– కేసీఆర్ తెలంగాణాకు జాతిపితనే
– మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు
మిర్యాలగూడ, ఫిబ్రవరి 05 : మిర్యాలగూడలో నిర్వహించిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి తన హోదాను మరిచి బజారు రౌడీలా మాట్లాడారని, ఆయన మాటలను ప్రజలు చీదరించుకుంటున్నారని మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి 56 రోజులు చిప్పకూడు తిన్న చరిత్ర రేవంత్‌రెడ్డిదని, ఆయనపై ఇప్పటికీ 86 కేసులు ఉన్నట్లు తెలిపారు. కుక్క తోక ఎప్పుడు వంకరే అనే విధంగా హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లివచ్చినా ఆయనలో ఎటువంటి మార్పు రాలేదన్నారు. కేసీఆర్ 14 ఏండ్ల పాటు ఉద్యమాలు చేసి కేంద్ర మంత్రి పదవి, ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి తెలంగాణాలో ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన నాయకుడు అని, ఆయన కారణంగానే నేడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, ఆయన ఎప్పటికీ తెలంగాణాకు జాతిపితనే అని అన్నారు. కేసీఆర్‌ను తిడితే గొప్పవాడిని అవుతానని రేవంత్‌రెడ్డి అనుకుంటున్నాడని, కానీ తెలంగాణ ప్రజలు ఆయన భాషను చూసి అసహ్యించుకుంటున్నారన్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుపై ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన అజ్ఞానికి నిదర్శనమన్నారు. బూట్లు తుడిచిన చరిత్ర రేవంత్‌రెడ్డిదేనని, అది ఆయన గుర్తు తెచ్చుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో మీకు ప్రజలు తగిన రీతిలోనే గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.
మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి తన స్థాయిని మరిచి విమర్శించడం ఆయన అజ్ఞానికి నిదర్శనమన్నారు. ఆయన ఏ స్థాయి నుండి వచ్చింది, ఆయన పుట్టుపూర్వొత్తరాలు తనకు పూర్తిగా తెలుసని, ఆయన ఎవరి కాళ్లు పట్టుకుంది, ఎవరి బూట్లు తుడిచింది ఫొటోలతో సహా ఉన్నాయని, ఇది గుర్తు పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు. తనను జానారెడ్డి ఎన్నడూ కూడా పల్లెత్తు మాటా కూడా అనలేదని, తనతో నేను పార్టీలో కలిసి పనిచేసినట్లు తెలిపారు. జానారెడ్డి హోంమంత్రిగా ఉన్నప్పుడు తను ఎక్కడ ఉన్నాడో, ఏం చేసేవాడో గుర్తుంచుకోవాలని సూచించారు. కాంట్రాక్టర్లను, ఆఫీసర్లను బ్లాక్ మెయిల్ చేసిన చరిత్ర తనదన్నారు. చిల్లర మాటల వల్ల ఆయన విలువే దిగజారిపోతుందన్నారు. ఇకముందు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును ఇదేవిధంగా పదజాలంతో మాట్లాడితే అంతకు పదిరెట్లు తాము కూడా మాట్లాడుతామని హెచ్చరించారు.
మిర్యాలగూడ పట్టణంలో కౌన్సిలర్లను నామినేషన్ వేయకుండా బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏదో ఉద్ధేశ్యంతో ఆయన కుటుంబ సభ్యులతో నామినేషన్ దాఖలు చేయించారని, అది బెడిసి కొట్టడంతో ఒక కట్టుకథ అల్లి ప్రజలకు చెప్తున్నారని తెలిపారు. ఆయన ఎమ్మెల్యే అయి రెండేండ్లు దాటినా కూడా ఇంతవరకు మిర్యాలగూడ పట్టణానికి తెచ్చిన నిధులేమి లేవన్నారు. అట్టహాసంగా నాలుగు ఫ్లై ఓవర్లు నిర్మిస్తానని శంకుస్థాపన చేసి ఏడాదిన్నర దాటినా ఇప్పటివరకు పనులను ప్రారంభించలేదన్నారు. నియోజకవర్గంలో లిఫ్టులు ఎప్పుడో మంజూరు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నారని, ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు దాటినా కూడా వారు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అవి పూర్తయితే 40 వేల ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి బాధ్యతాయుతంగా మాట్లాడితే ప్రజలు గౌరవిస్తారని, మాటలు తూలితే ప్రజలే తగిన గుణపాఠం చెప్పక తప్పదన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు అన్నభీమోజు నాగార్జునాచారి, నల్లమోతు సిద్ధార్ధ, దుర్గంపూడి నారాయణరెడ్డి, నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, చిర్ర మల్లయ్యయాదవ్, కట్టా మల్లేష్ గౌడ్, కుందూరు వీరకోటిరెడ్డి, హాతీరాం పాల్గొన్నారు.