్తున్నారు. రాక్షసవధానంతరం శ్రీశైలంలో స్వామి సురపూజితుడయ్యాడు.
శ్రీశైల శిఖరాద్యాతో యాద శైలం సమాశ్రితః
పుష్ప వర్షం విముఞ్చన్తో బ్రహ్మాద్యా స్తుష్దువుర్ముదా
(హిరణ్యకశిప వధానంతరం) నృసింహుడు శ్రీశైల శిఖరము నుంచి బయలుదేరి యాదాద్రి మీదికి వచ్చారు. బ్రహ్మాది దేవతలు పుష్పవర్షము కురిపిస్తూ అనేక విధాలుగా స్తుతిస్తూ వెంట వచ్చారు.
అథాహ భగవన్దేవ ప్రహ్లాదం ప్రతి సూనృతా
అత్రమే రోచతే వాసర్థివ్యో యాదాద్రి కన్ధరః
‘నేను నిజంగా యాదగిరిగుహ యందు నివసించాలని భావిస్తున్నాను. ఇదే నాకు ప్రీతికరమైన స్థలం’ అని నృసింహుడు ప్రహ్లాదుడితో అన్నాడు.
వదా దన్యత్ర వాసోమే భవితవ్య శ్శుభావహః
రోచతే యాద శైలోయం సర్వతః ప్రధితో భవేత్
‘హిరణ్యకశిపుని వధించిన స్థలంలో నేను ప్రసన్నంగా యుండుటం భావ్యం కాదు కదా. అందువల్ల యాదాద్రియే నాకు ప్రియమైనది. భవిష్యత్తులో లోకమున ప్రసిద్ధ క్షేత్రం అవుతుంది’ అని నృసింహుడు స్వయంగా వెల్లడించాడు. యాదగిరి క్షేత్రం ఆనాడు దట్టమైన అడవులతో, క్రూర మృగాలతో నిండి ఉండేది. లక్ష్మీనరసింహుడు ఈ పర్వతమున వెలిసినప్పటికీ, భక్తులకు దర్శనం కలుగలేదు. పురాణాలలోని యాదరుషి వృత్తాంతం చదివితే లక్ష్మీనరసింహుడు భక్తులకు సాక్షాత్కరించడానికి గల నేపథ్యం తెలుస్తుంది.
యాదర్షి చరితం వక్ష్యే సర్వ సమ్పత్కరం నృణామ్
శ్రీలక్ష్మీ నారసింహస్య యాదాద్రి నిలయస్యచ
‘మానవులకు అన్ని విధముల సంపత్కరమైనట్టి యాదాద్రి నిలయుడైన శ్రీ లక్ష్మీనారసింహుడి చరిత్రను, యాదర్షి వృత్తాంతాన్ని చెప్పెదను’అంటూ భృగు మహర్షి వివరించాడు. ఋష్యశృంగుని కుమారుడైన యాద మహర్షి నృసింహుడి దర్శించాలని కోరుకొన్నాడు. ఇందుకు తపస్సునకు అనుగుణమైన ప్రశాంతత, రమణీయత గల ప్రదేశమెక్కడున్నదో అని నానా దేశములను కలియ తిరుగుతూ దక్షిణ దేశానికి చేరుకొన్నాడు. ఒక రాత్రి వటవృక్షము కింద నిద్రిస్తుండగా, స్వప్నమున హనుమంతుడు సాక్షాత్కరించాడు.
కిమర్థం చిన్త్యసే యోగిన్ గిరావస్మిం స్తపశ్చర
శ్రీలక్ష్మీ నారసింహస్య ప్రసాదం విందసే చిరమ్
‘ఎందులకు విచారిస్తున్నావు, ఈ సమీపమునందలి గిరిపై తపస్సు చేయుము. అచిర కాలములోనే లక్ష్మీ నారసింహుని అనుగ్రహము బడసెదవు’ అని చెప్పాడు. నారసింహుడు సామాన్య మానవ మాత్రులకు కనిపించడనీ, యోగులకు మాత్రమే సాక్షాత్కరిస్తాడని వివరించాడు. హనుమంతుడి ఆదేశానుసారం యాద మహారుషి సంతోష భరితుడయ్యాడు. కొండ శిఖరాగ్రానికి చేరుకొని చాలాకాలం తపస్సుచేశాడు. యాదరుషి తపమునకు మెచ్చిన నృసింహుడు ఉగ్రాకృతితో వ్యాఘ్ర రూపమున ప్రత్యక్షమయ్యాడు.
యాదర్షే! తపనామ్నా సౌ పర్వతః ప్రతిధోభవేత్
నృసింహ పంఞ్చ రూపంతు దృశ్యతా మిద మద్భుతమ్
‘ఓయీ యాదరుషీ నీ పేరుతోనే ఈ పర్వతము ప్రసిద్ధి చెందుగాక, ఇదుగో అద్భుతమైన పంచనారసింహ స్వరూపమును చూడుము’ అని భగవంతుడు అనుగ్రహించాడు. రుషులు నేటి వరకు నా ఈ దివ్యరూపమునకై తపిస్తున్నారు. నేనెవ్వరికి సులభుడను కాను, అంటూ స్వామి తన దివ్యరూపమును చూపించాడు. ‘యాద రుషీ నా మాట విను, నీవు ప్రార్థించినట్లుగా భక్తుల కోరికలు నెరవేర్చుటకు ఈ పర్వతమందు నివసిస్తాను’ అని స్వామి అభయమిచ్చెను. నాటినుంచి జ్వాలా నరసింహుడై ఊర్ధరేఖ వలె దర్శనమిస్తున్నాడు. పర్వత శిలలను ముక్కలుగా ఛేదించి ప్రజ్వలిస్తున్న అగ్ని వలె మండుతూ అర్చాకృతిగా ఆవిర్భవించాడు. ఆ దివ్య స్వరూపమును ఇవాల్టికి కూడా మనం కండ్లారా చూస్తూనే ఉన్నాం. లక్ష్మీనారసింహుడు వెలిసిన ఈ క్షేత్రమునకు పాలకుడివై శాశ్వతంగా ఉండిపోవాలని యాదరుషి ఆంజనేయుడిని అభ్యర్థించాడు.యాదరుషి కోరిక మేరకు స్వామి కార్యమునకు, భక్తుల అభీష్టములు నెరవేర్చుటకు ఆంజనేయుడు కామరూపుడై ఆవిర్భవించాడు.
సుదర్శన చక్రం అభయం
జ్యోతి స్వరూపో లోకానాం
సూచయం త్సామి సన్నిధిమ్
అలాత చక్రవత్తత్ర భ్రమిష్యామి నిరన్తరమ్
‘నా జ్యోతి స్వరూపముచే లోకులకు స్వామి సన్నిధిని సూచింప జేయుచు జ్వాలను తిప్పినట్టు సక్రమముగా తిరుగుచుందును. నేను, ఆంజనేయ స్వామి రక్షణము చేయుటలో సర్వకాలమునందు జాడ్యం లేక నిరంతరము క్షేత్ర పాలనము చేయుచు ఇక్కడనే నివసించి యుందుము.’ అని సుదర్శన చక్రం యాదరుషికి అభయమిచ్చింది.
పరమేశ్వరుడి వివరణ: మునుముందు యాదాద్రి మహా క్షేత్రమై వర్ధిల్లుతుందని సాక్షాత్తూ నృసింహుడే వెల్లడించాడు. కాగా భవిష్యత్తులో ఈ యాదాద్రి అందమైన ఆలయ శిఖరాలతో, ప్రాకారాలతో అలరారుతుందని పరమేశుడే పార్వతీ దేవికి వివరించడం విశేషం.
‘క్వచిత్కైలాస శిఖరే ఈశ్వరం ప్రాహ పార్వతీ
కిమర్ధం యాద శైలేన్ద్రం వన్దసే! నతమస్తకః’
తాత్పర్యం: ఒకప్పుడు కైలాస శిఖరముపై పరమేశ్వరుడితో పార్వతిదేవి ‘మాటి మాటికి యాదగిరికి నమస్కరిస్తున్నావు కారణమేమిటి’ అని అడిగింది. దానికి శివుడు ఈ విధంగా బదులిచ్చాడు.
అత్రనారాయణశ్రీ్శమా న్నృహరి స్సర్వశక్తిమాన్
అర్చారూపేణ ఛాద్యాస్తే భక్తానాం కల్పకద్రుమః
తాత్పర్యం: ఇచ్చట సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడు నరసింహావతారుడై సర్వశక్తులతో భక్తులకు కల్పకద్రుమమై అర్చారూపముతో వేంచేసి ఉన్నాడు.
భవిష్యత్యతుల ప్రఖ్యో దివి దేవైశ్చదుర్లభః
సర్వదా శ్లాఘనీయోమే తీర్థో యం దేవ భూభుజామ్
సర్వర్తు ఫల పుష్పాడడ్యే యాదాద్రౌ సుమనోహరే
భవిష్యతి పరంధామ నేత్రానన్ద ప్రవర్ధనమ్
తాత్పర్యం: భవిష్యత్తులో ఈ క్షేత్రం దేవతలకైనా అలవి కాక సాటి లేని కీర్తిని పొందుతుంది. దేవతలకు, బ్రాహ్మణులకు తీర్థరాజమై ఒప్పును. షడృతువులయందలి ఫల పుష్పములచే నిండి మనోహరమైన యాదాద్రి నందు నేత్రానందకరమైన పరంధామము భవిష్యత్తులో నిర్మాణం కాగలదు. ఈ విధంగా అనేక విధాలుగా యాదాద్రి వైభవాన్ని పరమేశుడు ప్రస్తుతించాడు. భవిష్యత్తులో నానాజన సమార్ణ వైకుంఠము వంటి వైభవము కలిగి ప్రాకారముల చేత, విమానముల (ఆలయ శిఖరములు) చేత, మణిమయములైన సౌధముల చేత, విద్యుద్దీపాల చేత ఈ యాదగిరి శోభాయమానమై ప్రకాశిస్తుందని ఈశ్వరుడు ఆ దేవదేవికి వివరించెను. ఆ యాదశైలాధినాథుడైన నరసింహుడు నా నేత్రముల సన్నిధియందు నిరంతరం గోచరించుచుండు గాక అని పరమేశ్వరుడు ధ్యానమగ్నుడయ్యాడట.
దేవతలు చెప్పినట్టుగానే యాదాద్రి ఆలయం శోభాయమానమైన నిర్మాణాలతో జగద్విఖ్యాతి నొందుటకు సమాయత్తమవుతున్నది. దైవేచ్ఛ మేరకు భక్తాగ్రేసరుడైన కేసీఆర్ ఆధ్వర్యంలో యాదాద్రి క్షేత్రం విస్తృతమైన అడవుల చేత, ఉద్యాన వనముల చేత అలరారుటకు ఏర్పాట్లు జరుగుతున్నవి.
మొదటి ఘట్టం
హిరణ్యకశిప వధానంతరం నృసింహుడు యాదాద్రిని నివాసంగా చేసుకోవడం. కానీ తపస్సంపన్నులైన మహారుషులే తప్ప సాధారణ భక్తులు భగవంతుడిని దర్శించలేకపోయేవారు.
రెండవ ఘట్టం
యాద మహర్షి తపస్సు చేత పంచ నారసింహుడు భక్తులకు దర్శనమివ్వడానికి అంగీకరించాడు. కానీ క్షేత్రం తగిన రీతిలో ప్రాచుర్యానికి నోచుకోలేదు.
మూడో ఘట్టం
ఈ క్షేత్రం భవిష్యత్తులో వైభవోపేతమై జగద్విఖ్యాతి అవుతుందని స్వయంగా నృసింహుడు దేవతలకు వెల్లడించాడు. పరమశివుడు కూడా పార్వతికి ఇదే విషయం చెప్తాడు. దేవదేవుడు వెల్లడించిన రీతిలో యాదశైలం విశ్వవ్యాప్తంగా ప్రకాశించే సమయం ఆసన్నమైంది. భక్తాగ్రేసరుడు కేసీఆర్ ఆధ్వర్యంలో యాదాద్రి పునర్నిర్మాణం మన కన్నుల ముందే జరగటం మన భాగ్యం.
డాక్టర్ సంగనభట్ల నరసయ్య
9440073124
drsnarsaiah@gmail.com